Homeఆంధ్రప్రదేశ్‌Food Poison: వివాహ వేడుకల్లో కుప్పకూలిన 600 మంది..ఏం జరిగిందో తెలిసేలోగా..

Food Poison: వివాహ వేడుకల్లో కుప్పకూలిన 600 మంది..ఏం జరిగిందో తెలిసేలోగా..

Food Poison: గంటల వ్యవధిలో ఆ ఇంట పెళ్లిబజాలు మోగనున్నాయి. ఊరంతా ఒకటే హడావుడి. వేలాది మంది బంధు మిత్రులు  చేరుకున్నారు. సందడి సందడిగా గడిపారు. అయితే ఇలా ఉన్నవారు ఉన్నట్టుండి కళ్లుతిప్పి పడిపోవడం, వాంతులు, విరేచనాలు చేసుకోవడంతో కలకలం రేగింది. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 600 మంది ఒకేసారి అస్వస్థతకు గురికావడంతో ఆందోళన నెలకొంది. పెళ్లి నిర్వాహకులకు సైతం ఏంచేయాలో పాలుపోలేదు. అక్కడే అందుబాటులో ఉన్న వాహనాల్లో కొందర్ని.. అంబులెన్స్ లో మరికొందర్ని ఆస్పత్రులకు చేర్చారు. అక్కడా ఇక్కడా తేడా లేకుండా చెట్ల కిందకూడా వైద్యం అందించారు. దీంతో వారంతా తేరుకున్నారు. పెళ్లి నిర్వాహకులు ఊపిరిపీల్చుకున్నారు. విజయనగరం జిల్లాలో వెలుగుచూసింది ఈ ఘటన

పూసపాటిరేగ మండలం కొవ్వాడ అగ్రహారంలో ఓ ఇంట్లో శనివారం వివాహం జరగనుంది. అయితే శుక్రవారం నాటికే బంధువులు, మిత్రులు కళ్యాణ వేదిక వద్దకు చేరుకున్నారు. సన్నహాకంగా శుక్రవారం కూడా భోజనాలు ఏర్పాటుచేశారు. 2 వేల మందికి తగ్గట్టు వంటలు చేశారు. రెండు రకాల బిర్యాని, స్వీట్‌, పుట్టగొడుగు, బంగాళాదుంప, సాంబారు, పెరుగు, తదితర పదార్థాలు వడ్డించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల మధ్య సుమారు 2 వేల మంది వరకు భోజనాలు చేశారు. మధ్యాహ్నం  3 గంటల సమయంలో చిన్నారులు, పెద్దలు, వృద్ధులు కలిపి 600 మంది వరకు అస్వస్థతకు గురయ్యారు. ఒక్కొక్కరుగా వాంతులు, విరోచనాలు, కడుపునొప్పి, తలనొప్పితో పడిపోతుండడంతో పెళ్లి వేడుకలో కలకలం రేగింది. ఏమి జరిగిందో తెలియక అక్కడ ఉన్నవారంతా ఆందోళనకు గురయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎనిమిది 108 వాహనాలతో పాటు పలు సంస్థలు, పరిశ్రమలకు చెందిన అంబులైన్స్‌ల్లో బాధితులను పూసపాటిరేగ, భోగాపురం ఆస్పత్రులకు తరలించారు. దీంతో బాధితులు, బంధువులతో ఆస్పత్రులు కిటకిటలాడాయి.

కానీ ఒకేసారి వందలాది మంది అస్వస్థతకు గురికావడంతో వైద్యసేవలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.  సరిపడ మంచాలు లేక ఒక్కో మంచంపై ఇద్దరేసి, ముగ్గురేసి బాధితులను ఉంచి వైద్యం అందిస్తున్నారు. మరికొందరికి నేలపైనే పడుకోబెట్టి వైద్యం అందించారు. ఇంకొందరికి బయట వరండాల్లో సిమెంట్‌ బెంచీలపై చికిత్స చేస్తున్నారు. వైద్య సిబ్బంది చాలకపోవడంతో సెలవుపై ఉన్న వారిని కూడా అధికారులు రప్పించారు. సిలైన్‌ బాటిల్స్‌ పెట్టడానికి స్టాండులు లేకపోవడంతో చాలామంది బాధితుల కుటుంబ సభ్యులే చేతితో వాటిని పట్టుకున్న పరిస్థితి ఏర్పడింది. చిన్నారులు మంచాలపై పడి ఉండడాన్ని చూసి తల్లిదండ్రులు రోదిస్తున్నారు. కాగా  ఫుడ్ పాయిజన్ కారణంగానే ఈ ఘటన చోటుచేసుకుంది. కూరలో వినియోగించిన పుట్టగొడుగే కారణమని వైద్యులు నిర్ధారించారు. కాగా ఈ ఘటనతో ఎంతో సందడిగా ఉండాల్సిన కళ్యాణ వేదిక ఖాళీగా దర్శనమిచ్చింది. సాదాసీదాగా వివాహ తంతును జరిపించాల్సి వచ్చింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version