Andhra Cricket Association: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్( Andhra Cricket Association) సుదీర్ఘ చరిత్ర ఉంది. బీసీసీఐ తరఫున క్రికెట్ వ్యవహారాలు నడిపిస్తూ ఉంటుంది ఏపీ క్రికెట్ అసోసియేషన్. అయితే గత కొంతకాలంగా రాజకీయ జోక్యం పెరిగింది. మొన్నటి వరకు విజయసాయిరెడ్డి పెత్తనం నడిచింది. వైసీపీ అధికారం కోల్పోవడంతో పాత కార్యవర్గం తప్పుకుంది. కొత్తగా టిడిపి నాయకుల నేతృత్వంలో కమిటీ ఏర్పాటు అయింది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఆంధ్రా క్రికెట్ ఆసోసియేషన్కు అధ్యక్షుడయ్యారు. రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ కార్యదర్శిగా ఎంపికయ్యారు. అయితే ఆ ఇద్దరి మధ్య ఇప్పుడు విభేదాలు ప్రారంభమైనట్లు ప్రచారం నడుస్తోంది. ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి విభేదాలు నడుస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ఇద్దరు ఎంపీలు లోకేష్ కు అత్యంత సన్నిహితులు. దీంతో లోకేష్ వద్దకు ఆ పంచాయతీ చేరినట్లు సమాచారం.
* కొద్ది నెలల కిందటే ఎంపిక
ఎన్నికల్లో విజయవాడ నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేశారు కేశినేని చిన్ని( Kesi neni Chinni) . సోదరుడు నాని పై గెలుపొందారు. అయితే లోకేష్ అండదండలతోనే చిన్ని తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. మరోవైపు సానా సతీష్( Sana Satish ) ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ అయ్యారు. చాలామంది ఆశావహులు ఉన్నా.. లోకేష్ పెద్దపీట వేయడంతోనే సతీష్ కు రాజ్యసభ పదవి దక్కిందన్న ప్రచారం ఉంది. అయితే ఇప్పుడు ఆ ఇద్దరూ ఎంపీలు ఏపీ క్రికెట్ అసోసియేషన్ లో కీలకంగా ఉన్నారు. ఇటువంటి సమయంలో వారి మధ్య విభేదాలు.. లోకేష్ కు తలనొప్పిగా మారాయి. ఏపీ క్రికెట్ అసోసియేషన్ లో విభేదాల పర్వం పరిష్కరించాల్సిన అవసరం లోకేష్ పై ఏర్పడింది. ముఖ్యంగా అసోసియేషన్ లో విధానపరమైన అంశాలకు సంబంధించి అధ్యక్షుడు చిన్ని ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని సతీష్ చెబుతున్నారు. కానీ చిన్ని మాత్రం సతీష్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహంతో ఉన్నారు.
* పాలకవర్గంతో సంబంధం లేకుండా
అధ్యక్షుడిగా ఉన్న చిన్ని పాలకవర్గంతో( Association) సంబంధం లేకుండా హామీలు ఇస్తున్నారని.. కోట్లాది రూపాయలు విరాళం ప్రకటిస్తున్నారని.. అటువంటి వాటికి నాతో సంబంధం లేదని సానా సతీష్ తేల్చి చెబుతున్నారు. కార్యదర్శిగా ఆ డబ్బుల విడుదలకు ఆసక్తి చూపడం లేదు సతీష్. వాస్తవానికి అసోసియేషన్ లో చెక్ పవర్ కార్యదర్శితో పాటు కోశాధికారి కి మాత్రమే ఉంటుంది. కానీ వీరిద్దరితో సంబంధం లేకుండా అధ్యక్షుడిగా ఉన్న చిన్ని విజయవాడ వరదలకు సాయం, ఆస్ట్రేలియాలో రాణించిన విశాఖ కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డికి ప్రోత్సాహం ప్రకటించారు. అయితే ఇందుకు సంబంధించి నిధుల విడుదలకు సతీష్ ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది.
* మంత్రి నారా లోకేష్ దృష్టికి
అయితే ఈ పంచాయితీ మంత్రి నారా లోకేష్( Nara Lokesh ) వద్దకు వెళ్లినట్లు సమాచారం. సానా సతీష్ సహాయ నిరాకరణ పై చిన్ని ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇద్దరు ఎంపీలు లోకేష్ కు సన్నిహితులు కావడంతో ఆయనకు ఎటు పాలు పోవడం లేదు. అసోసియేషన్ ఏర్పాటు చేసి ఆరునెలలే అవుతున్న క్రమంలో ఈ విభేదాలు ఏమిటి అని తల పట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇద్దరినీ పిలిచి మాట్లాడేందుకు లోకేష్ సిద్ధపడినట్లు సమాచారం. మరి వీరి మధ్య విభేదాలు సమసిపోతాయా? లేకుంటే కొనసాగుతాయా? అన్నది తెలియాల్సి ఉంది.