TTD
TTD: తిరుమలలో వన్యప్రాణులు హల్ చల్ చేస్తున్నాయి. జనారణ్యంలోకి వస్తున్నాయి. భక్తుల ప్రాణాలను బలిగొంటున్నయి. టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా.. ఇటీవల వాటి సంచారం అధికమైంది. ఇన్నాళ్లు శేషాచలం అడవులకే పరిమితమైన వన్యప్రాణులు తిరుపతి నడక మార్గానికి వచ్చి మరి భక్తులపై దాడి చేస్తున్నాయి. అయితే ఇది ముమ్మాటికీ మానవ తప్పిదమేనని నిపుణులు చెబుతున్నారు. భక్తుల భద్రతకు పెద్దపీట వేయకపోవడం, ఇష్టారాజ్యంగా దుకాణాల ఏర్పాటు, రక్షణ గోడను పునరుద్ధరించకపోవడం తదితర కారణాలే వన్యప్రాణుల స్వైర విహారానికి కారణమని విశ్లేషిస్తున్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం.. తిరుమల తిరుపతి దేవస్థానం. కులాలతో సంబంధం లేకుండా ఒక్కసారైనా దర్శించుకోవాలనుకునే అంతటి ప్రాచుర్యం పొందిన దైవం వెంకటేశ్వరుడు. అంతర్జాతీయ స్థాయిలోనే విశిష్టత కలిగిన ఈ దేవాలయం విషయంలో ఎప్పుడైతే రాజకీయ జోక్యం పెరిగిందో.. అప్పటి నుంచే ప్రతికూల అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. తిరుమల ఆలయ పాలనా బాధ్యతలు నిర్వర్తించేందుకు బ్రిటిష్ ప్రభుత్వం 1933లో కమిషనర్ల నేతృత్వంలో పాలకమండలి వ్యవస్థను ఏర్పాటు చేసింది. స్వాతంత్ర్యం అనంతరం.. 1951 లో చేసిన హిందూమత చట్ట ప్రకారం.. కమీషనర్లందర్నీ కార్యనిర్వాహక అధికారులు(ఈవో)గా మార్చారు. అటు తర్వాత టిటిడి ధర్మకర్తల మండలి ఏర్పాటు చేసి.. దానికి పాలకవర్గాన్ని నియమించారు. అప్పటినుంచి దానినే కొనసాగిస్తున్నారు.
అయితే రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఈ దేవస్థానం విషయంలో రాజకీయ పార్టీల జోక్యం పెరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గం రాజకీయ నిరుద్యోగులకు.. కొలువుల వేదికగా మారింది. ప్రభుత్వాలు తగిన నియమ నిబంధనలు పాటించకపోవడం, ఆధ్యాత్మిక అంశాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా చైర్మన్, సభ్యులను నియమించడం వివాదాలకు కారణమవుతోంది. ముందూ,వెనుకా ఆలోచన లేకుండా ఎవరికి పడితే వారిని నియమించడంతో ఆలయ నిర్వహణపై ప్రభావం చూపుతోంది.ముఖ్యంగా గత రెండు దశాబ్దాలుగా టీటీడీ పాలకమండలి నియామకాల్లో కనీస నిబంధనలు కూడా పాటించలేదు. తిలాపాపం తలా పిడికెడు అన్నట్టు కాంగ్రెస్,టిడిపి, వైసిపి ప్రభుత్వాలు రాజకీయ కోణంలోనే టీటీడీ పాలకవర్గాల నియామకాలను చేపట్టాయి. చివరకు అన్యమతస్తులను సైతం టీటీడీ పీఠంపై కూర్చోబెట్టాయన్న అపవాదును ఎదుర్కొన్నాయి. భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పుట్టా సుధాకర్ యాదవ్ లాంటి వారి విషయంలో ఇవే రకమైన ఆరోపణలు వచ్చాయి. కానీ టిడిపి, వైసిపి ప్రభుత్వాలు ఎక్కడా వెనక్కి తగ్గలేదు. వారినే కొనసాగించాయి.
ఇప్పుడు తాజాగా తిరుమలలో వన్యప్రాణులు భక్తుల ప్రాణాలను బలిగొంటున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్ర మసకబారుతోంది. దీనికి ముమ్మాటికీ టిడిపి, వైసిపి లే బాధ్యత వహించాలన్న డిమాండ్ ప్రజల నుంచి వినిపిస్తోంది. భక్తుల రక్షణకు పెద్దపీట వేయకపోగా.. టీటీడీ నిధులు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు ఆ రెండు పార్టీలపై ఉన్నాయి.
టీటీడీ పాలకమండలి అంటే భక్తుల సేవకు పెద్దపీట వేయాలి. కానీ రాజకీయ సిఫారసులతో కొలువు దీరుతున్న పాలకవర్గాలు వ్యాపార సంస్థలు గా మారిపోతున్నాయి. ఆదాయ మార్గాలను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. గతంలో నడకదారిలో ఫెన్సింగ్ ఉండేది. కానీ షాపులను ఏర్పాటు చేసి కంచెలు, ఫెన్సింగ్ ను తీసేశారు. పారిశుధ్యానికి పెద్దపీట వేయడం లేదు. ఎక్కడపడితే అక్కడ ఆహార పదార్థాలను, ఇతర వ్యర్ధాలను పారబోస్తున్నారు. వాటిని తినేందుకు వస్తున్న వన్యప్రాణులు భక్తులపై దాడి చేస్తున్నాయి. వారి విలువైన ప్రాణాలను బలిగొంటున్నాయి. ఇప్పుడు చిన్నారుల ప్రాణాలు పోతుండడంతో వైసిపి, టిడిపి మొసలి కన్నీరు కార్చుతున్నాయి. భక్తులు మాత్రం ఆ రెండు పార్టీల దోపిడీయే నేటి పరిస్థితి కారణమని ఆరోపిస్తున్నారు.
ఇటీవల పరిణామాల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. నడక మార్గంలో చిన్నారుల రాకపోకల పై ఆంక్షలు విధించారు. ప్రతి ఒక్క భక్తుడికి ఊత కర్ర ఇవ్వాలని నిర్ణయించారు. అయితే అసలు సిసలైన భద్రతా చర్యలను మరిచి ఇటువంటి నిర్ణయాలు ఏంటి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. టీటీడీ తీసుకున్న నిర్ణయాలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సోషల్ మీడియాలో పోస్టులు వెలుస్తున్నాయి. ట్రోల్ అవుతున్నాయి. నెటిజెన్లు మండిపడుతున్నారు.