Dharmanna and Thammineni: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలో క్రమశిక్షణ కట్టు దాటుతోంది. నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు విషయంలో నేతలు చేస్తున్న ప్రకటనలు ప్రకంపనలు రేపుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో తాజాగా సీనియర్ నేత ధర్మాన కృష్ణ దాస్ చేసిన ప్రకటన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బందుల్లో పెట్టినట్టు ఉంది. సీనియర్ నేతగా ఉన్న ధర్మాన కృష్ణ దాస్.. ఆ జిల్లా పార్టీ అధ్యక్షుడు కూడా. అయితే వచ్చే ఎన్నికల్లో తమ్మినేని పోటీ విషయంలో ఆయన చేసిన ప్రకటన మాత్రం పొలిటికల్ వర్గాల్లో హీట్ రేపుతోంది. వచ్చే ఎన్నికల్లో తమ్మినేని సీతారామును తప్పించి మరొకరిని పోటీ చేయిస్తామన్న ధర్మాన కృష్ణ దాస్ ప్రకటనపై దువ్వాడ శ్రీనివాస్ విభిన్న ప్రకటనలు చేస్తున్నారు. కాళింగ సామాజిక వర్గాన్ని తెరపైకి తెస్తున్నారు.
రగిలిపోతున్న దువ్వాడ శ్రీనివాస్..
కొద్దిరోజుల కిందట దువ్వాడ శ్రీనివాస్ పై( Duvvada Srinivas) సస్పెన్షన్ వేటు వేసింది హై కమాండ్. వ్యక్తిగత కుటుంబ వివాదాలతో ఆయనపై వేటు వేయాల్సి వచ్చింది. అయితే దీని వెనుక ధర్మాన బ్రదర్స్ కుట్ర ఉంది అన్నది దువ్వాడ చేస్తున్న ఆరోపణ. కింజరాపు కుటుంబంతో కలిపి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేస్తున్నారని ఆరోపణ చేస్తున్నారు. తన ఓటమి వెనుక ధర్మాన కుటుంబ హస్తం ఉందని కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఈ పరిస్థితుల్లో ధర్మాన బ్రదర్స్ పై పెద్ద యుద్ధమే ప్రకటించారు దువ్వాడ. దానికి కాళింగ సామాజిక వర్గం ను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం మొదలుపెట్టారు. ఆ సామాజిక వర్గం ద్వారానే తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రీఎంట్రీ ఇవ్వడానికి ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు.
ఎంపీగా కొత్త అభ్యర్థి..
అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం( Sitaram ) ఆమదాలవలస నియోజకవర్గ వైసిపి ఇన్చార్జిగా ఉండేవారు. ఆయనను తప్పించి యువకుడైన చింతాడ రవికుమార్ కు ఆ బాధ్యతలు అప్పగించారు జగన్మోహన్ రెడ్డి. అప్పటినుంచి తమ్మినేని సీతారాం కూడా మనస్థాపంతో ఉంటూ వస్తున్నారు. ఆయన సైతం కాళింగ సామాజిక వర్గానికి చెందిన నేత. ఇటువంటి పరిస్థితుల్లో టెక్కలి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయ సమావేశానికి జిల్లా అధ్యక్షుడి హోదాలో హాజరయ్యారు కృష్ణదాస్. ఈ క్రమంలో వచ్చే పార్లమెంటరీ ఎన్నికల్లో రామ్మోహన్ నాయుడుకు ధీటుగా సరైన అభ్యర్థిని రంగంలోకి దించుతామని చెప్పుకొచ్చారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఎంపీగా తమ్మినేని పోటీ చేస్తారని ప్రచారం నడిచింది. అయితే ఆయనకు పెద్దల సభకు కానీ ఎమ్మెల్సీ పదవి గానీ ఇస్తామని కృష్ణ దాస్ చెప్పడం దువ్వాడ శ్రీనివాస్ ఆయుధంగా మలుచుకున్నారు. కాళింగ సామాజిక వర్గాన్ని తరుపైకి తెస్తూ.. కింజరాపు, ధర్మాన బ్రదర్స్ ను కేడి బ్రదర్స్ తో పోల్చారు. వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నేరుగా హెచ్చరించలేదు. కానీ ధర్మాన బ్రదర్స్ కు హెచ్చరించడం ద్వారా హై కమాండ్ కు పరోక్ష సంకేతాలు పంపగలిగారు.