Pawan Kalyan: ఏపీలో పొత్తుల వ్యవహారం ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. చంద్రబాబు ఢిల్లీలో బిజెపి అగ్రనేతలతో భేటీ అయిన సంగతి తెలిసిందే. దీంతో టిడిపి ఎన్డీఏ లో చేరుతుందని ప్రచారం జరుగుతోంది. 2014 పొత్తులు రిపీట్ అవుతాయని విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే పవన్ కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. చంద్రబాబు, పవన్ లు కలిసే బిజెపి అగ్ర నేతలతో చర్చలు జరపనున్నట్లు సమాచారం. ముఖ్యంగా సీట్ల పంపకాల విషయమై ఒక స్పష్టత వచ్చాక.. మూడు పార్టీల నుంచి ఉమ్మడి ప్రకటన వస్తుందని తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీ సుదీర్ఘకాలం ఎన్డీఏలో కొనసాగింది. గత ఎన్నికలకు ముందు విధానపరమైన అంశాల్లో తలెత్తిన విభేదాలతో చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. గత ఎన్నికల అనంతరం జనసేన ఎన్డీఏలో చేరింది. ఇప్పుడు మరోసారి టిడిపి ఎన్డీఏలో చేరితే ఆ మూడు పార్టీలు ఏకతాటిపైకి వచ్చినట్టే. అయితే పొత్తులో భాగంగా బిజెపి,జనసేన దాదాపు 50 అసెంబ్లీ, 10 ఎంపీ స్థానాలను కోరుతున్నాయి. చంద్రబాబు మాత్రం 8 ఎంపీ స్థానాలు, 35 అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు సిద్ధపడినట్లు సమాచారం. దీనిపైనే చర్చించేందుకు బిజెపి అగ్ర నేతలు పవన్ ను ప్రత్యేకంగా పిలిపించుకున్నట్లు తెలుస్తోంది. పొత్తు కుదిరిన మరుక్షణం ఉమ్మడి అజెండా, మేనిఫెస్టో అంశాల పైన చర్చించే అవకాశం ఉంది. టిడిపి ఎన్డీఏలో చేరిక ప్రకటన ఈరోజు కానీ.. రేపు కానీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే టిడిపి, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ పూర్తయినట్లు సమాచారం. జనసేనకు 25 నుంచి 27 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు టిడిపి అంగీకరించినట్లు తెలుస్తోంది. రెండు ఎంపీ స్థానాలు ప్రతిపాదించినా.. మూడో స్థానంగా అనకాపల్లి ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో బిజెపి ఎనిమిది ఎంపీ స్థానాలు, 25 అసెంబ్లీ సీట్లు కోరినట్లు సమాచారం. చంద్రబాబు మాత్రం ఐదు ఎంపీ స్థానాలు, 15 అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే జనసేన, బిజెపికి మొత్తం 50 అసెంబ్లీ సీట్లు, పది ఎంపి స్థానాలు ఇవ్వాలని బిజెపి అగ్ర నేతలు కోరుతున్నట్లు సమాచారం. అందుకే ఢిల్లీ పెద్దలు పవన్ కు పిలిపించుకున్నట్లు తెలుస్తోంది.
అయితే పార్టీకి బలం ఉన్న నియోజకవర్గాల్లో మాత్రమే పోటీ చేయాలని పవన్ ఒక నిర్ణయానికి వచ్చారు. బలము లేని చోట్ల సీటు తీసుకున్నా.. అది వైసీపీకి ప్రయోజనం చేకూర్చుతుందని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఇప్పుడు బిజెపి సైతం ఎక్కువ సీట్లు అడుగుతుండడంతో పవన్ సర్దుబాటు చేసే అవకాశం ఉంది. అటు ఇటుగా సర్దుబాటు చేసి పొత్తును ఒక కొలిక్కి తెచ్చే బాధ్యతను పవన్ తీసుకుంటారని సమాచారం. ఈరోజు రాత్రి చంద్రబాబుతో పాటే పవన్ బిజెపి అగ్రనేతలతో సమావేశం కానున్నారు. ఈ చర్చలు సవ్యంగా పూర్తయితే రేపు 3 పార్టీల ఉమ్మడి వేదికగా పొత్తును ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.