AP BJP: ఏపీలో పొత్తుల అంశం క్లైమాక్స్ కు చేరిందా? బిజెపి సీట్ల సర్దుబాటు పై దృష్టి పెట్టిందా? పురందేశ్వరి ఢిల్లీ ప్రయాణం అందులో భాగమేనా? చంద్రబాబుతో పవన్ ఇదే చర్చించారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఈరోజు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఢిల్లీ వెళ్ళనున్నారు. రేపు చంద్రబాబుతో పాటు పవన్ సైతం ఢిల్లీ బాట పట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే బిజెపి కూటమిలోకి వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. మరోవైపు టిడిపి ఎన్డీఏలోకి ఎంట్రీ ఖాయమని తేలుతోంది.
నెల రోజుల కిందట చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. బిజెపి అగ్రనేత అమిత్ షా తో సమావేశం అయ్యారు. పొత్తులపై చర్చలు జరిపారు. దీంతో పొత్తులు ఖాయమని ప్రచారం జరిగింది. కానీ నెలలు గడుస్తున్నా దీనిపై క్లారిటీ రావడం లేదు. చంద్రబాబు నోరు తెరవడం లేదు. బిజెపి అగ్రనేతలు స్పందించలేదు. మరోవైపు టిడిపి, జనసేన సంయుక్తంగా అభ్యర్థులను ప్రకటించాయి. అదే సమయంలో బిజెపి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసింది. హై కమాండ్ కు నివేదించింది. అటు టిడిపి, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనకు సిద్ధపడగా.. మరోవైపు రాష్ట్ర బీజేపీ సైతం మేనిఫెస్టోను రూపొందించే పనిలో పడింది. దీంతో పొత్తులు ఉంటాయో? లేదో? అన్న బలమైన చర్చ నడిచింది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే పురందేశ్వరికి ఢిల్లీ పిలుపు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మరోవైపు రేపు చంద్రబాబు ఢిల్లీ వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇంటికి వెళ్లి చర్చించారు. దీంతో పొత్తులకు సానుకూల సంకేతాలు ఢిల్లీ నుంచి వచ్చాయని ప్రచారం ప్రారంభమైంది. ఇప్పటికే తెలుగుదేశం, జనసేన సంయుక్తంగా 99 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఇంకా 76 చోట్ల పెండింగ్ లో పెట్టారు. అందులో జనసేన పోటీ చేయబోయే 19 నియోజకవర్గాలు ఉన్నాయి. మిగతా స్థానాల్లో టిడిపి, బిజెపి పంచుకోవాల్సి ఉంటుంది. అయితే బిజెపి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆ పార్టీకి ఎన్ని స్థానాలు దక్కుతాయి? ఎక్కడెక్కడ కేటాయిస్తారు అన్నది చర్చ నడుస్తోంది.
అయితే బిజెపి ఎక్కువగా పార్లమెంట్ స్థానాలు కోరుతున్నట్లు సమాచారం. నాలుగు పార్లమెంట్ స్థానాలు, నాలుగు అసెంబ్లీ సీట్లు ఇస్తారని ఎల్లో మీడియా ప్రచారం చేసింది. కానీ అందుకు బిజెపి ఒప్పుకునే ఛాన్స్ లేదు. అందుకే ఇన్ని రోజులు పొత్తు ప్రకటనలో జాప్యం జరిగిందని.. బిజెపి అడిగినన్ని సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు మొగ్గు చూపారని.. అందుకే ఢిల్లీ నుండి సంకేతాలు వచ్చాయని ప్రచారం జరుగుతోంది. మొత్తానికైతే అటు పురందేశ్వరి ఢిల్లీ వెళ్లడం, ఇటు పవన్ వచ్చి చంద్రబాబుతో చర్చలు జరపడంతో.. పొత్తు క్లైమాక్స్ కు వచ్చిందని టాక్ నడుస్తోంది. మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి.