YS Sharmila: కాంగ్రెస్ లో షర్మిల పార్టీ విలీనం ఖాయం అయ్యింది.వారంరోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. ఇదే సందర్భంలో ఏపీ కాంగ్రెస్ నాయకత్వ బాధ్యతలను షర్మిలకు అప్పగించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే వైసిపి అసంతృప్తి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తాను షర్మిల వెంట నడుస్తానని ప్రకటించారు. జగన్ ప్రభుత్వం పై విమర్శలు కూడా చేశారు. షర్మిల కాంగ్రెస్ బాధ్యతలను తీసుకుంటే వైసీపీని టార్గెట్ చేస్తారని ఆళ్ల రామకృష్ణారెడ్డి చర్యల ద్వారా తెలిసింది.
అయితే ఒక్క ఆళ్ల రామకృష్ణారెడ్డి కాదు.. చాలామంది వైసిపి అసంతృప్త ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్లు సమాచారం. దీనిని ధ్రువీకరిస్తూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రుద్రరాజు హాట్ కామెంట్స్ చేశారు. త్వరలో షర్మిల కాంగ్రెస్ లో చేరబోతున్నారని స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన అత్యున్నత సమావేశంలో మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ ఈ విషయాన్ని తెలిపారని.. చాలామంది వైసిపి నేతలు కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.
వైసీపీలో భారీ మార్పులతో చాలామందికి టిక్కెట్లు దక్కే అవకాశం లేదు. టిడిపి, జనసేనలో చేరే ఆప్షన్ లేనివారు కాంగ్రెస్ వైపు వెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో గెలుపుతో ఊపు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఏపీలో కూడా దూకుడు పెంచుతుందని.. షర్మిల కాంగ్రెస్ నాయకత్వ బాధ్యతలు తీసుకుంటే వైయస్ అభిమానులతో పాటు చాలామంది నాయకులు ఆ పార్టీ నీడన చేరే అవకాశం ఉంది. అటు తెలంగాణతో పాటు ఇటు కర్ణాటక నుంచి సైతంకాంగ్రెస్ పార్టీకి బలం అందుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎంత ఎదిగితే వైసీపీకి అంత నష్టం కాబట్టి.. చంద్రబాబు సైతం తన వంతు పాత్ర పోషిస్తారు. కాంగ్రెస్ ఎదుగుదలకు సహకరిస్తారు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికైతే కాంగ్రెస్ లో షర్మిల పార్టీ విలీనం, ఏపీ పగ్గాలు అందుకోవడం ఖాయం కావడంతో అధికార వైసీపీలో ఒక రకమైన కలవరం కనిపిస్తోంది. షర్మిల రూపంలో కాంగ్రెస్ పార్టీని జగన్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.