Jagan: మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress) పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. వైసిపి హయాంలో పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేశారు. భూముల రీసర్వే ప్రక్రియ పూర్తయిన తర్వాత కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చారు.. అయితే ఈ పుస్తకాలపై జగన్ ఫోటోలు ఉండడం అప్పట్లో పెద్ద దుమారానికి దారితీసింది. టిడిపి తో పాటు విపక్షాలు దీనిని తప్పుపట్టాయి. కానీ అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డి తో పాటు మంత్రులు సమర్ధించుకున్నారు. అందులో తప్పేంటి అని నిలదీసినంత పని చేశారు. దానిని ప్రజల్లోకి తీసుకెళ్ళింది తెలుగుదేశం పార్టీ. ఒక విధంగా గ్రామీణ ప్రాంతాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తుడుచుపెట్టుకుపోయేందుకు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రధాన కారణం. ప్రజల్లో ఒక రకమైన ఆందోళన ఉండేది. దానికి తగ్గట్టుగానే వైసీపీ సమాధానం ఉండేది. అయితే ప్రజల మనోభావాలను గుర్తించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
* మంత్రివర్గ సమావేశంలో చర్చ..
అయితే కూటమి అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతోంది. పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ ( Y S Jagan Mohan Reddy ) ఫోటో మాత్రం తొలగించలేదు. దీనిపై సోషల్ మీడియా వేదికగా రకరకాల ప్రచారం నడుస్తోంది. మెయిన్ మీడియాలో సైతం కథనాలు వస్తున్నాయి. దీనిపై రచ్చ నడుస్తుండడంతో సీఎం చంద్రబాబు స్పందించారు. నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో దీనిపైనే చర్చించారు. కేవలం జగన్ ఫోటో ఉన్న పట్టాదారు పాసుపుస్తకాలను తిరిగి ప్రభుత్వ చిహ్నంతో ముద్రించాలి అంటే దాదాపు 50 నుంచి 70 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. అయితే ఇది ప్రజల భావోద్వేగంతో కూడిన విషయం కాబట్టి.. ఎంత ఖర్చు అయినా పర్వాలేదని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు ఇచ్చారట.
* రీ సర్వే పై నిర్ణయం..
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన ప్రాంతాల్లో భూముల రీసర్వే( land reserve ) పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిన్ననే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వీలైనంత త్వరగా భూముల రీ సర్వే పూర్తి చేసి.. కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందించాలని భావిస్తున్నారు. గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది తెచ్చి పెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయడం అనేది ఇప్పటి ప్రభుత్వానికి భారంగా పరిగణించింది. అయితే ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాలి అంటే జగన్ ఫోటోలను తక్షణం తొలగించాల్సి ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది పుస్తకాలను ముద్రించడం కష్టతరమే. కానీ ప్రజలు కోరుకున్నది కాబట్టి పూర్తి చేయాల్సిన అవసరం కూటమి ప్రభుత్వం పై ఉంది.