CM Jagan: సాధారణంగా జగన్ ఆకస్మిక నిర్ణయాలు తీసుకోరు. ఒక వ్యూహం ప్రకారమేఅడుగులు వేస్తారు.అందుకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఇటీవల మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆకస్మిక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా సిద్ధం సభల విషయంలో ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నారు. వైసిపి గ్రాఫ్ తగ్గుతోందని.. విపక్షాలకు మద్దతు పెరుగుతోందని జరుగుతున్న ప్రచారానికి ఎప్పటికప్పుడు చెక్ చెబుతున్నారు. మరోవైపు తన నిర్ణయాలను వ్యతిరేకిస్తూ చాలామంది పార్టీని వీడుతున్నారు. అటువంటి నాయకులు పార్టీ నుంచి బయటకు వెళ్తున్నా.. పార్టీ బలియంగా ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మూడు ప్రాంతాల్లో సిద్ధం సభలు ఏర్పాటు చేయాలని జగన్ భావించారు. ఉత్తరాంధ్రలోని భీమిలిలో మొదటి సభను నిర్వహించారు. రెండో సభను దెందులూరు లో ఏర్పాటు చేశారు. మూడో సభను అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించారు. అయితే ఈ సభలకు భారీగా జన సమీకరణ చేయడంలో వైసీపీ నేతలు సక్సెస్ అయ్యారు. ఇదే ఊపుతో సిద్ధం సభలను కొనసాగించాలని జగన్ భావిస్తున్నారు. తాజాగా నాలుగో సభకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. గుంటూరు- ప్రకాశం సరిహద్దుల్లోని మేదరమెట్లలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 400 ఎకరాల విస్తీర్ణం కలిగిన భూమిలో ఈ సభ ఏర్పాటు చేస్తుండడం విశేషం.
వాస్తవానికి ఈ సభను గత నెల 11న ఏర్పాటు చేయాలని జగన్ భావించారు. కానీ ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాలో జరిగిన రాజకీయ పరిణామాలతో వెనక్కి తగ్గారు. దీంతో రాప్తాడు సభకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు ఈ సమావేశానికి హాజరయ్యారు. దాదాపు పది లక్షల మంది వచ్చారని వైసీపీ వర్గాలు చెబుతుండగా.. రెండు లక్షల వరకు వచ్చి ఉంటారని విపక్షాలు చెబుతున్నాయి. అయితే ఈ సభతో వైసీపీ నుంచి టిడిపి, జనసేనలోకి వలసలు ఆగాయని.. వచ్చే ఎన్నికల్లో వైసిపి గెలుపు ఖాయమన్న సంకేతాలు వచ్చాయనిజగన్ భావిస్తున్నారు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా సిద్ధం సభలనుఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అందులో భాగంగా మేదరమెట్లలో సభను సక్సెస్ చేసి.. వైసీపీకి తిరుగు లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో వైసిపి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. నెల్లూరు నుంచి కీలక నేతలు బయటకు వెళ్లిపోవడం, ప్రకాశం జిల్లాలో బాలినేని ఎపిసోడ్, కీలక నేతలు జారిపోనుండడం, నరసరావుపేట, మచిలీపట్నం ఎంపీలు దూరం కావడం తదితర కారణాలతో పార్టీ బలహీనంగా కనిపిస్తోంది. ఇటువంటి తరుణంలో మేదరమెట్లలో సిద్ధం సభను గ్రాండ్ సక్సెస్ చేసి.. వైసీపీకి బలం తగ్గలేదని జగన్ ప్రజలకుపంపనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే సిద్ధం సభలతో అటు వైసిపి శ్రేణులకు భరోసా ఇవ్వడంతో పాటు విపక్షాలకు గట్టి హెచ్చరికలు పంపాలని జగన్ వ్యూహం రూపొందించారు. అందులో జగన్ ఎంతవరకు వర్కౌట్ అవుతారో చూడాలి.