CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) ఢిల్లీ వెళ్లారు. ఆయన ఢిల్లీ వెళ్లడం ఈ నెల రోజుల్లో ఇది రెండోసారి. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ఆయన ఢిల్లీ వెళ్లారు. కేంద్ర మంత్రులను కలిశారు. ఇప్పుడు మరోసారి ఆయన ఢిల్లీ వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. సాధారణంగా పార్లమెంట్ సమావేశాల సమయంలో ముఖ్యమంత్రులు ఢిల్లీ వెళ్లడం పరిపాటి. ఎందుకంటే ఆ సమయంలో క్యాబినెట్ మంత్రులంతా అందుబాటులో ఉంటారు. నేరుగా కలిసి పెండింగ్ ప్రాజెక్టుల విషయం చర్చించవచ్చు. ఇప్పుడు అదే పనిమీద చంద్రబాబు వెళ్లినట్లు ప్రచారం నడుస్తోంది. అయితే ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నడుమ చంద్రబాబు సడన్ టూర్ పై రకరకాల చర్చ నడుస్తోంది.
* ఆ వివాదం పైనే..
ఏపీలో తిరుమల( Tirumala) లడ్డూ వ్యవహారం హాట్ టాపిక్ గా మిగిలింది. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో లడ్డు తయారీకి సంబంధించి నెయ్యిలో జంతు కొవ్వు కలిపారు అన్నది ప్రధాన ఆరోపణ. అయితే సిబిఐ మాత్రం జంతు కొవ్వు కలిసినట్లు ఆధారాలు లేవు కానీ.. కొన్ని రకాల మిశ్రమాలతో నెయ్యి కలిపి జరిగింది అనేది తేల్చింది. అయితే కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోంది. అయితే వైసీపీని తిప్పి కొట్టడంలో బిజెపి అనుకున్న స్థాయిలో సహకారం అందించడం లేదని ఒక టాక్ ఉంది. ఈ నేపథ్యంలోనే రెండు రోజుల కిందట టిడిపి, జనసేన, బిజెపి సమన్వయ సమావేశం జరిగింది. అప్పటినుంచి బిజెపి నేతలు ఒక్కొక్కరు ముందుకు వచ్చి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరును తప్పుపడుతున్నారు. గట్టిగానే కౌంటర్ అటాక్ చేస్తున్నారు.
* రాజకీయ అంశాలు..
చంద్రబాబు ఢిల్లీ టూర్( Delhi tour ) వెనుక రాజకీయ అంశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. టీటీడీ చరిత్రను మసకబార్చేలా, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వైసిపి హయాంలో నెయ్యిలో కల్తీ జరిగింది అనేది జాతీయస్థాయిలో జరుగుతున్న చర్చ. పైగా కల్తీ జరిగింది అని సిబిఐ నిర్ధారించిన తర్వాత కూడా వైసిపి అడ్డగోలుగా మాట్లాడటం పై నేషనల్ మీడియా ఏకిపారేస్తోంది. ఇటువంటి సమయంలో ఢిల్లీలో అడుగుపెట్టడం ద్వారా నేషనల్ మీడియా ఫోకస్ అంతా ఈ అంశం పైన ఉండేలా చంద్రబాబు సడన్ టూర్ సాగినట్లు తెలుస్తోంది. కేంద్ర పెద్దలతో ఈ కల్తీ అంశంపై చర్చించి మరింత లోతుగా వెళ్లాలి అన్నది చంద్రబాబు ప్రణాళికగా తెలుస్తోంది. మరోవైపు రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పలు అంశాలను కేంద్ర పెద్దలతో చంద్రబాబు చర్చిస్తారని సమాచారం. మొత్తానికి అయితే చంద్రబాబు ఢిల్లీ సడన్ టూర్ పొలిటికల్ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
