CM Chandrababu Orders Notice: ఏపీలో( Andhra Pradesh) విచిత్ర పరిస్థితి నెలకొంది. గత వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాదిరిగా కూటమి ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. మొన్న ఆమధ్య 48 మంది ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు నోటీసులు జారీ చేసినట్లు వార్తలు వచ్చాయి. నియోజకవర్గాలకు దూరంగా నగరాల్లో గడుపుతున్నారని.. అటువంటి వారు నియోజకవర్గాలకు వెళ్లాల్సిందేనని అధినేత చంద్రబాబు ఆదేశించినట్లు కూడా తెలుస్తోంది. అయితే చంద్రబాబు గత వైసిపికి ఎదురైన ఇబ్బందులు దృష్ట్యా ముందుగానే మేల్కొన్నారని సమాచారం. గతంలో కూడా జగన్ హయాంలో ఎమ్మెల్యేలు ఇదే విధంగా వ్యవహరిస్తే ఎప్పటికప్పుడు వర్క్ షాపులు నిర్వహించి హెచ్చరికలు జారీ చేసేవారు. అయినా సరే కొంతమంది ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు. స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఎమ్మెల్యేలు ఉండేవారు కాదని.. అందుకే 2024 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దారుణ పరాజయం ఎదురైందని విశ్లేషణలు ఉన్నాయి.
గతంలో అలానే..
గతంలో జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) సంక్షేమ పథకాలకు సంబంధించి బటన్ నొక్కేవారు. రాజకీయాలకు అతీతంగా పథకాలను అమలు చేశారు. వాటినే గడపగడపకు వెళ్లి చెప్పాలని పార్టీ ఎమ్మెల్యేలను ఆదేశించేవారు. అయితే అప్పట్లో చాలామంది ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు వెళ్లేందుకు ఇష్టపడేవారు కాదు. అందులో పేరు మోసిన నేతలు కూడా ఉండేవారు. దీంతో వారి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఉదాసీనంగా ఉండేవారు. ఎమ్మెల్యేలను చూసి కాదు.. తనను చూసి ఓటు వేస్తారని జగన్మోహన్ రెడ్డి ధీమాపడ్డారు. దాని ప్రభావం ఎన్నికల ఫలితాలపై చూపించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చాయి.
నియోజకవర్గాలకు దూరంగా ఎమ్మెల్యేలు..
అయితే టిడిపి( Telugu Desam Party) హయాంలో కూడా ఓ 48 మంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు దూరంగా ఉన్నట్లు చంద్రబాబుకు ఫిర్యాదులు వచ్చాయి. నిఘా వర్గాలు కూడా దీనినే హెచ్చరించాయి. జగన్మోహన్ రెడ్డి మాదిరిగా తాను ఉదాసీనంగా వ్యవహరిస్తే ఇబ్బందులు తప్పవని చంద్రబాబు గ్రహించారు. అందుకే నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. చాలామంది ఎమ్మెల్యేల పనితీరుపై విమర్శలు ఉన్నాయి. పైగా ఇటీవల టిడిపి నేతల్లో విభేదాలు బయటపడుతున్నాయి. దీనిని ఆదిలోనే తుంచకపోతే ఇబ్బందులు తప్పవని చంద్రబాబుకు తెలుసు. అందుకే ముందస్తు నోటీసులు జారీ చేశారు. అందుబాటులో ఉన్న వారికే భవిష్యత్తు ఉంటుందని తేల్చేశారు.
ప్రభంజనం వీయడంతో..
మొన్న ఎన్నికల్లో కూటమి ప్రభంజనం వీచింది . ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 164 సీట్లలో కూటమి గెలిచింది. జనసేన అయితే పోటీ చేసిన 21 స్థానాల్లో విజయం సాధించింది. బిజెపి సైతం రెండు స్థానాలను మాత్రమే పోగొట్టుకొని ఎనిమిది సీట్లలో గెలుపొందింది. టిడిపి రికార్డు స్థాయిలో 135 సీట్లలో విజయం సాధించింది. అయితే ప్రజలు భారీ విజయాన్ని కట్టబెట్టిన నేపథ్యంలో చంద్రబాబు ముందే మేల్కొన్నారు. ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలను హెచ్చరిస్తూ వచ్చారు.. అయినా సరే వారి వైఖరిలో మార్పు రావడం లేదు. అందుకే ఇప్పుడు ఏకంగా నోటీసులు ఇచ్చారు. అయితే నోటీసులకు కూడా భయపడకుండా వ్యవహరిస్తే చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంది. దానిపై త్వరలో క్లారిటీ రానుంది.