CM Chandrababu : షాక్ లగా.. వేట మొదలుపెట్టిన చంద్రబాబు.. వైసీపీ ముఖ్యనేత అరెస్ట్..

టిడిపి కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఒక పద్ధతి ప్రకారం పాత కేసులను తిరగదోడుతోంది. వైసీపీ నేతల అరెస్టు పర్వానికి సిద్ధమయ్యింది. ఐదేళ్ల వైసిపి పాలనలో దూకుడుగా వ్యవహరించిన నేతలకు ఇప్పుడు అరెస్టులు తప్పేలా లేవు.

Written By: Dharma, Updated On : September 5, 2024 3:59 pm

CM Chandrababu

Follow us on

CM Chandrababu :  ఏపీలో వరదలు బీభత్సం సృష్టించాయి. విజయవాడ నగరం అతలాకుతలం అయింది. ఇప్పుడిప్పుడే వరదలు తగ్గుముఖం పడుతున్నాయి. సహాయక చర్యలు కూడా ఒక కొలిక్కి వస్తున్నాయి. గత మూడు రోజులుగా సీఎం చంద్రబాబు విజయవాడ కలెక్టరేట్లో బస చేశారు. యంత్రాంగం మొత్తం ఇక్కడే మొహరించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు సహాయ చర్యల్లో నిమగ్నమయ్యారు. క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలో ఏపీ పోలీసులు రంగంలోకి దిగారు. ఓ పాత కేసులో మాజీ ఎంపీ నందిగాం సురేష్ ను అరెస్టు చేశారు. వెంటాడి మరి ఆయనను అరెస్టు చేసి ఏపీకి తీసుకురావడం విశేషం. మరోవైపు ఈ కేసులో నిందితులుగా ఉన్న ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, దేవినేని అవినాష్ తదితరుల కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు.

* టిడిపి కార్యాలయం పై దాడి కేసులో
వైసిపి ప్రభుత్వ హయాంలో టిడిపి కేంద్ర కార్యాలయం పై దాడి జరిగిన సంగతి తెలిసిందే.ఓ 70 మంది వరకు కార్యాలయంలో ప్రవేశించి విధ్వంసాలకు పాల్పడ్డారు. ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. అడ్డొచ్చిన వారిని కొట్టుకుంటూ పోయారు. అప్పట్లో ఈ ఘటన సంచలనానికి దారితీసింది. కానీ పోలీసులు ఎటువంటి కేసులు నమోదు చేయలేదు. కార్యకర్తలకు బీపీ వస్తే ఇలానే ఉంటుందని అప్పటి సీఎం జగన్ తేల్చేశారు. అప్పటి డిజిపి సైతం లైట్ తీసుకున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు పై దృష్టి పెట్టింది. సీసీ పూటేజీల ద్వారా దాడికి పాల్పడిన వారిని గుర్తించి వారిని అరెస్టు చేసింది. అయితే వీరు కేవలం పాత్రధారులే. ఈ కేసులో కీలక సూత్రధారులుగా నందిగాం సురేష్ తో పాటు ఈ ముగ్గురు ఉన్నారు.

* హైకోర్టులో చుక్కెదురు
అయితే తమ అరెస్టులు ఖాయమని నిర్ధారణకు వచ్చిన వైసీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో కోర్టు కొద్దిరోజుల పాటు వారిని అరెస్టు చేయవద్దని చెబుతూ విచారణను నిన్నటికి వాయిదా వేసింది. అయితే నిన్నటి విచారణలో ముందస్తు బెయిల్ పిటిషన్ రద్దు చేసింది కోర్టు. అయితే ఒక రెండు వారాలపాటు తమను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని, సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు అవకాశం ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. కానీ సాయంత్రానికి ఆ అభ్యర్థనను కూడా తిరస్కరించింది హైకోర్టు. దీంతో వారి అరెస్టుకు రంగం సిద్ధం అయ్యింది.

* జల్లెడ పడుతున్న పోలీసులు
ఇలా కోర్టు తీర్పు వచ్చిందో లేదో పోలీసు బృందాలు సిద్ధమయ్యాయి. ఆ నలుగురు నేతలను అరెస్టు చేసేందుకు సిద్ధపడ్డాయి. నందిగాం సురేష్ హైదరాబాద్ వెళ్లారని తెలుసుకున్న పోలీసులు ఆయన కోసం అక్కడకు వెళ్లారు. కానీ ఆయన ఆచూకీ లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. హైదరాబాదు నుంచి సురేష్ పారిపోతారన్న సంకేతాలు పోలీసులకు అందాయి. అందుకే ఆయన సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా విచారణ చేపట్టారు. దీంతో నందిగాం సురేష్ చిక్కారు. ఆయనను అరెస్టు చేసి మంగళగిరితీసుకొస్తున్నట్లు సమాచారం. మిగతా వైసిపి నేతల కోసం సైతం జల్లెడ పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే వారు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు పోలీస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.