https://oktelugu.com/

Ganta Srinivasa Rao: గంటాకు షాక్ ఇచ్చిన చంద్రబాబు

వచ్చే ఎన్నికల్లో విశాఖ జిల్లా నుంచి పోటీ చేయాలని గంటా భావించారు. నగరంలోని నాలుగు నియోజకవర్గాలతో పాటు భీమిలిలో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయాలని ఆలోచన చేశారు. ఇదే విషయాన్ని చంద్రబాబుకు చెప్పారు.

Written By:
  • Dharma
  • , Updated On : March 14, 2024 / 02:35 PM IST

    Ganta Srinivasa Rao

    Follow us on

    Ganta Srinivasa Rao: మాజీ మంత్రి గంటాకు ఈసారి టిక్కెట్ లేనట్టేనా? పొమ్మనలేక పొగ పెడుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గంటా విషయంలో చంద్రబాబుతో పాటు లోకేష్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన పేరు రెండో జాబితాలో లేనట్లు సమాచారం. ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి గంటా పోటీ చేశారు. ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ టిడిపి కార్యక్రమాల్లో పాల్గొనడం తగ్గించేశారు. ఒకానొక దశలో ఆయన వైసీపీలో చేరతారని ప్రచారం జరిగింది. కానీ నాడు మంత్రిగా ఉన్న అవంతి శ్రీనివాసరావు, ఉత్తరాంధ్ర రీజియన్ ఇన్చార్జిగా ఉన్న విజయసాయిరెడ్డి అడ్డుకున్నట్లు తెలుస్తోంది.టిడిపి కష్టకాలంలో ఉన్నప్పుడు గంటా పెద్దగా కనిపించలేదు. గత ఏడాదిగానే యాక్టివ్ అయ్యారు. కానీ బలమైన నేత కావడంతో ఎన్నికల్లో టికెట్ తప్పకుండా దక్కుతుందని అంతా భావించారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో.. ఆయనకు పొమ్మన లేక పొగ పెడుతున్నారని ప్రచారం జరుగుతోంది.

    వచ్చే ఎన్నికల్లో విశాఖ జిల్లా నుంచి పోటీ చేయాలని గంటా భావించారు. నగరంలోని నాలుగు నియోజకవర్గాలతో పాటు భీమిలిలో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయాలని ఆలోచన చేశారు. ఇదే విషయాన్ని చంద్రబాబుకు చెప్పారు. అయితే చంద్రబాబు గంటాను చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని సూచించారు. అక్కడ మంత్రి బొత్స సత్యనారాయణ వైసీపీ అభ్యర్థిగా ఉండడంతో.. ఆయనపై పోటీ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. అయితే అందుకు గంటా అంగీకరించలేదు. దీంతో దీనిపై తర్వాత ఆలోచిద్దామని.. కచ్చితంగా ప్రత్యామ్నాయం చూస్తానని కొద్ది రోజుల కిందట చంద్రబాబు హామీ ఇచ్చారు.

    అయితే ఈరోజు టిడిపి అభ్యర్థుల రెండో జాబితా ప్రకటించనున్న నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు చంద్రబాబును కలిశారు.తనకు విశాఖ జిల్లాలో ఏదైనా నియోజకవర్గాన్ని కేటాయించాలని కోరారు.అయితే చంద్రబాబు మాత్రం చీపురుపల్లి నియోజకవర్గంలో పోటీచేయాలని మరోసారి సూచించారు. దీంతో గంటా శ్రీనివాసరావు మైండ్ బ్లాక్ అయింది. పొమ్మన లేక పొగ పెడుతున్నారని అర్థమైంది. ఈ నేపథ్యంలో గురువారం విశాఖలో తన అనుచరులతో గంటా ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేయనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ తెలుగుదేశం పార్టీ సానుకూల నిర్ణయం తీసుకోకుంటే.. పార్టీ మారేందుకు సైతం సిద్ధపడతారని సమాచారం. ఇప్పటికే ఆయనకు వైసీపీ నుంచి ఆహ్వానం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. మొత్తానికైతే గంటా రాజకీయానికి చంద్రబాబు ఇలా చెక్ చెప్పడం విశేషం. మరి గంటా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.