Site icon OkTelugu

Chandrababu BJP Decision: బిజెపికి నో చెప్పిన చంద్రబాబు!

Chandrababu BJP

Chandrababu BJP

Chandrababu BJP Decision: ఏపీలో రాజ్యసభ ఎన్నికల సందడి మొదలైంది. రాష్ట్రం నుంచి నలుగురు సభ్యులు పదవీ విరమణ చేస్తున్నారు. వారి స్థానంలో కొత్త వారి ఎన్నిక జరగనుంది. కూటమికి ఏకపక్ష బలం ఉండడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడే అవకాశం లేదు. అయితే ఈ నాలుగు పదవులను కూటమి పార్టీలు ఎలా సర్దుకుంటాయి అన్నది తెలియాల్సి ఉంది. ఎందుకంటే పదవీ విరమణ చేస్తున్న వారిలో సానా సతీష్ టిడిపికి చెందిన వారే. ఆయనకు మరోసారి రెన్యువల్ ఖాయం. మిగతా మూడు పదవులు మాత్రం కూటమిలోని మూడు పార్టీలు సర్దుకుంటాయని అంతా భావిస్తున్నారు. కానీ ఇప్పుడు కొత్త ప్రచారం మొదలైంది. టిడిపి మూడు పదవులు తీసుకుని ఒక్క పదవి మాత్రం మిత్రపక్షాలకు ఇచ్చేందుకు చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

* రెండుసార్లు బిజెపికి అవకాశం..
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండుసార్లు రాజ్యసభ పదవుల భర్తీ జరిగింది. అయితే ఆ రెండుసార్లు బిజెపికి ఛాన్స్ ఇచ్చింది. ఎందుకంటే రాజ్యసభలో బిజెపి బలం తక్కువగా ఉంది. కేంద్ర పెద్దల విజ్ఞప్తి మేరకు చంద్రబాబు ఈ నిర్ణయానికి వచ్చి అప్పట్లో బీజేపీకి రెండు ఎంపీ పదవులు ఇచ్చారు. అయితే మరో మిత్రపక్షం జనసేనకు ఇంతవరకు రాజ్యసభలో ప్రాతినిధ్యం లేదు. ఈసారి తప్పకుండా తమకు అవకాశం ఇవ్వాలని జనసేన కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో బిజెపికి ఈసారి ఛాన్స్ లేదని తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ కు సమాచారం ఇచ్చారు చంద్రబాబు. అయితే కేంద్ర పెద్దలు పట్టుబడితే మాత్రం చంద్రబాబు తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం ఉంది.

* ఆశావహులు అధికం.
తెలుగుదేశం పార్టీలో సీనియర్లు చాలామంది ఉన్నారు. సానా సతీష్ కు విడిచిపెట్టగా.. మరో రెండు రాజ్యసభ సీట్లు దక్కితే సామాజిక సమీకరణలను, సీనియారిటీని పరిగణలోకి తీసుకొని ఎంపిక చేయాల్సి ఉంటుంది. చాలామంది ఆశావహులు ఉండడంతో చంద్రబాబు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఖాళీ అవుతున్న నాలుగింటిలో.. రెండింటిని వదులుకుంటే తమకు ఇబ్బందులు వస్తాయని చంద్రబాబు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ ద్వారా కేంద్ర పెద్దలకు తెలియజేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాజ్యసభలో బిజెపి బలం పెరగడంతో హై కమాండ్ పెద్దలు సైతం పెద్దగా పట్టుబట్టే అవకాశం లేదు. ఒకవేళ పట్టుబడితే మాత్రం చంద్రబాబు మెత్తబడక తప్పదు.

Exit mobile version