Chandrababu RSS: తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) వైఖరి గతానికంటే భిన్నంగా ఉంది. ఇప్పుడు ఆ పార్టీకి ఏపీ ప్రయోజనాలు ముఖ్యం. అందుకోసం ఎంత దాకైనా వెళ్లేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు. ఆపై సంయమనంతో వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా కేంద్రంతో సయోధ్య ఏర్పాటు చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని సంతృప్తి పరుస్తూ.. గత మాదిరిగా అనుమానాలు, వివాదాలు పెట్టుకోకుండా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు ఆర్ఎస్ఎస్ కు కూడా దగ్గరయ్యారు. మొన్న మధ్యన తిరుపతిలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు హాజరయ్యారు. ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు మోహన్ భాగవతార్ తో కలిసి వేదిక పంచుకున్నారు. గతంలో ఎన్నడూ చంద్రబాబు ఆర్ఎస్ఎస్ తో వేదికలు పంచుకోలేదు. కానీ ఈసారి మాత్రం ఆ పని చేశారు. దీని వెనుక అనేక రకాల చర్చ మొదలైంది.
* వైసిపి ట్రాప్ లో పడి..
2018 సమయంలో ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నారు చంద్రబాబు( CM Chandrababu). అప్పుడప్పుడే అమరావతి నిర్మాణం జరుగుతోంది. ఆ సమయంలో జగన్ ట్రాప్ లో పడ్డారు చంద్రబాబు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంతో గొడవ పెట్టుకున్నారు. తర్వాత ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసారు. ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా 2019 ఎన్నికల్లో ప్రచారం చేశారు. కానీ ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. బిజెపి ఘనవిజయం సాధించింది. అప్పుడే చంద్రబాబులో ఒక రకమైన మార్పు వచ్చింది. అయితే ఆ రాజకీయ తప్పిదం ఏపీకి శాపంగా మారింది. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసింది.
* విశాల దృక్పథంతో..
మరోసారి ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలని భావించారు చంద్రబాబు. అందుకే బిజెపితో స్నేహం చేసేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ ఆ సమయంలో ఆర్ఎస్ఎస్( RSS) అడ్డుపడినట్లు వార్తలు వచ్చాయి. ఎలాగోలా బిజెపిని ఒప్పించి పొత్తు కుదుర్చుకుని ఏపీలో అధికారంలోకి రాగలిగారు. కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ఏర్పాటులో కూడా కీలక భాగస్వామి అయ్యారు. రాష్ట్రానికి కావాల్సిన అన్ని ప్రాజెక్టులను, నిధులను దక్కించుకుంటున్నారు. అయితే ఒక్క బిజెపితోనే కాదు. ఆర్ఎస్ఎస్ తో సైతం మంచి సంబంధాలు కొనసాగిస్తే రాజకీయంతో పాటు రాష్ట్ర ప్రయోజనాలు సాధ్యమని చంద్రబాబు భావిస్తున్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేయించారు. రాష్ట్రవ్యాప్తంగా శతజయంతి వేడుకలు టిడిపి కార్యక్రమంగా జరిపిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ పెద్దతో కలిసి వేదిక పంచుకున్నారు. ఈ పరిస్థితులు చూస్తుంటే మాత్రం చంద్రబాబు గట్టి ప్లాన్ తో ఉన్నట్లు అర్థమవుతోంది.