Chandrababu : ఏపీలో( Andhra Pradesh) కూటమి గెలవడంతో తెలుగు సినీ పరిశ్రమ ఊపిరి పీల్చుకుంది. గత ఐదేళ్ల వైసిపి పాలనలో సినీ పరిశ్రమపై చాలా రకాల పెత్తనం సాగింది. టికెట్ల ధర పెంపుతో పాటు చాలా రకాల అంశాల్లో సినీ పరిశ్రమ అభిమతానికి వ్యతిరేకంగా వైసిపి సర్కార్ నడుచుకుంది. అందుకే ఈ ఎన్నికల్లో 90 శాతం సినీ పరిశ్రమ జగన్ ఓడిపోవాలని కోరుకుంది. కూటమి గెలవాలని ఆకాంక్షించింది. అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతున్నా.. సినీ పరిశ్రమకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు జరగడం లేదు. ముఖ్యంగా సినీ ప్రముఖులకు పదవులు రాలేదు. అదే తెలంగాణ ప్రభుత్వంలో దిల్ రాజు లాంటి వ్యక్తికి కీలక పదవి ఇచ్చారు. కానీ ఏపీలో మాత్రం ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వంటి పదవులను ఇంతవరకు భర్తీ చేయలేదు. అలాగే టీటీడీ భక్తి ఛానల్ చైర్మన్ పోస్టును సైతం ఇంతవరకు నియామకం చేపట్టలేదు. దీంతో చాలామంది ఆశావహులు ఎదురుచూస్తున్నారు.
* పదవుల కోసం ఎదురుచూపు
తెలుగుదేశం ( Telugu Desam) పార్టీకి సంబంధించి దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాతలు అశ్విని దత్, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, సీనియర్ నటుడు మురళీమోహన్ వంటి హేమాహేమీలు ఉన్నారు. వీరంతా నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. అశ్విని దత్ పాటు మురళీమోహన్ అయితే టిటిడి చైర్మన్ పోస్ట్ ఆశించారు. కానీ సమీకరణలో భాగంగా వారికి అవకాశం దక్కలేదు. టీవీ5 అధినేత సుధాకర్ నాయుడు ఆ పోస్టు దక్కించుకున్నారు. అయితే అశ్విని దత్ విజయవాడ ఎంపీ స్థానానికి గతంలో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. మురళీమోహన్ అయితే రాజమండ్రి ఎంపీగా గెలిచారు. పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించిన అనుభవం ఉంది. అయితే వారికి నామినేటెడ్ పోస్టులు దక్కే అవకాశం ఉన్నట్లు టిడిపిలో ప్రచారం నడుస్తోంది.
* చంద్రబాబు గెలుపుతో భావోద్వేగం
ఘట్టమనేని ఆదిశేషగిరిరావు( ghattamaneni adhishasi Giri Rao) వైసీపీలో ఉండేవారు. రాజశేఖర్ రెడ్డి తో సూపర్ స్టార్ కృష్ణకు మంచి అనుబంధం ఉండేది. అందుకే ఆదిశేషగిరిరావు వైసీపీలో చేరారు. ప్రారంభంలో యాక్టివ్ రోల్ పోషించారు. తాడేపల్లిలో ఆదిశేషగిరిరావు ఆస్తిలోనే జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టారు. స్వయంగా ఆదిశేషగిరిరావు కట్టించి ఇచ్చారు కూడా. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యం తగ్గించడంతో ఆదిశేషగిరిరావు టిడిపిలో చేరిపోయారు. పైగా కృష్ణ అల్లుడు గల్లా జయదేవ్ గుంటూరు నుంచి టిడిపి ఎంపీగా ఉండేవారు. దీంతో ఆదిశేషగిరిరావు సైతం టిడిపిలో చేరిపోయారు. కూటమి అధికారంలోకి వచ్చి సీఎం గా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసే సమయంలో ఆదిశేషగిరిరావు భావోద్వేగానికి గురయ్యారు. చంద్రబాబు వద్ద మంచి గుర్తింపు ఉంది ఆదిశేషగిరిరావుకు. అందుకే ఆయనకు సైతం కీలక పోస్టు దక్కే ఛాన్స్ కనిపిస్తోంది.
* టిడిపికి బలమైన మద్దతుదారుడు
దర్శకుడు రాఘవేంద్రరావు( Raghavendra Rao) తెలుగుదేశం పార్టీ మద్దతుదారుడు. ఆయనకు ఎప్పుడు టిడిపిలో ప్రాధాన్యం దక్కుతూ వచ్చింది. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత టిటిడి భక్తి ఛానల్ చైర్మన్ గా అవకాశమిచ్చారు చంద్రబాబు. ఆ చానల్ ను ఎంతగానో అభివృద్ధి చేశారు రాఘవేంద్రరావు. 2019లో వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి కి ఆ పదవి ఇచ్చారు జగన్. కానీ ఆయన పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. పైగా విభాగాల్లో చిక్కుకున్నారు. అయితే సినీ పరిశ్రమకు చెందిన ఈ నలుగురికి నామినేటెడ్ పదవులు దక్కుతాయని టిడిపి వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. మరి వీరి సేవలను చంద్రబాబు ఎలా వాడుకుంటారో చూడాలి.