AP New DGP : ఏపీ ప్రభుత్వం ( AP government) కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా కొత్త డిజిపి నియామకం పై దృష్టి పెట్టింది. ప్రస్తుత డిజిపి ద్వారకా తిరుమలరావు ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. దీంతో కొత్త డిజిపి ఎంపిక అనివార్యంగా మారింది. 2024 ఎన్నికల సమయంలో డిజిపి గా ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డిని ఎన్నికల సంఘం మార్చింది. ఆయన స్థానంలో హరీష్ కుమార్ గుప్తాను నియమించింది. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ద్వారక తిరుమలరావును డిజిపిగా నియమించారు. ఆయన పదవీ విరమణ చేయనుండడంకు కొత్త అధికారి ఎంపిక అనివార్యంగా మారింది. అయితే కొత్త డిజిపి ఎంపికపై సీఎం చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో డిజిపిగా పనిచేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి హరీష్ కుమార్ గుప్తా వైపు చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఆయన నియామకం దాదాపు ఖరారు అయినట్లు సమాచారం.
* మొదటి స్థానంలో మాదిరెడ్డి ప్రతాప్
వాస్తవానికి సీనియర్ ఐపీఎస్ అధికారిని డీజీపీగా నియమిస్తారు. సీనియారిటీ జాబితాలో 1991 బ్యాచ్ కు చెందిన అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్( Madhireddy Pratap) మొదటి స్థానంలో ఉన్నారు. హరీష్ కుమార్ గుప్తా రెండో స్థానంలో కొనసాగుతున్నారు. మాదిరెడ్డి ప్రతాప్ గతంలో జగన్ హయాంలో ఆర్టీసీ ఎండీ గా పని చేశారు. ఆ సమయంలో ఒక వివాదంలో ప్రభుత్వం ఆయన పై విచారణకు ఆదేశించింది. కానీ తాజాగా కూటమి ప్రభుత్వం ఆ విచారణను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రతాప్ డిజిపిగా ఎంపిక చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందరూ అంచనా వేశారు. కానీ ప్రభుత్వం వేరే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం.
* సీనియర్ అధికారి పేరు
డిజిపిగా సీనియర్ ఐపీఎస్ అధికారి రవిశంకర్ అయ్యనార్( Ravi Shankar Ayyanar ) పేరు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. అయితే అన్ని సమీకరణలను పరిశీలించిన తర్వాత విజయనగరం జిల్లాకు చెందిన హరీష్ కుమార్ గుప్తాను కొత్త డీజీపీగా ఖరారు చేసినట్లు సమాచారం. హరీష్ కుమార్ ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా పని చేస్తున్నారు. సీనియార్టీతో పాటు సుదీర్ఘ సేవలను పరిగణలోకి తీసుకొని ఆయన పేరును ఖరారు చేయనున్నారు.
* సీఎం తిరిగి వచ్చిన వెంటనే
ప్రస్తుతం సీఎం చంద్రబాబు( Chandrabab) దావోస్ పర్యటనలో ఉన్నారు. రేపు రాష్ట్రానికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. ద్వారకా తిరుమలరావు పదవీకాలం మరో వారం రోజులు పాటు ఉండడంతో.. నూతన డిజిపి నియామకానికి సంబంధించి ఒక నిర్ణయానికి రానున్నారు. మరోవైపు ద్వారకా తిరుమలరావు కొనసాగింపు పై కూడా రకరకాల ప్రచారం నడుస్తోంది. అయితే ఐఏఎస్ మాదిరిగా ఐపీఎస్ లను పొడిగించడానికి కుదిరే పని కాదు. అందుకే వీలైనంత వరకు కొత్త డిజిపి నియామకం తప్పదని తెలుస్తోంది. అయితే అధికారిక వర్గాల్లో మాత్రం డీజీపీగా హరీష్ కుమార్ గుప్త పేరు దాదాపు ఖాయమైనట్లు ప్రచారం నడుస్తోంది. అనూహ్య నిర్ణయాలు ఉంటే తప్ప.. హరీష్ కుమార్ గుప్తా పేరును చంద్రబాబు దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.