TDP: టిడిపి వినూత్న స్థాయిలో ఆలోచిస్తోంది. ప్రజలకు నేరుగా ఉచిత పథకాలు అందించడం కంటే.. వారి జీవనోపాధిని మెరుగుపరిచే వాటికి ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటోంది. ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలను రూపొందించింది. వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళింది. ఎన్నికల్లోపు మరిన్ని ఆకర్షక పథకాలను ప్రకటించనుంది. అందులో కూడా ప్రజల దీర్ఘకాల ప్రయోజనాలకు పెద్దపీట వేయనుంది. ఆడపిల్లల చదువులకు వడ్డీ లేని రుణాలను అందించేందుకు సిద్ధపడుతోంది. ఈ విషయాన్ని చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ప్రకటించడం విశేషం.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాల పేరిట పెద్ద ఎత్తున ఉచిత పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. బటన్ నొక్కడం ద్వారా ప్రజల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తోంది. తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఈ సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయని జగన్ హెచ్చరిస్తున్నారు. అయితే తాము అధికారంలోకి వస్తే అంతకుమించి సంక్షేమం ఉంటుందని చంద్రబాబు చెప్పుకొస్తున్నారు. సూపర్ సిక్స్ పథకాలను సైతం ప్రకటించారు. మహిళలను మహాశక్తులుగా మార్చేందుకు హామీ ఇచ్చిందే మహాశక్తి పథకం. ఈ పథకం కింద ఇంట్లో చదువుకునే పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఆర్థిక సాయం అందించనున్నారు. ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయల ఆడబిడ్డ నిధి, ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ ల చొప్పున పంపిణీ వంటివి అమలు చేయనున్నట్లు టిడిపి స్పష్టమైన ప్రకటన చేసింది. మహిళా సాధికారతకు పెద్దపీట వేయనన్నట్లు చెప్పుకొచ్చింది.
అయితే తాజాగా ‘ కలలకు రెక్కలు ‘ పేరిట మరో వినూత్న పథకాన్ని ప్రారంభించనుంది. ఇంటర్ పూర్తి చేసిన ఆడపిల్లలు పై చదువులు చదివేందుకు తీసుకునే రుణాలకు ప్రభుత్వమే పూచికత్తుగా వ్యవహరించనుంది. అంతేకాకుండా కోర్సు కాలానికి రుణంపై వడ్డీ కూడా ప్రభుత్వమే భరించనుంది. ఇప్పుడే ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే వెసులుబాటును సైతం తెలుగుదేశం పార్టీ కల్పించింది. అందుకోసం ప్రత్యేక వెబ్ సైట్ ను సైతం అందుబాటులోకి తెచ్చింది. నారా భువనేశ్వరి ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా ఆమె ప్రత్తికొండలో పర్యటించారు. టిడిపి, జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం కలలకు రెక్కలు పథకానికి శ్రీకారం చుడతామని ప్రకటించారు. మహిళా సాధికారత లో భాగంగానే ఈ వినూత్న పథకానికి శ్రీకారం చుట్టినట్లు తెలుగుదేశం పార్టీ చెబుతోంది. పథకాలు అమలు చేస్తాం.. కానీ అవి ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమేనని టిడిపి చెబుతుండడం విశేషం.