Chandrababu Naidu – Ganta Srinivas Rao : మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయ భవిష్యత్ ఏంటి? వచ్చే ఎన్నికల్లో ఆయన ఎక్కడ నుంచి పోటీచేస్తారు? టీడీపీ హైకమాండ్ మదిలో ఏముంది? ఆయన్ను విశాఖ నుంచి సాగనంపడం ఖాయమా? ఇప్పుడు టీడీపీలో ఇదే చర్చ నడుస్తోంది. ప్రతీ ఎన్నికకు పోటీచేసే నియోజకవర్గాన్ని మార్చడం గంటాకు అలవాటు. ఇలా దాదాపు ఉమ్మడి విశాఖ జిల్లాను చుట్టేశారు. సిటీ, రూరల్ అని చూడకుండా అన్ని నియోజకవర్గాలను తిరిగారు. ఇంకొన్ని నియోజకవర్గాలు పెండింగ్ లో ఉన్నా అక్కడ బలమైన నాయకత్వం ఉండడంతో జరిగే పని కాదు. అందుకే ఇప్పుడు గంటా ఎక్కడ నుంచి పోటీచేస్తారా? అని టీడీపీతో పాటు అధికార పక్షం వైసీపీ కూడా ఆరాతీస్తోంది.
విశాఖలో అసెంబ్లీ సీట్లు ఖాళీగా లేవు.. ఎంపీగా పోటీచేయిస్తామన్నా కుదిరే పనికాదు. అనకాపల్లి ఎంపీగా చేసిన గంటా ఇక విశాఖ ఎంపీగా వెళ్తారా అంటే అక్కడ కూడా పోటీ ఉంది. దాంతో ఈసారి ఎన్నికల్లో గంటా ఏకంగా జిల్లానే మార్చేస్తారు అని అంటున్నారు. ఆయన అలా అనుకోకపోయినా టీడీపీ హైకమాండ్ ఆయనను పుట్టిన చోటకే వెళ్లమంటోంది అని ప్రచారం సాగుతోంది.గంటా సొంత జిల్లా ఒంగోలు నియోజకవర్గం. అక్కడ కొండెపి నియోజకవర్గం టంగుటూరు ఆయన సొంత ప్రాంతం. గంటా అక్కడే పుట్టి పెరిగి తన చదువు అంతా పూర్తి చేశారు. ఉద్యోగ వ్యాపార నిమిత్తం విశాఖ వచ్చి సెటిలయ్యారు. రాజకీయాల్లోకి వచ్చి బలమైన నేతగా ఎదిగారు. ఇప్పుడు విశాఖను విడిచిపెట్టమంటే వింటారా లేదో చూడాలి.
గత నాలుగేళ్లుగా టీడీపీ కార్యక్రమాల్లో గంటా కనిపించింది తక్కువే. అధికార పార్టీకి భయపడి పెద్దగా కనిపించిన దాఖలాలు లేవు. ఇటీవల యాక్టివ్ అయ్యారు. దీనిపైనే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు గరంగరం అయ్యారు. ఎవండీ గంటా అంటూ విరుచుకుపడ్డారు. అయ్యన్న, గంటాల మధ్యదశాబ్దాల వైరం ఉంది. టీడీపీకి అయ్యన్న హార్డ్ కోర్ ఫ్యాన్. గంటా విషయంలో అలా కాదు. ఒక వేళ గంటాను అసెంబ్లీకి పోటీచేయిస్తే మంత్రి పదవి అడుగుతారు. అప్పుడు అయ్యన్నతో మరింత వైరం పెరుగుతుంది. అందుకే జిల్లాను దాటించేందుకు టీడీపీ నాయకత్వం సిద్ధపడినట్టు సమాచారం.
ఒంగోలు ఎంపీ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. గంటాను అక్కడ దింపితే అంగబలం, అర్ధబలంతో నెగ్గుకురాగలరని అంచనా వేస్తున్నారు. పైగా అక్కడ కాపుల సంఖ్య అధికం. దీంతో సామాజికవర్గ సమీకరణలు సైతం కలిసి వస్తాయని భావిస్తున్నారు. గంటాను విశాఖకు దూరం పెడితే టీడీపీకి కూడా వర్గ పోరు తగ్గుతుంది. అదే సమయంలో వైసీపీకి బలమున్న ఒంగోలులో పట్టు సాధించినట్టవుతుంది. అయితే ఈ ఫార్ములా గంటాకు నచ్చుతుందో లేదో? ఎందుకంటే ఆయన విశాఖ జిల్లా రాజకీయాలనే ఎక్కువగా ఇష్టపడతారు. దీనిపై త్వరలో క్లారిటీ రానుంది.