TDP Second List: సీనియర్లకు చంద్రబాబు షాక్.. ఇక మిగిలింది 16 స్థానాలే

శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రి కళా వెంకట్రావుకు రెండో జాబితాలో సైతం చోటు దక్కలేదు. ఆయన ఎచ్చెర్ల టిక్కెట్టును ఆశిస్తున్నారు. విజయనగరం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారికి సైతం నిరాశే ఎదురయింది.

Written By: Dharma, Updated On : March 14, 2024 2:25 pm

TDP Second List

Follow us on

TDP Second List: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకు చంద్రబాబు షాక్ ఇచ్చారు. రెండో జాబితాలో సైతం సీనియర్లకు చోటు దక్కలేదు.34 మంది అభ్యర్థులతో రెండో జాబితాను ఈరోజు ప్రకటించారు. అయితే ఇందులో చాలామంది సీనియర్ల పేర్లు లేవు. దీంతో వారంతా ఆందోళనకు గురవుతున్నారు. 94 మందితో తొలి జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లోనే చాలామంది సీనియర్లకు మొండి చేయి చూపించారు. కనీసం రెండో జాబితాలోనైనా ప్రకటిస్తారని భావించారు. కానీ ఈసారి కూడా వారికి చుక్కెదురు అయ్యింది.వారి పేర్లు కనిపించకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రి కళా వెంకట్రావుకు రెండో జాబితాలో సైతం చోటు దక్కలేదు. ఆయన ఎచ్చెర్ల టిక్కెట్టును ఆశిస్తున్నారు. విజయనగరం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారికి సైతం నిరాశే ఎదురయింది. ఆమె ఎస్.కోట టికెట్ ఆశిస్తున్నారు. విశాఖ జిల్లాలో ఇద్దరు మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ మూర్తి లకు టిక్కెట్లు ప్రకటించలేదు. గంటా శ్రీనివాసరావు భీమిలి అసెంబ్లీ టికెట్ ఆశిస్తుండగా.. బండారు సత్యనారాయణమూర్తి పెందుర్తి అసెంబ్లీ టిక్కెట్ ఆశిస్తున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమాకు సైతం ఈసారి కూడా చుక్కెదురు అయ్యింది. ఆయన మైలవరం లేదా పెనమలూరు టికెట్ ఆశిస్తున్నారు. సర్వేపల్లి సీటును మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేరు సైతం ప్రకటించలేదు. అటు నెల్లూరు సిటీ టికెట్ మాజీమంత్రి నారాయణ ఆశిస్తున్నారు. ఆయన పేరును సైతం ప్రకటించలేదు.

అయితే చాలామంది సీనియర్ల పేర్లు ఎంపీ అభ్యర్థులుగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు కళా వెంకట్రావు కుటుంబాన్ని పక్కన పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. చీపురుపల్లి నుంచి కిమిడి నాగార్జున టికెట్ ఆశిస్తున్నారు. అయితే ఈసారి చీపురుపల్లి నుంచి గంటా శ్రీనివాసరావు పోటీలో పెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు. అదే సమయంలో విజయనగరం ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని కళా వెంకట్రావుకు సూచించినట్లు వార్తలు వచ్చాయి. అయితే అనూహ్యంగా ఆ సీటును బిజెపికి కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది. విజయనగరం ఎంపీ సీటు విషయంలో స్పష్టత రాకపోవడం వల్లే.. ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా కళా వెంకట్రావు పేరు ప్రకటించలేదని టిడిపి వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు గంటా శ్రీనివాసరావు పేరును ఇంతవరకు ప్రకటించలేదు. ఆయన భీమిలి అసెంబ్లీ స్థానాన్ని కోరుతుండగా.. చంద్రబాబు మాత్రం చీపురుపల్లిలో పోటీ చేయాలని సూచించినట్లు వార్తలు వచ్చాయి. అయితే అందుకు గంటా సమ్మతించలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు మరోసారి గంటా చంద్రబాబును కలిశారు. ఇప్పుడు సైతం చంద్రబాబు గంటాను చీపురుపల్లి నుంచి పోటీకి సిద్ధంగా ఉండాలని సూచించినట్లు సమాచారం. మరో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి విషయంలో సైతం చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. పెందుర్తి సీటును జనసేన పొత్తులో భాగంగా కోరుతోంది. అక్కడ మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అందుకే అక్కడ అభ్యర్థి విషయంలో స్పష్టత రాలేదని తెలుస్తోంది. మొత్తానికైతే రెండో జాబితాలో సైతం చోటు దక్కని సీనియర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఇంకా టిడిపిలో కేవలం 16 స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండడంతో.. ఆశావహుల్లో ఒక రకమైన టెన్షన్ కనిపిస్తోంది.