Chandrababu Davos Tour: ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) బృందం దావోస్ కు చేరుకుంది. ప్రపంచ పెట్టుబడుల సదస్సు దావోస్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది పెట్టుబడుల సదస్సుకు చంద్రబాబు, లోకేష్ వెళ్లారు. ఇప్పుడు కూడా సీఎం చంద్రబాబు బృందంలో లోకేష్ ఉన్నారు. స్విట్జర్లాండ్ లోని జారిక్ చేరుకున్నారు. అప్పుడే ఆన్ డ్యూటీ అంటూ చర్చల్లో తల మునకలయ్యారు తండ్రీ కొడుకులు. అక్కడ పారిశ్రామికవేత్తలతో పాటు భారత రాయబారితో సమావేశాలు పూర్తి చేశారు. ఏపీలో పెట్టుబడులకు సంబంధించిన సానుకూలతలను వారికి వివరించారు. ఏపీలో ఏయే పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయో? వివరించడంతో పాటు స్విట్జర్లాండ్ పారిశ్రామికవేత్తల ఆలోచనలు ఎలా ఉన్నాయో అనే అంశాలను తెలుసుకునేందుకు వారు ప్రయత్నిస్తున్నారు.
మరో నాలుగు రోజులు..
ఈనెల 22 వరకు దావోస్ లో( davos ) చంద్రబాబు బృందం పర్యటించనుంది. 23న ఆ బృందం హైదరాబాద్ చేరుకోనుంది. నిన్ననే ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరింది ఈ బృందం. స్విట్జర్లాండ్ లో దిగిన వెంటనే అక్కడ భారత రాయబారి మృదుల్ కుమార్ తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. మంత్రి నారా లోకేష్ సైతం పాల్గొన్నారు. స్విట్జర్లాండ్ లోని ప్రముఖ కంపెనీల వివరాలు, పెట్టుబడుల సాధనకు ఉన్న అవకాశాలపై ఆయనతో ఈ ఇద్దరు చర్చించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేలా స్విట్జర్లాండ్ కంపెనీలతో సంప్రదింపులు జరిపేందుకు సహకరించాలని భారత రాయబారిని వారు కోరారు. ముఖ్యంగా ఫార్మా, వైద్య పరికరాలు, మిషనరీ తయారీ, హార్డ్వేర్ ఎలక్ట్రానిక్స్, రైల్ కాంపోనెంట్స్, టెక్నికల్ టెక్స్టైల్స్ వంటి రంగాల్లో తమకు సహకరించాలని రాయబారిని కోరారు సీఎం చంద్రబాబు.
సరికొత్త ప్రతిపాదనలతో..
రేపటి నుంచి మూడు రోజులపాటు దావోస్ పెట్టుబడుల సదస్సు జరగనుంది. ప్రపంచ దేశాల ప్రతినిధులు హాజరుకానున్నారు. ఇప్పటికే ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్( Google data centre) ఏపీలో ఏర్పాటు కాబోతున్న సంగతి తెలిసిందే. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించిన సన్నాహాలు ప్రారంభమయ్యాయి. అందుకు సంబంధించి భూ సేకరణ కూడా మొదలైంది. పెద్ద ఎత్తున విశాఖకు ఐటి పరిశ్రమలు కూడా తరలివస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమరావతి రాజధాని నిర్మాణం ఒకవైపు సాగుతోంది. రాయలసీమలో తయారీ రంగ పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయి. విశాఖలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల సైతం తమ కార్యకలాపాలను జోరుగా పెంచుతున్నాయి. అయితే దేశంలో ఈ ఏడాది వచ్చిన పెట్టుబడుల్లో 25% ఏపీకే వచ్చాయి. ఈ పురోగతిని చెప్పి దావోస్ పెట్టుబడుల సదస్సులో పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకు చంద్రబాబు ప్రత్యేక ప్రణాళికతో అడుగుపెట్టారు. మరి అందులో ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.
