Chandhrababu : వైసీపీ నుంచి చేరికల విషయంలో చంద్రబాబు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఇప్పుడప్పుడే చేర్చుకునే స్థితిలో లేరని చెబుతున్నాయి టిడిపి వర్గాలు. దీనికోసం ఇంకా సమయం ఉందని చెప్పుకొస్తున్నారు. ఏపీలో వైసిపి ఘోర పరాజయం తర్వాత.. చాలామంది నేతలు సైలెంట్ అయ్యారు. కొందరు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పార్టీకి భవిష్యత్తు లేదనుకుంటున్నవారు కూటమి పార్టీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా టిడిపిని వీడిన పూర్వ నేతలు.. తిరిగి పార్టీలోకి వస్తామని కబురు పెడుతున్నారు. టిడిపిలో ఉన్న సన్నిహితుల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే చంద్రబాబు మాత్రం ఈ విషయంలో మెత్తబడడం లేదు. తన వద్ద ప్రస్తావిస్తున్న టిడిపి నేతలకు ఇది సమయం కాదని తేల్చి చెబుతున్నారు. అవసరమైనప్పుడు చెబుతానని.. అంతవరకు వెయిట్ చేయాలని సూచిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అంతులేని మెజారిటీతో విజయం సాధించింది. మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. నామినేటెడ్ పదవుల నుంచి ఎమ్మెల్సీ, రాజ్యసభ పదవుల వరకు మూడు పార్టీల మధ్య సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే నామినేటెడ్ పదవుల విషయంలో ఒక ఫార్ములాను తయారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. టిడిపి ఎమ్మెల్యేలు ఉన్నచోట 60 శాతం ఆ పార్టీకి, 30% జనసేన కు, 10% బిజెపికి పదవులు కేటాయించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అదే జనసేన ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న చోట ఆ పార్టీకి 60 శాతం, టిడిపికి 30 శాతం, జనసేనకు 10 శాతం పదవులు కేటాయించాల్సి ఉంటుంది. బిజెపి ఎమ్మెల్యే ఉన్నచోట ఆ పార్టీకి 50 శాతం, టిడిపి, జనసేనకు మిగతా 50 శాతం పదవులు అప్పగించాలి. ఈ ఫార్ములాతో మూడు పార్టీలకు కొంత ఉపశమనం దక్కే అవకాశం ఉన్నా.. అతిపెద్ద పార్టీ అయినా టిడిపిలో సర్దుబాటు అంత ఈజీ కాదు. పైగా పొత్తులో భాగంగా 31 అసెంబ్లీ, 8 పార్లమెంట్ నియోజకవర్గాల్లో నేతలు టిక్కెట్లు వదులుకున్నారు. త్యాగాలు చేశారు. అటువంటి వారికి ఇప్పుడు చంద్రబాబు న్యాయం చేయాల్సి ఉంటుంది. రాష్ట్రస్థాయి పదవులతో పాటు నామినేటెడ్ పదవులు కేటాయించాల్సి ఉంది. వారంతా ఆశగా ఎదురుచూస్తున్నారు కూడా. ఒకవైపు మూడు పార్టీల మధ్య సమన్వయం, మరోవైపు సొంత పార్టీ శ్రేణులకు న్యాయం చేయడం అంత ఈజీ కాదు. అందుకే చంద్రబాబు ఇప్పుడే పక్క పార్టీల నుంచి నేతలను తీసుకునే పరిస్థితి లేదన్న టాక్ వినిపిస్తోంది. ప్రధానంగా వైసీపీ నుంచి చేరికల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుంటున్నారు.
* టిడిపిని వీడిన చాలామంది నేతలు
టిడిపిలో సుదీర్ఘకాలం పనిచేసిన చాలామంది నేతలు వివిధ కారణాలతో వైసీపీలోకి వెళ్లారు. 2019 ఎన్నికల్లో టిడిపి ఓడిపోయిన తర్వాత ఎక్కువమంది జగన్ పార్టీలోకి వెళ్లారు. రకరకాల ఒత్తిళ్ళతో వారిని పార్టీలోకి చేర్చుకున్నారు జగన్. అటువంటివారు యూటర్న్ తీసుకుంటున్నారు. టిడిపిలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే పార్టీ కష్టకాలంలో ఉండగా.. పార్టీని విడిచిపెట్టి వెళ్లిన వారిని తిరిగి చేర్చుకోబోమని చంద్రబాబు సైతం స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో సైతం ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు ఆ మాట తప్పి చేర్చుకుంటే పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని భయపడుతున్నారు.
* పార్టీ మారేందుకు నేతల యత్నం
శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు వైసిపి నేతలు చాలామంది టిడిపిలోకి వచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో చాలా వరకు తాజా మాజీలు కూడా ఉన్నారు. మాజీ మంత్రులు అవంతి శ్రీనివాసరావు, విడదల రజిని, శిద్దా రాఘవరావు, కరణం బలరాం, వాసుపల్లి గణేష్ కుమార్, కిలారి రోశయ్య, మద్దాలి గిరి వంటి వారి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇందులో శిద్దా రాఘవరావు, మద్దాలి గిరి, కిలారి రోశయ్య వంటి వారు ఇప్పటికే రాజీనామా చేశారు. టిడిపిలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వారి ప్రయత్నాలు పెద్దగా కొలిక్కి రావడం లేదు. పోనీ జనసేనలో చేరుదామంటే ఆ పార్టీలో సైతం ఆంక్షలు ఉన్నాయి. బిజెపిలో చేరే వారి విషయంలో సైతం.. మిగతా రెండు పార్టీలతో సమన్వయం చేసుకోవాల్సి ఉంది. అందుకే నేతలకు తాత్కాలికంగా గేటు పడినట్లు తెలుస్తోంది.
* ఆ సీనియర్ల విషయంలో
అయితే వైసిపి ఆవిర్భావం నుంచి వెంట నడిచిన నేతలు సైతం టిడిపిలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేరు వినిపిస్తోంది. జగన్ పిలిచిన వెంటనే టిడిపి నుంచి వెళ్లిపోయారు ఉమారెడ్డి. తెలుగుదేశం పార్టీ ఉమ్మారెడ్డికి ఎంతో గౌరవం ఇచ్చింది. కానీ ఆ సీనియారిటీని వదులుకొని వైసీపీలో చేరిన ఆయనకు జగన్ పెద్దగా గౌరవించలేదు. పార్టీ అధికారంలో ఉండగా ప్రాధాన్యత ఇవ్వలేదు. మండలి చైర్మన్ పదవి ఆశించినా దక్కలేదు. ఇప్పుడు శాసనమండలిలో వైసీపీ పక్ష నేతగా పదవి ఆశించినా పరిగణలోకి తీసుకోలేదు. లేళ్ల అప్పి రెడ్డికి ఆ పదవి ఇచ్చారు. అందుకే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు కిలారి రోశయ్య పార్టీకి దూరమయ్యారు. ఉమ్మారెడ్డి కుమారుడు వెంకటరమణ తో కలిసి రోశయ్య టిడిపిలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. త్వరలో చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఉమ్మారెడ్డి సైతం టిడిపి బాట పట్టడం ఖాయమని తెలుస్తోంది. మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More