Chandrababu Clean Politics campaign : మహానాడు వేదికగా గట్టిగానే శపథం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ అంటూ సరికొత్త స్లోగన్ ఇచ్చారు. దేశానికి ఉగ్రవాదులు ఎంత ప్రమాదమో.. మన రాష్ట్రానికి ఆర్థిక ఉగ్రవాదులు అంతే ప్రమాదం అంటూ హెచ్చరించారు. ల్యాండ్, శాండ్, మద్యం..ఇలా అన్నిరకాల మాఫియాలు రెచ్చిపోయిన విషయాన్ని ప్రస్తావించారు.వాటన్నింటినీ ఏరిపారిస్తే కానీ ఈ రాష్ట్రం బాగుపడదు అని తేల్చేశారు. అంతటితో ప్రజలు వైకుంఠ పాళీ ఆడవద్దని..శాశ్వతంగా అధికారం అప్పగిస్తే మొత్తం పాలనలో సమూల మార్పులు సాధ్యమని స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ కామెంట్స్ మాత్రం జగన్మోహన్ రెడ్డి శిబిరాన్ని కలవరం పుట్టిస్తున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల తప్పిదాలను ఒక వ్యూహం ప్రకారం బయటపెడుతోంది. పక్కా ఆధారాలు, ప్రణాళికలతోనే నేతల అరెస్టుపర్వం నడుస్తోంది. అన్నింటి కంటే ముఖ్యంగా వైసీపీలో ఉన్న సీనియర్ల జోలికి పోవడం లేదు. ఆ ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా మాట్లాడి, అవినీతికి పాల్పడిన వారిని బయటకు తీసి మరీ కేసుల మీద కేసులు నమోదు చేస్తోంది.
Also Read : ఏపీలో ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్..మహానాడులో చంద్రబాబు పిలుపు అదే..
ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు..
రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలను అందించి.. అడ్డగోలుగా ఆర్థిక దోపిడీకి పాల్పడ్డారన్నది చంద్రబాబు వాదన. దీనిని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ నినాదాన్ని ఇచ్చినట్టు తెలుస్తోంది. వైసీపీ హయాంలో పెద్ద కుంభకోణం మద్యం స్కామ్. నేరుగా ప్రభుత్వమే మద్యం దుకాణాలు పెడితే ఇక ఎక్కడ అవినీతి జరిగినట్టు అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. అక్కడితో ఆగకుండా మద్యం అమ్మకాలు తగ్గితే అవకతవకలు జరగడానికి చోటు ఎక్కడదని ప్రశ్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వం మాత్రం మద్యం ద్వారా రూ.3500 పక్కదారి పట్టించినట్టు పక్కా ఆధారాలు చూపిస్తోంది. ఇదంతా హవాలా రూపంలో దేశం దాటించినట్టు చెబుతోంది. అందుకే ఇందులో ప్రమేయం ఉన్న నేతలు, అప్పటి అధికారులను విడిచిపెట్టకూడదు అని భావిస్తోంది. అటు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని సైతం అరెస్టు చేసేందుకు సిద్ధపడుతోంది.
మట్టి మాఫియాపై…
రాష్ట్ర వ్యాప్తంగా అపార సాగునీటి వనరులు ఉన్నాయి. వీటి నిర్వహణ కంటే.. వీటి ద్వారా సహజ వనరులు ఎక్కువగా కొల్లగొట్టారు అన్నది వైఎస్సార్ కాంగ్రెస్ నేతలపై ఉన్న ప్రధాన ఆరోపణ. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకూ.. అన్ని ప్రాంతాల్లో నదులు, కాలువలు, చెరువులు ఉన్నాయి. వీటిలో ఇసుకను అమ్ముకున్నారు. మట్టి తరలించారు. కాలువ గట్లను సైతం ధ్వంసం మట్టిని తరలించుకుపోయారు. జగనన్న కాలనీల పేరు చెప్పి మట్టి, ఇసుక, కంకర దోపిడీకి తెరతీశారు. అప్పటి ఎమ్మెల్యేల నుంచి మంత్రుల దాకా.. ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసిన అధికారుల వరకూ ఇందులో ప్రమేయం ఉంది. అందుకే చంద్రబాబు ఈ ప్రకటన చేశారు. ప్రేరేపిత ఉగ్రవాదం కంటే.. ఆర్థిక ప్రేరేపిత ఉగ్రవాదం ఈ రాష్ట్రానికి ప్రమాదమని హెచ్చరించారు. తద్వారా జగన్మోహన్ రెడ్డి సర్కారులో అవినీతికి పాల్పడిన ఏ ఒక్కర్నీ విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు.
భూ దోపిడీదారులను ఉద్దేశించి..
వైసీపీ హయాంలో భూదందాకు భారీగా తెరలేపారన్న విమర్శలున్నాయి. అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా ..అవకాశం వచ్చిన చోట విడిచిపెట్టలేదు. ఉత్తరాంధ్రలో భారీగా డీపట్టా భూములను కొల్లగొట్టారన్న ఆరోపణలున్నాయి. అయితే ఇందుకు ఏకంగా వైసీపీ ప్రభుత్వం జీవో తెచ్చి ఈ భూ దోపిడీకి డోర్ తెరిచిందన్న విమర్శలున్నాయి. 20 ఏళ్లు గడువు దాటిన డీ పట్టా భూములను విక్రయించుకోవచ్చన్న జీవో వెనుక అప్పటి వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అస్మదీయ అధికారుల ప్రయోజనం కోసమేనని తేలిపోయింది. ఉత్తరాంధ్రలో భారీగా భూములు చేతులు మారాయని తేలింది. ముఖ్యంగా రాష్ట్రస్థాయి అధికారి ఒకరు తన కుటుంబ సభ్యుల పేరుతో భూములను రాయించుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఎక్కడైనా ఎయిర్ పోర్టులు, ప్రాజెక్టుల స్థాపన జరిగితే అప్పటి వైసీపీ పాలకులు అక్కడ గద్దల్లా వాలిపోయేవారన్న విమర్శలున్నాయి. ఇటువంటి వారిని ఆర్థిక ఉగ్రవాదులుగా పోల్చుతూ.. వారిని ప్రోత్సహిస్తున్న వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డిగా అభివర్ణిస్తూ చంద్రబాబు ఆరోపణలు కొనసాగాయి. దీంతో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.