Nara Bhuvaneshwari : నారా భువనేశ్వరి ఇక జనంలోకి వెళ్ళనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేపట్టనున్నారు. చంద్రబాబు అరెస్టు తరువాత చనిపోయిన అభిమానుల కుటుంబాలను పరామర్శించనున్నారు. వచ్చేవారం నుంచి ఈ పర్యటనలు ప్రారంభం కానున్నాయి. వారానికి కనీసం రెండు మూడు చోట్ల భువనేశ్వరి పర్యటన ఉండేలా చూడాలని పార్టీ వర్గాలు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నాయి. చంద్రబాబు అరెస్టు తరువాత భువనేశ్వరి రాజమండ్రిలోని యువగళం శిబిరంలోనే గడుపుతూ వచ్చారు. చంద్రబాబును ఎప్పటికప్పుడు కలుస్తుండడంతో పాటు టిడిపి శ్రేణులను సమన్వయం చేసుకుంటూ వస్తున్నారు. చంద్రబాబు ఇప్పట్లో విడుదలయ్యేలా కనిపించడం లేదు. జగన్ సర్కార్ వరుస కేసులను పెట్టి విచారణ కోరుతోంది. అందుకే ఇక నారా భువనేశ్వరి జనంలోకి వెళ్లాలని డిసైడ్ అయినట్టు సమాచారం.
వాస్తవానికి చంద్రబాబు అరెస్టు తరువాతే భువనేశ్వరి యాత్రకు ప్లాన్ చేశారు. కానీ చంద్రబాబుకు కోర్టులో ఊరట దక్కిన తర్వాత కార్యక్రమాన్ని రూపొందించాలని అనుకున్నారు. అయితే చంద్రబాబు కేసు విచారణలో తుది తీర్పు ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు. ఈనెల 20న క్వాష్ పిటిషన్ ఫై విచారణ జరగనుంది. కానీ తీర్పు వెలువడే అవకాశం లేదు. ఈ నెలాఖరు వరకు సుప్రీంకోర్టుకు దసరా సెలవులు. దీంతో చంద్రబాబు కేసు విచారణ నవంబర్లోనే కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో జనంలోకి భువనేశ్వరి వెళ్లడమే మేలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
గత 45 రోజులుగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు స్తంభించాయి. ఎన్నికల ముందు కీలకమైన సమయంలో పార్టీ కార్యకలాపాలు ప్రారంభిస్తే మంచిదని సీనియర్లు భావిస్తున్నారు. ఈ తరుణంలో చంద్రబాబు అరెస్టుతో చనిపోయిన కుటుంబాలకు భువనేశ్వరి పరామర్శిస్తే పార్టీకి మైలేజ్ వస్తుందని భావిస్తున్నారు. “నిజం గెలవాలి” పేరుతో యాత్ర చేపట్టనున్నారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో భువనేశ్వరి పర్యటనలు ఉండేలా షెడ్యూల్ రూపొందించనున్నారు. భారీగా జన సమీకరణకు సిద్ధపడుతున్నారు. కాగా ప్రస్తుతం రాజమండ్రిలో ఉంటున్న భువనేశ్వరికి కీలక నాయకులు పరామర్శించి సంఘీభావం తెలుపుతున్నారు.
అటు లోకేష్ ఆధ్వర్యంలో భవిష్యత్ కి గ్యారెంటీ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానుంది. వాస్తవానికి లోకేష్ యువగళం పాదయాత్రను ప్రారంభించాలని భావించారు. అయితే చంద్రబాబు కేసులు విషయంలో తరచూ ఢిల్లీ వెళ్లాల్సి ఉండడంతో యాత్ర విషయంలో పునరాలోచనలో పడ్డారు. మరోవైపు చంద్రబాబు అరెస్టుతో నిలిచిపోయిన భవిష్యత్ కు గ్యారెంటీ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలని భావిస్తున్నారు. అందుకే ఏకకాలంలో అటు భువనేశ్వరి సంఘీభావ యాత్రతో పాటు భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం కొనసాగనుంది. గత 45 రోజులుగా చంద్రబాబు అరెస్ట్ తో పార్టీ కార్యక్రమాలు పక్కకు వెళ్లాయి. దీంతో ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా పార్టీని ముందుకు తీసుకెళ్లే బాధ్యతను లోకేష్ తీసుకుంటున్నారు. అటు భువనేశ్వరి, ఇటు లోకేష్ యాక్టివ్ కావడంతో టిడిపి శ్రేణులు కాస్త ఉపశమనం పొందుతున్నాయి.