Vijayasai Reddy
Vijayasai Reddy : రాజకీయాల నుంచి వైదొలిగారు విజయసాయిరెడ్డి. వైసీపీలో నెంబర్ 2 గా ఉన్న విజయసాయిరెడ్డి కొద్దిరోజుల కిందట పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అటు రాజ్యసభ పదవిని సైతం ఆయన వదులుకున్నారు. వ్యవసాయం చేసుకుంటానని చెప్పుకొచ్చారు. అందుకు సంబంధించి ఫోటోలను సైతం సోషల్ మీడియాలో విడుదల చేశారు. శేష జీవితం హాయిగా గడపాలి అన్న విజయసాయి రెడ్డికి సిబిఐ కోర్టు సైతం తీపి కబురు చెప్పింది. విదేశాలకు వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొద్ది రోజుల కిందట ఆయన విదేశీ పర్యటనకు వెళ్తానంటూ సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో విచారణ చేపట్టిన కోర్టు కొద్ది రోజుల కిందట వాయిదా వేసింది. ఈరోజు దానికి సంబంధించిన తీర్పును వెల్లడించింది. విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
* 15 రోజులపాటు అనుమతి
రాజకీయాల నుంచి తప్పుకోవాలన్న ఆలోచనతో ఉన్న విజయసాయిరెడ్డి.. ఫ్రాన్స్, నార్వే దేశాల్లో పర్యటించేందుకు ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఆయన జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఏ 2 నిందితుడు. విదేశాలకు వెళ్లాలంటే సిబిఐ కోర్టు అనుమతి తప్పనిసరి. దీంతో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ విచారణ జరిపిన హైదరాబాదులోని సిబిఐ కోర్టు.. సిపిఐ అభిప్రాయం కూడా తీసుకుంది. అనంతరం విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనకు అనుమతిస్తూ తీర్పు ఇచ్చింది. 15 రోజులపాటు విదేశాలకు వెళ్లేందుకు విజయసాయి రెడ్డికి అనుమతి లభించింది. వాస్తవానికి ఈ రెండు దేశాల్లో పర్యటనకు విజయసాయిరెడ్డి నెలరోజుల పాటు అనుమతి కోరారు. కోర్టు మాత్రం 15 రోజుల గడువు మాత్రమే ఇచ్చింది. దీంతో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10 లోపు 15 రోజులపాటు విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్ళవచ్చని సూచించింది. దీంతో విజయ్ సాయి రెడ్డి విదేశీ పర్యటనకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
* విదేశాల్లో జగన్
ఇప్పటికే వైసీపీ అధినేత విదేశాలకు వెళ్లారు. ఆయన సైతం అక్రమాస్తుల కేసులను ఎదుర్కొంటున్నారు. అందుకే అప్పట్లో కోర్టు అనుమతి తీసుకోవాల్సి వచ్చింది. అయితే సిబిఐ కోర్టు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు అనుమతించింది. ఆయన పాస్ పోర్టునకు సంబంధించి కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈనెల రెండో వారంలో ఆయన కుటుంబ సమేతంగా లండన్ పర్యటనకు వెళ్లారు. ఫిబ్రవరి 3న ఏపీకి రానున్నట్లు తెలుస్తోంది. ఆయన లేని సమయంలో విజయసాయిరెడ్డి పార్టీకి దూరమయ్యారు. రాజకీయాలనుంచి నిష్క్రమించారు. అయితే జగన్ విదేశాల నుంచి వస్తున్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి పై స్పందించే అవకాశాలు ఉన్నాయి.
* ఖరారు కానీ షెడ్యూల్
మరోవైపు విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. రాజకీయాలనుంచి నిష్క్రమించిన ఆయన సోషల్ మీడియాలో తన సాగుకు సంబంధించిన ఫోటోలు పెట్టడం వైరల్ గా మారింది. అయితే గతంలో విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనకు కోర్టు అనుమతి లభించలేదు. కానీ ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పిన వెంటనే కోర్టు నుంచి ఆమోదం ముద్ర రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై రకరకాల కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.