Jagan Politics: ఏదైనా ఒక రాజకీయ పార్టీకి అధికారంలో ఉంటే ఒకలా.. లేకుంటే మరోలా వ్యవహరించాల్సి ఉంటుంది. అధికారంలో ఉంటే పాలనపై తన మార్కు చూపించాలి. ప్రతిపక్షంలో ఉంటే నిత్యం ప్రజల మధ్య ఉండాలి. అంతే తప్ప పార్ట్ టైం రాజకీయాలు చేస్తామంటే కుదిరే పని కాదు. అయితే గతంలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan) ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సినిమాలతో పాటు రాజకీయాలను కొనసాగించారు. తనకు జగన్మోహన్ రెడ్డిలా లక్షల కోట్లు లేవని.. తాను సినిమాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని పార్టీకి ఖర్చు పెడుతున్నట్లు చెప్పుకొచ్చేవారు. అయితే చంద్రబాబుతో పాటు లోకేష్ హైదరాబాదులో ఉంటూ ఏపీకి నిత్యం వచ్చేవారు. అయితే ఆ ముగ్గురు నేతలను పార్ట్ టైం నాయకులుగా అభివర్ణించేవారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఇప్పుడు అదే విమర్శ తమ అధినేతకు వచ్చేసరికి వారి నోట మాట రావడం లేదు.
వారంలో మూడు రోజులే..
జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy ) ఇప్పుడు షటిల్ సర్వీసులు నడుపుతున్నారు. బెంగళూరు నుంచి తాడేపల్లి కి వారంలో మూడు రోజులు పాటు వస్తున్నారు. విదేశీ పర్యటనలతో పాటు వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఎదురైతే అది కూడా కష్టమే. అయితే గత మూడు రోజులుగా పులివెందులలో పర్యటించారు. అటు నుంచి అటే బెంగళూరు వెళ్ళిపోతున్నారు. అంటే ఈ వారంలో మూడు రోజుల పాటు అయిపోయినట్టే. ఇంకా ఏపీకి ఆయన రావాలంటే మరో వారం రోజులు పాటు వెయిట్ చేయాల్సిందే. అయితే చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్, లోకేష్ లను పార్ట్ టైం నేతలుగా అభివర్ణించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఇప్పుడు అధినేత తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఆరాధించే నాయకుడు పట్ల ఇలా అసహనం చెందుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి లోపమే కదా.
నేతల పరామర్శ ఏది?
చంద్రబాబు,లోకేష్ హైదరాబాదు నుండి రాకపోకలు సాగించేవారు. అది నిజమే కానీ వారు అవసరం అయినప్పుడు ప్రజల మధ్యకు వచ్చేవారు. పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండేవారు. 2019లో ఎదురైన ఓటమి గుణపాఠాలను అనుభవాలుగా మార్చుకున్నారు. ఇప్పుడు అటువంటి పరిస్థితి ఉందా అంటే లేదనే సమాధానం వస్తోంది. ఒకవైపు పార్టీ నాయకులు అరెస్టుల పర్వం కొనసాగుతోంది. అప్పట్లో తనకోసం, తన రాజకీయం కోసం వారిని వాడుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు దానికి వారు మూల్యం చెల్లించుకుంటున్నారు. కేసుల్లో ఇరుక్కుంటున్నారు. వారిని పరామర్శించాలన్న ధ్యాస కూడా జగన్మోహన్ రెడ్డికి లేకుండా పోతోంది. వారు ఇబ్బందుల్లో ఉంటే కనీసం వారికి స్వాంతన చేకూర్చడం లేదు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి లాంటి లాయర్లను అప్పగించి ఎంచక్కా బెంగళూరు వెళ్ళిపోతున్నారు. ఈ పార్ట్ టైం రాజకీయాలు చల్లవన్న విషయాన్ని గుర్తించుకోవడం లేదు జగన్మోహన్ రెడ్డి. చివరి ఏడాదిలో చూసుకోవచ్చులే అన్నట్టు భావిస్తున్నారు. కానీ అది ఎంత మాత్రం సహేతుకం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2014 నుంచి 2019 మధ్య కూడిన రాజకీయం చేస్తామంటే ఎంత మాత్రం తగదని చెబుతున్నారు. ఇక మారాల్సింది జగన్మోహన్ రెడ్డి.