Byreddy Shabari: ఏపీలో పొత్తు ధర్మం నడుస్తోందా?భాగస్వామ్య పార్టీల మధ్య సహృద్భావ వాతావరణం ఉందా? అసలు మూడు పార్టీలు పరస్పరం గౌరవించుకుంటున్నాయా? వాటి మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. నేతల చేరికలు మూడు పార్టీల మధ్య జరుగుతున్నాయి. ఒక నియోజకవర్గంలో టికెట్ దక్కకుంటే.. భాగస్వామ్య పార్టీలో చేరి టిక్కెట్ దక్కించుకుంటున్నారు. అయితే పార్టీల నాయకత్వాలకు తెలిసే ఇది జరుగుతోందా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.
పొత్తుల్లో భాగంగా సొంత పార్టీపై అసంతృప్తి ఉంటే ప్రత్యర్థి పార్టీలోకి వెళ్ళాలి. కానీ ఏపీలో అలా జరగడం లేదు. టిడిపి నుంచి జనసేనకు.. జనసేన నుంచి టీడీపీకి.. బిజెపి నుంచి టిడిపిలోకి.. నేతలు వలస బాట పడుతున్నారు. వారికి నాయకత్వాలు ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాయి. టిక్కెట్లు ఖరారు చేస్తున్నాయి. దీంతో ఇది పేరుకే పొత్తు అన్న మాట వినిపిస్తోంది. భాగస్వామ్య పార్టీల్లో నాయకులను తెచ్చి టిక్కెట్లు కట్టబెడుతుండడం మాత్రం విమర్శలకు తావిస్తోంది. భీమవరంలో మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు టిడిపి నుంచి జనసేనలోకి రప్పించారు. ఆయనకే టికెట్ ఖరారు చేయనున్నారు.
తాజాగా బిజెపి నుంచి బైరెడ్డి శబరి టిడిపిలో చేరారు. ఆమె మాజీ మంత్రి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమార్తె. నిన్నటి వరకు తండ్రి తో పాటు బిజెపిలో పని చేశారు. యాక్టివ్ రాజకీయాలను నడిపారు. ఇప్పుడు ఆమె టిడిపిలో చేరడం టికెట్ పై గురిపెట్టడమేనని తెలుస్తోంది. కర్నూలు జిల్లాలో ఆమెకు ఎంపీ సీటు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే భాగస్వామ్య పార్టీల్లో నేతల చేరికలు ఇబ్బందికర పరిస్థితులను తెచ్చి పెడతాయని క్యాడర్ ఆందోళన చెందుతోంది. ఇలా అయితే ఓట్ల బదలాయింపు సక్రమంగా జరగదని.. పార్టీల మధ్య అంతరం పెరుగుతుందని.. లోకల్ క్యాడర్లు కలిసి పనిచేయని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీలో ఉన్న ప్రోటీడిపి నేతలు టికెట్లు దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే బిజెపి నుంచి నాయకులు టిడిపిలో చేరుతుండడాన్ని కూడా కాషాయ దళం సహించలేకపోతోంది. టిడిపి ది వెన్నుపోటు రాజకీయమని ఆరోపిస్తోంది. ఎన్నికల ముందు ఇలాంటి చిత్రాలు ఎన్నో చూడాల్సి ఉంటుంది.