AP By Elections: ఏపీలో( Andhra Pradesh) సైతం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం తెరపైకి వచ్చింది. అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సమావేశం కావడంతో ఈ ప్రస్తావన వచ్చింది. వరుసగా 60 పని దినాలు శాసనసభకు హాజరుకాని ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేసే అవకాశం స్పీకర్ కు ఉంటుంది. దానిని గుర్తు చేస్తూ ఎథిక్స్ కమిటీ చైర్మన్ మండలి బుద్ధ ప్రసాద్ నేతృత్వంలోని సభ్యులు చర్చించినట్లు సమాచారం. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కాని సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేసేందుకు వచ్చారు. తర్వాత గవర్నర్ బడ్జెట్ ప్రసంగాన్ని వినేందుకు ఓసారి వచ్చారు. అయితే కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండానే రిజిస్టర్లో సంతకాలు పెడుతున్నారని గతంలోనే స్పీకర్ చెప్పుకొచ్చారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప మిగతా పదిమంది జీతాలు సైతం తీసుకుంటున్నారు. అందుకే వారిపై అనర్హత వేటు వేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
* రెండుసార్లు సభకు..
2024 జూన్ లో అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం( Alliance government ). కేవలం 11 స్థానాలకి పరిమితం అయింది వైసిపి. టెక్నికల్గా ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదు ఆ పార్టీకి. అయితే సభకు హాజరు కావాలంటే తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. హోదా ఇవ్వకపోతే సభకు హాజరయ్యే అవకాశం లేదని తేల్చి చెప్పారు. అప్పటినుంచి సభకు హాజరు కావడం లేదు. అయితే అసెంబ్లీ సమావేశాలను పరిగణలోకి తీసుకుని
.. పని దినాలు 60 రోజుల పాటు హాజరు కాకుంటే మాత్రం అనర్హత వేటు వేసేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు దానిపైనే చర్చించింది ఎథిక్స్ కమిటీ. ఆ కమిటీ అనర్హత వేటుపై ప్రతిపాదన చేసే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం సైతం దీనిని సీరియస్ గా తీసుకుంటున్న క్రమంలో తప్పకుండా వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత పడనుందని చర్చ నడుస్తోంది.
* ఆ అవకాశం ఇవ్వకుండా..
ఒకవేళ వైసీపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోతే వారి నుంచి గట్టి సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం తమకు భయపడుతోందని వారు వ్యాఖ్యానించే అవకాశాలు కూడా ఉన్నాయి. దమ్ముంటే అనర్హత వేటు వేయండి అని వారు తిరిగి డిమాండ్ చేసే పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంది. టిడిపి కూటమి ప్రభుత్వ పట్ల ప్రజల్లో సంతృప్తి కనిపిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో అనర్హత వేటు వేసి ఉప ఎన్నికలకు వెళ్తే అది అంతిమంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నష్టం. అందుకే ఈ అనర్హత వేటు అంశాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది. తప్పకుండా సభకు హాజరు కావాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడుతుంది. అయితే కూటమి ప్రభుత్వం ఎంతవరకు ఈ అంశాన్ని ముందుకు తీసుకెళుతుంది? వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.