Brother Anil Kumar : కెసిఆర్, జగన్ మధ్య రాజకీయ స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇద్దరూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వారి ఉమ్మడి శత్రువు చంద్రబాబు. తెలంగాణలో చంద్రబాబు వేలి పెడతారని భావించి జగన్ తో చేతులు కలిపారు కేసీఆర్. ఆ ఇద్దరూ కలిసి చంద్రబాబును ఓ రేంజ్ లో ఆడుకున్నారు. ఈ ఎన్నికల్లో ఇద్దరూ ఓడిపోయారు. ఇద్దరి పరిస్థితి ఒకేలా ఉంది. తమ రాష్ట్రాల్లో ఉనికి చాటుకునేందుకు సైతం ఇబ్బంది పడుతున్నారు. అయితే వారిద్దరూ రాష్ట్రాల ప్రయోజనాల కంటే.. రాజకీయ ప్రయోజనాలకే పెద్ద పీట వేశారన్న విమర్శలు ఉన్నాయి. 2014 నుంచి 2023 వరకు కెసిఆర్ అధికారంలో ఉన్నారు. అదే 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. కానీ చంద్రబాబుతో ఉన్న విభేదాలతో కెసిఆర్ విభజన హామీల పరిష్కారానికి ముందుకు రాలేదు. 2019లో జగన్ అధికారంలోకి రావడంతో విభజన సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుందని అంతా భావించారు. కెసిఆర్ తో జగన్ కు మంచి సంబంధాలు ఉండడంతో ఇది సాధ్యమని అంతా నమ్మారు. కానీ వారి మధ్య రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలు అధికంగా నడిచాయి. ఇదే విషయాన్ని తాజాగా చెప్పుకొచ్చారు జగన్ బావ బ్రదర్ అనిల్ కుమార్. షర్మిల భర్తగా ఉన్న బ్రదర్ అనిల్ కుమార్ ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
* అప్పట్లో ప్రశాంత్ కిషోర్ సలహా
2019లో ఏపీలో వైసిపి అధికారంలోకి రావడానికి ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు పనిచేశాయి. పీకే ఇచ్చిన సలహాలతోనే ఏపీలో వైసీపీ అధికారంలోకి రాగలిగింది. అదే చదువుతో తెలంగాణలో సైతం వైసీపీని ఏర్పాటు చేద్దామని షర్మిల వద్ద ప్రతిపాదన పెట్టారు ప్రశాంత్ కిషోర్. అయితే ఆమె తన సోదరుడు జగన్ ను అడగాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే జగన్ మాత్రం మరో మాటకు తావు లేకుండా అటువంటిది వద్దని తేల్చి చెప్పారు. అక్కడ మన మిత్రుడు కేసీఆర్అధికారంలో ఉన్నారని.. పెద్ద ఎత్తున ఆస్తులు సైతం అక్కడే ఉన్నాయని.. అందుకే తెలంగాణ జోలికి వెళ్ళవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అయితే ప్రశాంత్ కిషోర్ ఒకింత ఆశ్చర్యానికి కూడా గురయ్యారని తెలుస్తోంది. ఇప్పుడు అదే విషయాన్ని ప్రకటించారు బ్రదర్ అనిల్ కుమార్.
* ఎంతవరకు వెళతాయో
అయితే తాజాగా బ్రదర్ అనిల్ కుమార్ కామెంట్స్ చూస్తే.. జగన్, కెసిఆర్ మధ్య ఏ స్థాయిలో రాజకీయ ప్రయోజనాలు నడిచాయో అర్థం అవుతుంది. అయితే ఇప్పుడు ఆ ఇద్దరి పరిస్థితి రాజకీయంగా ఇబ్బందికరంగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సహృద్భావ వాతావరణం ప్రస్తుతం నెలకొని ఉంది. ఇటువంటి తరుణంలోనే బ్రదర్ అనిల్ కుమార్ వారి రహస్య అజెండాను బయటపెట్టడం విశేషం.