YS Viveka Case : వివేకా హత్యకేసులో మరో సంచలనం నమోదుకానుందా? మాజీ చీఫ్ సెక్రెటరీ అజయ్ కల్లాం స్టేట్ మెంట్ కీలకం కానుందా? కేసు మలుపు తిరగనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ కేసు విషయంలో సీబీఐ దూకుడు మీద ఉంది. విచారణకు హాజరుకావాలని ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులిచ్చింది. ఇప్పుడు అజయ్ కల్లాంతో పాటు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, దువ్వూరి కృష్ణ, జగన్ పీఏ కృష్ణమోహన్ రెడ్డిలను సీబీఐ అధికారులు విచారించనున్నారు. ఆ నలుగుర్ని విచారిస్తే కేసు ఒక కొలిక్కి వస్తుందని ఆంధ్రజ్యోతి ఎండీ రాధాక్రిష్ణ తన కొత్తపలుకు కాలమ్ లో రాసిన సంగతి తెలిసిందే. అయితే దీనిని సుమోటాగా తీసుకుందో? లేక ఇప్పటికే సమాచారం ఉందో తెలియదు కానీ… ఆ నలుగురు నుంచి సీబీఐ స్టేట్ మెంట్లు సేకరిస్తోంది.
ఆ నలుగురికి..
వివేకా హత్యకు గురైన ఆ రోజు తెల్లవారుజామున జగన్ తో పాటు ఆ నలుగురు ఎన్నికల మేనిఫెస్టో రూపొందించడంలో నిమగ్నమయ్యారు. ఆ సమయంలో జగన్ కి ఫోన్ వచ్చింది. దీంతో ఆయన పైఅంతస్తుకు వెళ్లారు. తిరిగి వచ్చి గుండెపోటుతో బాబాయ్ వివేకానందరెడ్డి మృతిచెందారని ఆ నలుగురికి చెప్పారు. ఏబీఎన్ ఆర్కే తన రాతలు ద్వారా చెప్పిన మాటలు ఇవే. ఇప్పుడు ఇదే బేస్ చేసుకొని అజయ్ కల్లాం నుంచి స్టేట్ మెంట్ రికార్డు చేసినట్టు సమాచారం. సీఎం జగన్ తన బాబాయ్ గుండెపోటుతో చనిపోయారని కల్లాం వెల్లడించినట్టు తెలుస్తోంది. ఇప్పుడు కేసులో ఇదే కీలకమయ్యే చాన్స్ కనిపిస్తోంది.
తొలుత గుండెపోటు..ఆపై హత్య
తొలుత గుండెపోటు అని నమ్మించే ప్రయత్నం చేశారని.. ఇందులో భారీ కుట్ర జరిగిందని.. నిందితులందరూ ఘటనలో భాగస్థులేనని సీబీఐ అనుమానిస్తోంది. కేసులో పట్టు బిగిస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలో జగన్ పేరు బయటకు రావడం హాట్ టాపిక్ గా మారింది. ఆ నలుగురికి గుండెపోటు అని చెప్పిన సీఎం జగన్.. తరువాత తన బాబాయ్ ను దారుణంగా హత్య చేశారని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. సీబీఐ దర్యాప్తునకు అప్పట్లో డిమాండ్ చేశారు. తెల్లవారుజామున ఆ నలుగురికి గుండెపోటు అని చెప్పి… ఉదయానికి హత్య అని ప్రకటించడమనే పాయింట్ ను బేస్ చేసుకొని సీబీఐ దర్యాప్తు ముందుకెళ్లే అవకాశముంది.

వారినీ విచారించే చాన్స్..
అజయ్ కల్లాం స్టేట్ మెంట్ ను రికార్డు చేసిన సీబీఐ.. తదుపరి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును విచారించనున్నట్టు తెలుస్తోంది. రేపోమాపో దువ్వూరి కృష్ణనూ ప్రశ్నించే అవకాశం ఉంది. ఇప్పటికే అవినాష్ రెడ్డి ఫోన్ నుంచి వివేకా హత్య సమయానికి అటూ ఇటూగా జగన్ పీఏ కృష్ణమోహన్ రెడ్డి, భారతి రెడ్డి పీఏ నవీన్ ఫోన్లకు కాల్స్ వచ్చినట్లుగా గుర్తించారు. వారిని ప్రశ్నించారు కూడా. ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఫోన్లు చేశారని .. చనిపోయారని చెప్పడానికి చేసి ఉంటారని ఇంత దానికి ఎందుకు రచ్చ చేస్తున్నారని ప్రశ్నించారు. మొత్తంగా వివేకా హత్య గురించి సీఎం జగన్ ను ముందుగానే తెలుసన్న అభిప్రాయం అంతటా బలపడుతోంది.