Botsa Satyanarayana: బొత్స తో జగన్మోహన్ రెడ్డికి( Y S Jagan Mohan Reddy) గ్యాప్ పెరుగుతోందా? అనవసరంగా ఆయనకు ప్రాధాన్యం ఇచ్చానని జగన్ బాధపడుతున్నారా? జగన్ ఆశించిన స్థాయిలో బొత్స పని చేయడం లేదా? పైగా జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేని పనులను చేస్తున్నారా? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. శాసనమండలిలో బొత్స వ్యవహరిస్తున్న తీరు కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. అదే సమయంలో ఆయన బయట జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థులను కలుస్తుండడం, వేదికలు పంచుకోవడం కూడా.. జగన్ కు నచ్చడం లేదని తెలుస్తోంది. అనవసరంగా బ్రతుకు అవకాశం ఇచ్చానని జగన్ బాధపడుతున్నట్లు సమాచారం. ఆశించిన స్థాయిలో పనిచేయకపోగా.. అధినేత విషయంలో అంత ఆసక్తి చూపడం లేదని బొత్సపై పార్టీ శ్రేణులు కూడా ఆగ్రహంగా ఉన్నాయి.
* అధినేత వైఖరికి భిన్నంగా..
రెండు రోజుల కిందట దేశవ్యాప్తంగా జీఎస్టీ( GST) తగ్గింపు విధానం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు 375 వస్తువులపై జిఎస్టి తగ్గింది. దీనిపై దేశవ్యాప్తంగా ప్రజలు ఆహ్వానిస్తున్నారు. బిజెపి వ్యతిరేక పార్టీలు మాత్రం ఎన్నెన్నో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఏపీకి సంబంధించి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం బ్రహ్మాండం అంటూ జీఎస్టీని ఉద్దేశించి ట్విట్ చేశారు. కానీ శాసనమండలిలో జీఎస్టీ తగ్గింపు పై ఆందోళన వ్యక్తం చేశారు బొత్స. దానికి సంబంధించిన తీర్మానంపై సానుకూలత వ్యక్తం చేయలేదు. దీంతో ఒక్కసారిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు సైతం ఆశ్చర్యపోయారు. అధినేత అభినందనలు తెలుపుతుంటే.. బొత్స వ్యతిరేకించడం ఏంటి అని వారు చర్చించుకున్నారు. ఎక్కడో తేడా కొడుతోందని అనుమానపు చూపులు చూసినవారు ఉన్నారు.
* ఆ విషయంలో కలత
సాధారణంగా రాజకీయ ప్రత్యర్థులతో సొంత పార్టీ నేతలు కలవడం జగన్మోహన్ రెడ్డికి నచ్చదు. తెలంగాణలో తన తండ్రి పేరిట వైయస్సార్ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేశారు షర్మిల. అప్పట్లో ఆ పార్టీ ఆవిర్భావ సభకు వైసిపి నేతలకు సైతం ఆహ్వానాలు అందాయి. కానీ అప్పట్లో సీఎం హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలను నియంత్రించారన్న విమర్శ ఉంది. అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు హాజరు కాలేదు. అటువంటిది ఇటీవల బొత్స సత్యనారాయణ షర్మిల తో వేదిక పంచుకున్నారు. ఆమెతో చాలాసేపు ముచ్చట్లు పెట్టుకున్నారు. మరోవైపు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజుతో సైతం చాలా క్లోజ్ గా గడిపారు. ఇవన్నీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు జగన్మోహన్ రెడ్డికి ఎంత మాత్రం నచ్చటం లేదు.
* మంచి అవకాశాలు ఇచ్చినా
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చాలా రోజులపాటు దూరంగా ఉండిపోయారు బొత్స. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సమయంలో బొత్స ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు. 2014 ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నేతలు వైసీపీలోకి వెళ్లారు. కానీ బొత్స సత్యనారాయణ మాత్రం వెళ్లలేదు. 2014లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేశారు. 2017 ఆ సమయంలో మాత్రమే వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచి మంత్రి అయ్యారు బొత్స. ఐదేళ్లపాటు పూర్తిగా మంత్రి పదవి ఇచ్చారు జగన్. 2024 ఎన్నికల్లో బొత్స ఓడిపోతే.. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. శాసనమండలిలో వైసిపి పక్ష నేతగా కూడా ఛాన్స్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయనది క్యాబినెట్ హోదా. జగన్మోహన్ రెడ్డికి కూడా ఇప్పుడు ఆ హోదా లేదు. కానీ జగన్ ఆలోచనలకు తగ్గట్టు బొత్స పని చేయడం లేదు. అయితే ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయోనని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.