Botsa Family Politics Vizianagaram: రాజకీయాల్లో కొన్ని కుటుంబాలకు కొన్ని ప్రాంతాలు ప్రత్యేకం. అక్కడ దశాబ్దాలుగా కుటుంబాలు రాజకీయం చేస్తాయి. ఉత్తరాంధ్రలో ఈ వాతావరణం ఎక్కువగా ఉంటుంది. శ్రీకాకుళంలో అయితే ధర్మాన, కింజరాపు కుటుంబాలు హవాను చాటుకుంటాయి. విజయనగరానికి వచ్చేసరికి బొత్స వర్సెస్ పూసపాటి రాజ కుటుంబాల మధ్య గట్టి వైరం ఉంటూ వస్తోంది. విశాఖలో పేరు మోసిన కుటుంబాలు రాజకీయం చేస్తూ వస్తున్నాయి. అయితే మునుపటి మాదిరిగా కుటుంబ వారసులు రాజకీయం చేస్తున్నారు కూడా. ఇప్పుడు ఆ కోవలోకి వస్తుంది బొత్స ఫ్యామిలీ. విజయనగరం అంటేనే ముందుగా గుర్తొచ్చేది బొత్స. ఆయన ఒక్కరే కాదు కుటుంబమంతా రాజకీయాలు చేస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు రెండో తరం రెడీ అవుతోంది.
* అంతటా బొత్స హవా..
విజయనగరం జిల్లా అంటేనే బొత్స హవా ఉంటుంది అనేది ఒక కామెంట్. చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ గెలిచారు. ఆయన సోదరుడు అప్పల నరసయ్య గజపతినగరం నుంచి.. మరో సమీప బంధువు అప్పలనాయుడు నెల్లిమర్ల నుంచి… మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు జిల్లా పరిషత్ చైర్మన్ గాను పదవి బాధ్యతలు చేపట్టారు. మిగతా నియోజకవర్గాల్లో తన మనుషులను మాత్రమే పెట్టుకుని గెలిపించుకునేవారు. అయితే మొన్నటి ఎన్నికల్లో మాత్రం తనతో పాటు కుటుంబ సభ్యులంతా ఓడిపోయారు. తాను నిలబెట్టిన నేతలు సైతం ఓటమి చవి చూశారు. పైగా ఇప్పుడు టిడిపి కూటమి పట్టు బిగిస్తోంది. ఇటువంటి తరుణంలో బొత్స ఫ్యామిలీ మునుపటిలా రాజకీయం చేసే పరిస్థితి లేదు. ఈ సమయంలో బొత్స తన ఇద్దరు పిల్లలను రాజకీయాల్లోకి తీసుకురావడం నిజంగా సాహసమే.
* ఆ రాజకీయం కుదరదు..
ఏ ప్రభుత్వం ఉన్నా.. ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. విజయనగరం జిల్లాలో మాత్రం బొత్స ఫ్యామిలీ హవా ఉండేది. ఎందుకంటే అధికార యంత్రాంగంలో బొత్స మనుషులు ఉండేవారు. ప్రత్యర్థి పార్టీల్లో సైతం బొత్స అభిమానులు మెలిగే వారు. బొత్స ఫ్యామిలీ పొలిటికల్ గా ఇంతలా ప్రభావం చూపడానికి అదే ప్రధాన కారణం. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. సంప్రదాయ రాజకీయాలు చేసే అశోక్ గజపతిరాజు ఇప్పుడు లేరు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కిమిడి నాగార్జున వంటి నాయకులు వచ్చారు తెరపైకి. విజయనగరం జిల్లా అంతా లోకేష్ పర్యవేక్షణలో ఉంది. ఇటువంటి సమయంలో బొత్స వారసులు రంగంలోకి దిగడం చూస్తుంటే సరైనదేనా అనే చర్చ మొదలవుతోంది. ఎందుకంటే బొత్స సత్యనారాయణ మాదిరిగా వారి పిల్లలు రాజకీయం చేస్తామంటే కుదరదు. కేవలం ప్రజాబలాన్ని మాత్రమే నమ్ముకోవాలి. ప్రజలు అవకాశం ఇస్తే తప్ప.. ప్రత్యర్థి పార్టీల బలహీనతలను.. యంత్రాంగం మద్దతు దక్కే అవకాశం లేదు. గతంలో బొత్స తన కుటుంబ సభ్యులను రాజకీయానికి పరిచయం చేస్తే విజయం నల్లేరు మీద నడక లా ఉండేది. ఇప్పుడు మాత్రం కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. అందుకే బొత్స వారసులు రాజకీయాల్లో ఎంతవరకు రాణిస్తారు అనేది ఒక అనుమానమే.
