Bhogapuram Airport Video: ఏపీలో( Andhra Pradesh) కూటమి ప్రభుత్వం దూకుడు మీద ఉంది. గత 16 నెలల కాలంలో అనేక ప్రాజెక్టులు ఏపీకి వచ్చాయి. మరోవైపు అమరావతి రాజధాని నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చాలా వేగవంతంగా సాగుతోంది. ఇంకోవైపు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు సైతం జెట్ స్పీడుతో కొనసాగుతున్నాయి. దాదాపు 86% పనులు పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలో భోగాపురం విమానాశ్రయం ఎప్పుడు ప్రారంభం అవుతుంది? అన్నదానిపై తెలుగుదేశం పార్టీ ట్వీట్ చేసింది. ఓ వీడియోను సైతం జత చేసింది. ప్రస్తుతం అదే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
* విభజనతో ఏపీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్..
రాష్ట్ర విభజనలో భాగంగా ఏపీకి అంతర్జాతీయ విమానాశ్రయం( International Airport) మంజూరు అయ్యింది. 2014లో అధికారకలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం విజయనగరం జిల్లా భోగాపురంలో ఎయిర్పోర్ట్ నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అప్పట్లో పౌర విమానయాన శాఖ మంత్రిగా విజయనగరం జిల్లాకు చెందిన పూసపాటి అశోక్ గజపతిరాజు ఉండేవారు. దీంతో భోగాపురం ప్రతిపాదన శరవేగంగా జరిగింది. వాస్తవానికి విశాఖలో విమానాశ్రయం ఉంది. కానీ అక్కడకు 50 కిలోమీటర్ల దూరంలోని భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలని సంకల్పించారు. తద్వారా ఉత్తరాంధ్రతో పాటు గోదావరి, అదే సమయంలో ఒడిస్సా, చత్తీస్గడ్ రాష్ట్రాలకు చెందిన ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది ఆలోచనతో ముందుకు సాగింది టిడిపి ప్రభుత్వం. 2019 ఫిబ్రవరిలో సీఎం చంద్రబాబు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే 2019 ఎన్నికల్లో టిడిపి ఓడిపోయింది. అటు తరువాత భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టూ రాజకీయాలు నడిచాయి. 2023 మేలో అప్పటి సీఎం జగన్ భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి మరోసారి శంకుస్థాపన చేశారు. అప్పటినుంచి పనులు ప్రారంభం అయ్యాయి. అయితే 2024లో అధికారంలోకి వచ్చిన టిడిపి కూటమి ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం.. సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించడంతో.. భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. ఈ ఎయిర్పోర్టుకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టిన సంగతి తెలిసిందే.
* కూటమి వచ్చిన తర్వాత శరవేగంగా..
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడే నాటికి భోగాపురం ఎయిర్పోర్ట్ పురోగతి కేవలం 28% మాత్రమే. ఇప్పుడది 86 శాతానికి చేరుకుంది. గత 16 నెలల్లో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం వేగవంతంగా జరిగాయి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు రాష్ట్ర మంత్రులు ఎప్పటికప్పుడు ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని పర్యవేక్షించారు. ఇక్కడ ఎయిర్పోర్ట్ నిర్మాణం రెండు దశల్లో జరగనుంది. ప్రపంచంలోనే అతి పొడవైన విమానాలు ఇక్కడ ల్యాండ్ అయ్యేలా 3.8 కిలోమీటర్ల పొడవుతో రెండు రన్ వేలను నిర్మిస్తున్నారు. తొలి దశలో 22 ఏరో బ్రిడ్జిలు, 81 వేల చదరపు మీటర్ల టెర్మినల్ బిల్డింగ్ నిర్మించనున్నారు. ఇప్పటికే కేటాయించిన 2023 ఎకరాలకు అదనంగా.. మరో 5 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. ప్రస్తుతం విశాఖ విమానాశ్రయం నుంచి ఏడాదికి 36 లక్షల మంది ప్రయాణికులు రాకపోకల సాగిస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ 60 లక్షల మందికి సేవలు అందించనుంది. భవిష్యత్తులో మరిన్ని సేవలు మెరుగుపరుచుకొనుంది. ఇంతటి ప్రాధాన్యత గల ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 2026 ఆగస్టులో ప్రారంభిస్తామని టిడిపి తన అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. మొత్తానికైతే మరో ఎనిమిది నెలల్లో భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రానుందన్నమాట.
అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్ట్, భోగాపురం…
3.8 కిలోమీటర్ల అతి పెద్ద రన్ వేతో దేశంలోనే అధునాతమైన అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులు 85 శాతం పైగా పూర్తి అయ్యాయి. చంద్రబాబు గారి టార్గెట్ ప్రకారం 2026 ఆగష్టు నాటికి ప్రారంభించే దిశగా పనులు సాగుతున్నాయి.… pic.twitter.com/TtJbRRXtVD
— Telugu Desam Party (@JaiTDP) October 21, 2025