Bharat Margani: సానుభూతి కోసం మార్గాని భరత్ అంత పని చేశాడా?

చిన్ననాటి నుంచి సినిమాలంటే భరత్ కు ఆసక్తి. హీరో కావాలన్నదే ధ్యేయం. అందుకే విశాఖలోని సత్యానంద ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేరి శిక్షణ పొందారు. భరత్ నటనలోనే కాదు క్రీడల్లోనూ రాణించేవారు.

Written By: Dharma, Updated On : July 5, 2024 12:33 pm

Bharat Margani

Follow us on

Bharat Margani: ఏపీలో జగన్ కు అత్యంత సన్నిహితమైన నేతల్లో మార్గాని భరత్ ఒకరు. తొలుత సినిమాల్లో నటించి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. సినిమాల కంటే రాజకీయాలే ఉత్తమమని భావించి వైసిపి ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. తొలి ప్రయత్నం లోనే భారీ మెజారిటీతో ఎంపీగా గెలిచారు. ఈసారి మాత్రం రాజమండ్రి అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.వైసీపీలో ఉన్నప్పుడు అతిగా వ్యవహరించే వారన్న విమర్శ ఉంది.అయితే ఇప్పుడు ఓటమి ఎదురు కావడంతో జీర్ణించుకోలేకపోతున్నారన్న ప్రచారం ఉంది.ఈ నేపథ్యంలోనే ఆయన తన ప్రచార రథాన్ని ప్రత్యర్థులు దగ్ధం చేశారని ఏకంగా డీజీపీకి ఫిర్యాదు చేశారు. కానీ పోలీసు విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

చిన్ననాటి నుంచి సినిమాలంటే భరత్ కు ఆసక్తి. హీరో కావాలన్నదే ధ్యేయం. అందుకే విశాఖలోని సత్యానంద ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేరి శిక్షణ పొందారు. భరత్ నటనలోనే కాదు క్రీడల్లోనూ రాణించేవారు. అయితే ఉన్నట్టుండి రాజకీయ అవతారం ఎత్తడంతో.. పూర్తి సీన్ మారింది. చేతిలోకి పవర్ రావడంతో రెచ్చిపోయారు భరత్. జగన్ పై ఈగ వాలనిచ్చేవారు కాదు. ఎంపీగా ఉంటూ గుడ్ మార్నింగ్ రాజమండ్రి అంటూ రెచ్చిపోయేవారు. పవన్ అంటే తీవ్రస్థాయిలో విరుచుకుపడేవారు. అమరావతి టు అరసవల్లి స్వామి వారి దర్శనానికి వెళ్తున్న రాజధాని రైతులపై దాడులు చేయించారన్న విమర్శ కూడా భరత్ పై ఉంది. అయితే భరత్ ను అసెంబ్లీకి పంపించి మంత్రి పదవి ఇవ్వాలని జగన్ భావించారు. కానీ జనం మాత్రం యాక్సెప్ట్ చేయలేదు. భరత్ ను దారుణంగా ఓడించడంతో పాటు వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు.

అయితే రాజకీయ ప్రత్యర్థులపై ఆరోపిస్తూ మార్గాని భరత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ప్రచార రథాన్ని టిడిపి నేతలు కాల్ చేశారని వారం రోజుల కిందట భరత్ హడావిడి చేశారు. స్వయంగా అమరావతి వెళ్లి డిజిపికి ఫిర్యాదు చేశారు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.అయితే ఆ రధాన్ని దగ్ధం చేసింది వైసీపీ కార్యకర్త,భరత్ అనుచరుడు దంగేటి శివాజీ. జూన్ 28న మార్గాని ఎస్టేట్స్ కార్యాలయంలో ప్రచార రథాన్ని తగులు పెట్టాడు. భరత్ ఓడిపోవడంతో ప్రజల్లో సానుభూతి, టిడిపికి చెడ్డ పేరు తెచ్చేందుకే ఈ ఘటనకు పాల్పడినట్లు విచారణలో తేలింది. అయితే ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భరత్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో ఓ వీడియోని విడుదల చేశారు ఆయన. సానుభూతి కోసం ఆ పని చేయలేదని.. కావాలంటే దేవుడి గుడిలో ప్రమాణానికి సిద్ధమని చెప్పుకొచ్చారు. అయితే భరత్ తనకు తాను ఈ వీడియోను బయట పెట్టడంతో.. తెర వెనుక వ్యవహారాన్ని ఇట్టే పసిగడుతున్నారు నెటిజెన్లు.