AP Politics : వైసీపీ అధినేత జగన్ హస్తిన బాట పట్టారు. జాతీయస్థాయిలో ఏపీలో జరుగుతున్న అరాచకాలపై గళం ఎత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపిస్తూ.. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టారు. ఇటీవల పల్నాడు జిల్లా వినుకొండలో వైసిపి కార్యకర్త దారుణంగా హత్యకు గురయ్యాడు. నడిరోడ్డుపై ఆయన కాళ్లు చేతులు నరికేశాడు హంతకుడు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన జగన్.. ఏపీలో కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శాసనసభ సమావేశాలకు తొలి రోజు హాజరయ్యారు. హత్య రాజకీయాలపై నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు అడ్డుకున్నారు. శాసనసభ సమావేశాలకు హాజరైన జగన్ వైసీపీ ఎమ్మెల్యేలతో వాకౌట్ చేసి బయటకు వచ్చారు. ఏపీలో విపక్షం గొంతు నొక్కుతున్నారని ఆరోపిస్తూ జాతీయస్థాయిలో నిరసన చేపట్టాలని నిర్ణయించారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టారు. జగన్ పిలుపునకు స్పందించిన సమాజ్ వాది పార్టీ, ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఏపీలో క్షీణించిన శాంతి భద్రతలపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా వైసీపీ అక్కడ ఫోటో సెషన్ ఏర్పాటు చేసింది. ఏపీలో కూటమి ప్రభుత్వం నరమేధం అంటూ ధర్నాకు హాజరైన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తప్పుపట్టారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో కొనసాగడానికి వీలులేదని.. తక్షణం పదవులకు రాజీనామా చేయాలని నేతలు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఏపీలో జరిగిన హత్యలు, హింసాత్మక ఘటనలు, దాడులు, కేసులు గురించి వైసిపి నేతలు వివరించే ప్రయత్నం చేశారు. జాతీయ పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
* ఆకట్టుకున్న ఫోటో సెషన్
ధర్నా శిబిరంలో వైసీపీ ఏర్పాటు చేసిన ఫోటో సెషన్.. అక్కడున్న వారిని ఆలోచింపజేసింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లో జరిగిన ఘటనలు ఇవి అంటూ వైసిపి ప్లకార్డులు సైతం ప్రదర్శించింది.’31 మంది హత్యకు గురయ్యారు.300 మంది పై హత్యా ప్రయత్నం, వేధింపులతో 35 మంది ఆత్మహత్య, 560 ప్రైవేటు ఆస్తుల విధ్వంసం, 490 ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, కూటమి పార్టీల అరాచకాలతో 2,700 కుటుంబాలు గ్రామాలను విడిచిపెట్టడం’ వంటి ఘటనలు చోటు చేసుకున్నాయని వైసిపి జాతీయస్థాయిలో ఎండగట్టింది. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత 1050 విధ్వంసకర ఘటనలు జరిగాయని వివరించే ప్రయత్నం చేసింది వైసిపి.
* జగన్ సక్సెస్
అయితే జాతీయస్థాయిలో కూటమి ప్రభుత్వం విధ్వంసాలు ఎండగట్టడంలో జగన్ సక్సెస్ అయ్యారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఒకవైపు అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్రం 15000 కోట్లు సాయం ప్రకటించింది. అమరావతిలో పనులు ప్రారంభమయ్యాయి. విదేశీ, స్వదేశీ సంస్థలు సైతం అమరావతికి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయి. పరిశ్రమలు సైతం వచ్చే అవకాశం ఉంది. సరిగ్గా ఇటువంటి సమయంలో ఏపీ ఇమేజ్ ను డామేజ్ చేసే విధంగా జగన్ వ్యవహరిస్తున్నారని కూటమి పార్టీలు తప్పుపడుతున్నాయి. రాష్ట్రంలో హత్యలు, విధ్వంసకర ఘటనల విషయంలో జగన్ చెబుతున్నది అంకెల గారడీ అని కొట్టిపారేస్తున్నాయి. కేవలం అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరు అయ్యేందుకే జగన్ ఈ ఎత్తుగడ వేశారని.. అంతకుమించి ఏమీ లేదని తేల్చి చెబుతున్నాయి.
* ప్రభుత్వానికి సమయం ఇవ్వాలి
ఒకవైపు శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. మరోవైపు ఢిల్లీ వేదికగా జగన్ ధర్నా చేపట్టారు. కానీ జాతీయస్థాయిలో చర్చకు దారి తీసినా.. ఏపీలో మాత్రం ఆ ప్రభావం అంతగా కనిపించలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 45 రోజులు మాత్రమే అవుతోంది. అప్పుడే విపక్షంగా ఉన్న వైసిపి పోరాటం ప్రారంభించింది. కొద్దిరోజుల సమయం ఇచ్చి ప్రభుత్వంపై పోరాడితే బాగుంటుందన్న అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తం అవుతోంది. వైసిపి కాస్త అతి చేస్తోందన్న టాక్ ప్రజల నుంచి వినిపిస్తోంది.