Attack On Jagan: బిగ్‌ అప్‌డేట్‌.. జగన్‌పై దాడి కేసులో నిందితుల అరెస్ట్‌!?

జగన్‌పై రాయి దాడి జరిగిన మరుసటి రోజు నుంచే వైసీపీ నేతలు టీడీపీని టార్గెట్‌ చేశారు. దాడి వెనుక టీడీపీ ఉందని ఆరోపిస్తున్నారు.

Written By: Raj Shekar, Updated On : April 18, 2024 1:20 pm

Attack On Jagan

Follow us on

Attack On Jagan: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్‌పై రాయితో దాడిచేసిన కేసు విషయంలో బిగ్‌ అప్‌డేట్‌ వచ్చింది. ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. కాసేపట్లో వీరిని విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిందితులతోపాటు మరికొందరిని కూడా పోలీసులు కోర్టుకు తీసుకెళ్తారని సమాచారం. సిమెంట్‌ రాయి ముక్కతో బస్సుకు సమీపంలోని వివేకానంద స్కూల్‌ పక్కన రోడ్డుపై నుంచి జగన్‌పై దాడి చేసినట్లు నిందితులు విచారణలో పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈమేరకు ప్రధాన నిందితుడితోపాటు, అదుపులోకి తీసుకున్న మిగతా వారి నుంచి స్టేట్‌మెంట్‌ రికార్డు చేసినట్లు సమాచారం. దాడి అనంతరం నిందితులు ఇళ్లకు వెళ్లినట్లు విచారణలో పోలీసులు గుర్తించారు.

అధికారికంగా ప్రకటించని పోలీసులు..
ఇదిలా ఉండగా, జగన్‌పై రాయి దాడి కేసులో నిందితుల అరెస్టుపై ఏపీ పోలీసులు ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. నిందితులను మీడియా ముందు కూడా ప్రవేశపెట్టలేదు. నేరుగా కోర్టుకు తీసుకెళ్తారని మాత్రమే తెలుస్తోంది. అయితే నిందితుల అరెస్టుపై ఊహాగానాలు మినహా అధికారిక ప్రకటన రాకపోవడం గమనార్హం.

టీడీపీని టార్గెట్‌ చేసిన వైసీపీ..
ఇదిలా ఉండగా జగన్‌పై రాయి దాడి జరిగిన మరుసటి రోజు నుంచే వైసీపీ నేతలు టీడీపీని టార్గెట్‌ చేశారు. దాడి వెనుక టీడీపీ ఉందని ఆరోపిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ టీడీపీపై, చంద్రబాబునాయుడిపై ఆరోపణలు చేస్తున్నారు. జగన్‌ బస్సు యాత్రకు వస్తున్న జనాన్ని చూసి ఓర్వలేకనే ఇలాంటి కుట్రలకు చంద్రబాబు తెరలేపారని ఆరోపిస్తున్నారు.

తిప్పి కొడుతున్న టీడీపీ..
ఇదిలా ఉంటే.. వైసీపీ ఆరోపణలు టీడీపీ కూడా బలంగా తిప్పి కొడుతోంది. గత ఎన్నికల సమయంలో కోడి కత్తి డ్రామా ఆడారని, ఇప్పుడు రాయితో దాడి డ్రామా ఆడుతున్నారని ఆరోపిస్తున్నారు. టీడీపీని టార్గెట్‌ చేయడానికే వైసీపీ చీప్‌ ట్రిక్స్‌ చేస్తోందని విమర్శిస్తున్నారు. పోలీసుల విచారణ తీరుపైనా టీడీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీఎంకు రక్షణ కల్పించలేని పోలీసులను విచారణ నుంచి తప్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు.