Nara Lokesh: ఏపీ మంత్రి నారా లోకేష్( AP Minister Nara Lokesh ) ఏ అవకాశాన్ని జారవిడుచుకోవడం లేదు. ఆయన ప్రత్యర్థులకు ఎంత టార్గెట్ అయ్యారో.. ఎంతగా టార్గెట్ చేసుకున్నారో తెలియంది కాదు. కానీ అన్నింటికీ ఇప్పుడు తన పనితీరుతో సమాధానం చెబుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తున్నారు. పాలనలో తన మార్క్ చూపిస్తున్నారు. ప్రభుత్వంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. పార్టీని చక్కగా నడిపిస్తున్నారు. కూటమి సమన్వయం లోను చురుకైన పాత్రతో ముందుకు సాగుతున్నారు. అయితే ట్రెండ్ కు తగ్గట్టు.. ప్రస్తుత రాజకీయాలకు తగ్గట్టు ఆయన వ్యవహార శైలి ఉంది. తాజాగా మహిళా క్రికెట్ జట్టు క్రీడాకారిణి శ్రీ చరణి నారా లోకేష్ తో పాటు చంద్రబాబును కలుసుకున్నారు. గ్రూప్ వన్ ఉద్యోగంతో పాటు రెండు కోట్ల రూపాయలు ప్రభుత్వం తరఫున ఆమెకు ప్రకటించారు. మహిళా క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీలో భారత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే జట్టులో శ్రీ చరణి నైపుణ్యం చూపారు. దీంతో ఏపీ ప్రభుత్వం ఆమెకు భారీగా ప్రోత్సాహకాలు ప్రకటించింది.
Also Read: ఇక విద్యార్థులే జగన్ నమ్మకమట!
ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగిన క్రీడ క్రికెట్( cricket). అందునా భారత దేశంలో ఎనలేని క్రేజ్. మొన్నటి వరకు పురుషుల క్రికెట్కు మాత్రమే క్రేజ్ ఉండేది. ఇప్పుడు మహిళా క్రికెట్కు సైతం ఎనలేని ఆదరణ పెరిగింది. ఇక్కడే తన వ్యూహం మార్చారు నారా లోకేష్. సాధారణంగా క్రికెట్ అంటే యువత, విద్యార్థులు ఎక్కువగా ఆకర్షితులవుతారు. పిల్లలు సైతం ఇప్పుడు ఇష్టంగా చూస్తున్నారు క్రికెట్ ను. క్రికెట్ అనుబంధ వార్త ఎలాంటిదైనా ఇప్పుడు చూస్తుంటారు. అందుకే నారా లోకేష్ ఈ అవకాశాన్ని జారవిడుచుకోవడం లేదు. ఏపీలో క్రికెట్ అభివృద్ధి తో పాటు నేరుగా క్రీడాకారులతోనే మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. తద్వారా జాతీయస్థాయిలో సైతం లోకేష్ హైలెట్ అవుతున్నారు.
* విశాఖలో టోర్నీ ప్రారంభం..
మహిళా క్రికెట్కు క్రేజ్ పెరిగిన నేపథ్యంలో.. మహిళలను ఆకర్షించేందుకు వీలుగా.. ప్రపంచ మహిళా క్రికెట్ కప్ టోర్నీని విశాఖలో ప్రారంభించేలా లోకేష్ పాత్ర ఉంది. ఐసీసీ అధ్యక్షుడిగా జై షా ఉన్నారు. ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షా( central minister Amit Shah) కుమారుడు. ఎన్డీఏలో టిడిపి కీలక భాగస్వామి కావడం, చంద్రబాబు కుమారుడిగా లోకేష్ కేంద్ర పెద్దలు ఎనలేని ప్రాధాన్యం ఇవ్వడం.. బిజెపి పెద్దల్లో ఒకరైన అమిత్ షా కుమారుడితో నేరుగా సన్నిహిత సంబంధాలు పెంచుకున్నారు లోకేష్. అలా మహిళ వరల్డ్ కప్ టోర్నీని విశాఖలో ప్రారంభించేలా చర్యలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ పరంగా వేడుకగా జరిపారు.
* ఫైనల్ మ్యాచ్ కు లోకేష్..
మొన్న జరిగిన ఫైనల్ మ్యాచ్ను లోకేష్ కుటుంబంతో కలిసి తిలకించారు. ఆ సమయంలో భారత మహిళా జట్టుతో ప్రత్యేకంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఏపీ మంత్రిగా, ఒక ముఖ్యమంత్రి కుమారుడిగా, మంచి ఆలోచనలు కలిగిన నేతగా ఆవిష్కృతం అయ్యేలా ఈ కార్యక్రమం కొనసాగింది. క్రికెట్ ను ఇష్టపడే ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూను తిలకించారు. ఒక విధంగా చెప్పాలంటే జాతీయ స్థాయిలో సైతం లోకేష్ హైలెట్ అయ్యారు. ఇది మంచి ఆలోచనగా చాలామంది చెప్పుకున్నారు. అయితే ఇది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎంత మాత్రం మింగుడు పడలేదు.