Amaravati: అమరావతి రాజధాని నిర్మాణం పై ఫుల్ ఫోకస్ పెట్టింది కూటమి సర్కార్. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత అమరావతికి కొత్త కళ వచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వంలో టిడిపి కీలకంగా మారడంతో.. కేంద్రం నుంచి సైతం సహాయం లభిస్తోంది. బడ్జెట్లో ఏకంగా అమరావతికి 15000 కోట్ల రూపాయలు కేటాయించింది కేంద్రం. ఇందుకు సంబంధించి నిధుల విడుదల కూడా కానుంది. అందుకే వచ్చే నెలలో అమరావతి నిర్మాణ పనులు ప్రారంభించాలని కూటమి సర్కార్ భావిస్తోంది. ఇందుకు ప్రణాళికలను సైతం సిద్ధం చేసింది. ఈ క్రమంలో భాగంగానే ఏపీ ప్రభుత్వం తాజాగా అమరావతికి సంబంధించి కీలక ఉత్తర్వులు జారీచేసింది. మధ్యలో నిలిచిన పనులు తిరిగి పునరుద్ధరించేందుకు ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 20 పనులకు ఆమోదముద్ర వేసిన సిఆర్డిఏ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. దీంతో ప్రభుత్వం తాజాగా ఈ పనుల కోసం 11 వేల 467 కోట్ల రూపాయలకు పరిపాలన ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు విడుదల చేసింది. వీలైనంత త్వరగా ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అందులో భాగంగా ఈ కీలక ఉత్తర్వులు రావడం విశేషం.
* జంగిల్ క్లియరెన్స్ పనులు
కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతిలో.. జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి. దాదాపు 33 కోట్ల రూపాయలతో ఈ జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టారు. అమరావతి నిర్మాణాలను యధాస్థితికి తీసుకొచ్చారు. ఇప్పుడు పనులు ప్రారంభించేందుకు నిర్ణయించి పాలనా ఆమోదం ఇచ్చారు.అయితే మధ్యలో నిలిచిన పనుల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు, సివిల్స్ అధికారుల క్వార్టర్లు ఉన్నాయి. ఇప్పటికే సిఆర్డిఏ భవనం నిర్మాణానికి సంబంధించి డిజైన్ పైన ప్రజాభిప్రాయం కోరారు. తాజాగా ఈ గడువు మరో 20 రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సిఆర్డిఏ ప్రాజెక్టు ఆఫీస్ బిల్డింగ్ ఎలా ఉండాలనే దానిపై వెబ్సైట్ ద్వారా చేపట్టిన పోలింగ్ నవంబర్ 30 నుంచి డిసెంబర్ 6 వరకు కొనసాగింది. దానిని ఈనెల 14 వరకు పొడిగించారు. దీనికి ఎప్పటికీ విశేష స్పందన లభించింది.
* ఉదారంగా కేంద్రం
అమరావతికి కేంద్రం ఉదారంగా సాయం చేస్తోంది. రైల్వే తో పాటు రవాణా ప్రాజెక్టులను సైతం కేటాయించింది. కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కావాల్సిన భూసేకరణ నిధులకు అంగీకరించింది. దీంతో వచ్చే నెల నుంచి పనులు వేగవంతం చేయాలని ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. మరోవైపు గతంలో పనిచేసిన సింగపూర్ ప్రభుత్వంతో తిరిగి కలిసి పని చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం తాజాగా కేంద్రాన్ని కోరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నిర్మాణాలపై కూడా పాలనాపరమైన అనుమతులు రావడంతో అమరావతి నిర్మాణంలో కీలక అడుగులు పడినట్టే.