High Court Bench In Kurnool
High Court Bench : ఏపీ ప్రభుత్వం( AP government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు దిశగా కార్యాచరణ మొదలుపెట్టింది. ఈ మేరకు హైకోర్టు నుంచి కర్నూలు జిల్లా కలెక్టర్ కు లేఖ అందింది. మొత్తం 15 మంది న్యాయమూర్తులకు అవసరమైన సౌకర్యాలపై పూర్తి వివరాలు ఇవ్వాలని అందులో కోరారు. భవనాల కోసం కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అదే సమయంలో హైకోర్టులో న్యాయమూర్తులతో దీనిపై ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. జిల్లా అధికార యంత్రాంగం హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై కీలక ప్రతిపాదనలు సైతం సమర్పించింది. వాస్తవానికి 2014లో అధికారంలోకి వచ్చిన టిడిపి.. అప్పట్లో కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. అప్పట్లో వివిధ కారణాలతో ఇది సాధ్యం కాలేదు. తరువాత వైసిపి సర్కార్ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించింది. కానీ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయలేకపోయింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు శరవేగంగా అడుగులు వేస్తోంది.
* జిల్లా యంత్రాంగం కసరత్తు
కర్నూలు జిల్లా( Kurnool district) యంత్రాంగం కసరత్తు మొదలుపెట్టింది. హైకోర్టు నుంచి లేఖ రాగానే జిల్లా కలెక్టర్ స్పందించారు. ముఖ్యంగా న్యాయమూర్తుల వసతి, కోర్టు నిర్వహణ వంటి వాటిపై ఆరా తీశారు. ఆ వివరాలను హైకోర్టు కమిటీ ముందు ఉంచేందుకు జిల్లా కలెక్టర్ అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశారు. భవనాల గురించి వివరాలు కూడా కోరారు. దీంతో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు, న్యాయమూర్తులు, అధికారులు, సిబ్బంది వసతికి అవసరమైన భవనాల కోసం ఉన్నతాధికారులు విస్తృతంగా పరిశీలించారు. అనువైన భవనాల కోసం అన్వేషిస్తున్నారు.
* భవనాల పరిశీలన
కర్నూలు నగర శివారులోని దిన్నె దేవరపాడులో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి నూతన భవనాన్ని 25 కోట్ల రూపాయలతో అత్యాధునికంగా నిర్మించారు. ఇందులో న్యాయస్థాన అవసరాలకు ఉపయోగపడే నాలుగు భవనాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ భవనానికి అనుబంధంగా ఉన్న అతిథి గృహం, అందులోని నాలుగు సూట్ రూములను వినియోగించుకోవచ్చని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. మరోవైపు బి తాండ్రపాడు లోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో భవనాలు, సిల్వర్ జూబ్లీ కళాశాల ప్రాంగణంలోని క్లస్టర్ విశ్వవిద్యాలయ పరిపాలన భవనంలో ఖాళీగా ఉన్న 50 గదులను అధికారులు పరిశీలించారు. వీటన్నింటిపై సమగ్రంగా వివరాలను హైకోర్టు కమిటీకి జిల్లా యంత్రాంగం పంపించనుంది.
* సీనియర్ న్యాయమూర్తులతో కమిటీ
కర్నూలులో హైకోర్టు బెంచ్( High Court bench) ఏర్పాటుపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానానికి సంబంధించి సీనియర్ న్యాయమూర్తులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆదేశాలతో ఈ కమిటీ ఏర్పాటు అయింది. జస్టిస్ రవినాథ్ తిల్హరి, జస్టిస్ రఘునందన్ రావు, జస్టిస్ జయ సూర్య, జస్టిస్ కృష్ణ మోహన్ లు ఈ కమిటీలో ఉన్నారు. కర్నూలు జిల్లా యంత్రాంగం నుంచి వచ్చే ప్రతిపాదనలను ఈ కమిటీ పరిశీలించనుంది. ఆమోదయోగ్యంగా ఉంటే తదుపరి కార్యాచరణ మొదలుపెట్టి ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై మంత్రివర్గం తీర్మానం కూడా చేసింది.
* రాయలసీమలో హర్షాతిరేకాలు రాయలసీమలో( Rayalaseema ) హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో టిడిపి ప్రభుత్వమే ఇక్కడ బెంచ్ ఏర్పాటుకు సిద్ధపడింది. అప్పట్లో అది సాధ్యం కాలేదు. తర్వాత వైసిపి సర్కారు వచ్చి న్యాయ రాజధాని అంటూ హడావిడి చేసింది. అప్పుడు కూడా కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో ఎన్డీఏలో టిడిపి కీలక భాగస్వామిగా ఉంది. ఏపీ నుంచి ప్రతిపాదనలకు కేంద్రం పెద్దపీట వేస్తోంది. అందులో భాగంగానే హైకోర్టు బెంచ్ కు ముందడుగు పడుతోంది. జిల్లా యంత్రాంగం నుంచి వచ్చిన ప్రతిపాదనలకు హైకోర్టు కమిటీ ఓకే చెబితే.. ఇక బెంచ్ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడనున్నాయి.