https://oktelugu.com/

GV Reddy : క్రమశిక్షణకు ప్రాధాన్యం .. జీవీ రెడ్డి రాజీనామాకు ఆమోదం.. ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలివీ

ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ లో వివాదం చెలరేగింది. ఫైబర్ నెట్ చైర్మన్ జివి రెడ్డి కంపెనీ ఎండీ దినేష్ కుమార్ దేశద్రోహానికి పాల్పడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ వివాదం ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వద్దకు చేరింది. దీనిపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ఈ నేపథ్యంలో సిఎంఓ సూచనల మేరకు జీవీ రెడ్డి ఇటీవల ముఖ్యమంత్రిని కలిశారు.

Written By: , Updated On : February 24, 2025 / 09:45 PM IST
GV Reddy resignation

GV Reddy resignation

Follow us on

GV Reddy : ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేశారు. తను వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అలాగే టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. టీడీపీ జాతీయ ప్రతినిధి పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు జివి రెడ్డి స్పష్టం చేశారు. ఇక మీదట తన న్యాయవాద వృత్తినే పూర్తి స్థాయిలో కొనసాగిస్తానని జీవీ రెడ్డి వెల్లడించారు.

ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ లో వివాదం చెలరేగింది. ఫైబర్ నెట్ చైర్మన్ జివి రెడ్డి కంపెనీ ఎండీ దినేష్ కుమార్ దేశద్రోహానికి పాల్పడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ వివాదం ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వద్దకు చేరింది. దీనిపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ఈ నేపథ్యంలో సిఎంఓ సూచనల మేరకు జీవీ రెడ్డి ఇటీవల ముఖ్యమంత్రిని కలిశారు. ఫైబర్ నెట్ లో జరిగిన వ్యవహారాల గురించి ఆయన తన వివరణ ఇచ్చుకున్నారు.

అయితే జీవి రెడ్డి చంద్రబాబును కలవడానికి ముందే ఈ విషయం పై సీఎం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైనా సమస్య ఉంటే మంత్రిని సంప్రదించి తన వద్దకు రావాలని ఇలా బహిరంగంగా ఆరోపణలు చేయడంలో అర్థం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వ్యవస్థను నిర్మించడానికి నేను చాలా కష్టపడ్డాను. ఐఏఎస్‌ అధికారులపై ఇలా బహిరంగంగా మాట్లాడితే మిగతా వాళ్లు కూడా అదే పంథాను కొనసాగిస్తే పరిస్థితి ఏంటి? అధికారులకు నేనేం సమాధానం చెప్పుకోవాలి’ అని చంద్రబాబు అన్నట్లు తెలుస్తోంది.

సీఎం చంద్రబాబు జివి రెడ్డితో.. ‘సంస్థ అభివృద్ధికి మీరు మీ తెలివితేటలను ఉపయోగించాలి. అలాంటి పరిస్థితి మళ్ళీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నేను మంత్రికి సూచనలు ఇస్తాను. సంస్థ ఎండీగా మీరు కూర్చుని సమస్యను పరిష్కరించుకోండి’ అని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసిన రెండు రోజులకే జివి రెడ్డి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు.

జివి రెడ్డి గత ఏడాది నవంబర్ 16న ఫైబర్‌నెట్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. రాబోయే రెండేళ్లలో ఏపీ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్ కనెక్షన్‌లను 50 లక్షలకు పెంచడానికి చర్యలు తీసుకుంటామని జీవీ రెడ్డి ప్రకటించారు. కానీ ఇప్పుడు పదవికి రాజీనామా చేస్తూ చంద్రబాబుకు లేఖ రాశారు. ‘‘వ్యక్తిగత కారణాలతో టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవికీ, ఏపీ ఫైబర్‌నెట్‌ ఛైర్మన్‌ పదవులకు రాజీనామా చేస్తున్నాను. మీరు నాపై ఉంచిన విశ్వాసం.. నాకు ఇచ్చిన మద్దతుతో కీలక బాధ్యతలు నిర్వహించేందుకు ఈ అవకాశం అందించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. భవిష్యత్తులో వేరే ఏ రాజకీయ పార్టీలోనూ చేరే ఉద్దేశం లేదు’’ అని జీవీరెడ్డి రాసుకొచ్చారు.

ఏపీ ఫైబర్‌ నెట్‌ ఛైర్మన్‌ పదవికి జీవీ రెడ్డి చేసిన రాజీనామాకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.మరోవైపు ఆ సంస్థలో జరుగుతున్న వివాదం పై నివేదిక సీఎం వద్దకు చేరింది. ఈ మేరకు ఫైబర్‌ నెట్‌ ఎండీ దినేష్‌కుమార్‌ను ట్రాన్స్ ఫర్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ఆయనను జీఏడీకి రిపోర్ట్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అటు పార్టీలో అయినా, ఇటు ప్రభుత్వంలో అయినా క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నామని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లు ఈ రెండు చర్యల ద్వారా అర్థం అవుతుంది.