Site icon OkTelugu

AP Coalition Government Mistakes: కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులు ఇవే.. దిద్దుకోకపోతే తప్పదు మూల్యం

AP Coalition Government Mistakes

AP Coalition Government Mistakes

AP Coalition Government Mistakes: అధికారాన్ని కోల్పోయిన తర్వాత వైసీపీలో విపరీతమైన నిరాశ కనిపిస్తోంది. అందువల్లే ఏ మాత్రం అవకాశం దొరికినా సరే వదిలిపెట్టకుండా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోంది. జరిగింది ఇసుకంత అయితే.. దానిని పెద్ద బండరాయి లాగా చూపించే ప్రయత్నం చేస్తోంది. ఇది కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. అయితే ఇటువంటి లోపాల మీద కూటమి ప్రభుత్వ పెద్దలు చర్యలు తీసుకోకపోతే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

కచ్చితంగా ఇవి జరగాలి

అభివృద్ధి, సంక్షేమం అని చెబుతున్నప్పటికీ కూటమి ప్రభుత్వం కచ్చితంగా వీటి మీద దృష్టి పెట్టాలి. అన్ని రకాలుగా పింఛన్లను భారీగా పెంచామని ప్రభుత్వం చెబుతోంది. కానీ రెండు సంవత్సరాల కాలంలో ఇంతవరకు కొత్త పింఛన్లను మంజూరు చేయలేదు. కొత్తగా ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. గృహాలను కూడా నిర్మించలేదు. నాడు వైసిపి అధికారంలో ఉన్నప్పుడు అనర్హులకు పింఛన్లు ఇచ్చారు. వారిపై ఇంతవరకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. రీసర్వే సమస్యను ఇంతవరకు పరిష్కరించలేదు. క్వాంటం వ్యాలీ.. డేటా సెంటర్లు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల సామాన్యులకు ఏ విధమైన ఉపయోగం లభిస్తుందో వివరించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉన్నది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగుల జీతాలు ఆలస్యం అయ్యేవి. విశ్రాంత ఉద్యోగుల పింఛన్లు కూడా సరిగా వచ్చేవి కాదు. పిఆర్సి అమల్లో జగన్ ప్రభుత్వం మొండిగా ఉండేది. చివరికి సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పిన జగన్ వెనుకడుగు వేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల విషయంలో సానుకూల ధోరణితో కనిపిస్తోంది. వేల కోట్ల బకాయిలు విడుదల చేసింది. ఉద్యోగుల సమస్యల మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

అమరావతి విషయంలో

అమరావతి నిర్మాణంలో ప్రభుత్వం ఇంకా వేగం పెంచాల్సి ఉంది. కొన్ని విషయాల పట్ల పాఠాలు నేర్చుకోవాలి. ముఖ్యంగా ప్రభుత్వ భవనాలు.. సముదాయాల నిర్మాణం మీదనే ప్రభుత్వం దృష్టి సారించింది. అయితే పబ్లిక్ యాక్టివిటీ లో వేగం పెరగాలంటే కచ్చితంగా లే అవుట్లు డెవలప్ కావాలి. అవి లేకుండా అమరావతిలో ఎవరు కూడా ఇల్లు కట్టుకునే సాహసం చేయరు. వ్యాపారాలు ప్రారంభించలేరు.

ఆర్థిక లోటు

వైసీపీ పరిపాలనలో ఏపీ రాష్ట్రంలో ఆర్థిక లోటు పెరిగిపోయింది. సంక్షేమ పథకాలకు మాత్రమే నిధుల సర్దుబాటు జరుగుతోంది. అభివృద్ధి పనుల విషయంలో కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతోంది. అప్పుల మీదనే ఆధార పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అందువల్ల అప్పుల భారం పెరిగిపోతుంది. వీటివల్ల కీలకమైన పథకాల అమలు సాధ్యం కావడం లేదు. ఉదాహరణకు ఎన్టీఆర్ వైద్య సేవ బకాయిలు భారీగా పెరిగిపోయాయి. ఈ పథకానికి నిధుల సర్దుబాటు చేయడం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది.

పొలిటికల్ గవర్నెన్స్ బాగోలేదు

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా అధికారులు వ్యవహరించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా అలానే కొనసాగుతోంది. పొలిటికల్ గవర్నెన్స్ ను అమలు చేయాలని చంద్రబాబు చెబుతున్నప్పటికీ అధికారులు వినిపించుకోవడం లేదు. కన్సల్టెంట్లు ప్రభుత్వంలో హవా కొనసాగిస్తున్నారు. కన్సల్టెంట్లు చెప్పిన మాటనే ప్రభుత్వం పాటిస్తోంది.. కొన్ని సందర్భాలలో కన్సల్టెంట్లు చెప్పినట్టుగానే చంద్రబాబు చేయాల్సి వస్తుంది. దీనివల్ల సోషల్ మీడియాలో విష ప్రచారం జరుగుతోంది.

సూపర్ సిక్స్ లో రెండు అమలు కావడం లేదు

సూపర్ సిక్స్ పథకాలలో ఇంకా రెండు అమలు కావడం లేదు. యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు.. ఇది సాధికాకపోతే నెలకు 3000 నిరుద్యోగ భృతి.. ప్రతినెల మహిళకు 1500 రూపాయల చొప్పున ఆడబిడ్డ నిధి ఇస్తామని ఇచ్చిన హామీ అమలు కావడం లేదు. ఇక మిగతా పథకాలు తల్లికి వందనం.. అన్నదాత సుఖీభవ.. దీపం 2.. స్త్రీ శక్తి పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయి.

నేతలు జాగ్రత్తగా ఉండాలి

కొంతమంది నేతలు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. దారుణంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అవినీతి వ్యవహారాలకు పాల్పడుతున్నారు. పోలీస్ విధుల్లో కూడా జోక్యం చేసుకుంటున్నారు. వారి వల్ల కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది.. ఎమ్మెల్యేలు వ్యవహార శైలి మార్చుకోవాల్సిన అవసరం ఉంది. స్వయంగా చంద్రబాబు రంగంలోకి దిగి హెచ్చరికలు జారీ చేస్తున్నారంటే.. ప్రజాప్రతినిధులు ఎలా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. గతంలో ఇలా చేసి వైసిపి ప్రజల నుంచి ఎలాంటి ఫలితాన్ని ఎదుర్కొన్నదో అందరూ చూశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి అటువంటి పరిస్థితి రాకూడదంటే నేతలు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది.

Exit mobile version