AP Assembly: ఏపీలో( Andhra Pradesh) అందరి దృష్టి ఇప్పుడు శాసనసభ పై ఉంది. ఈరోజు శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ తరుణంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరుపై సర్వత్రా చర్చ నడుస్తోంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి హాజరవుతారని ఒకవైపు ప్రచారం జరుగుతుండగా.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం అటువంటిదేమీ లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో ఈరోజు తాడేపల్లిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహిస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. అందులో ఏ నిర్ణయం తీసుకుంటారా అన్నది హాట్ టాపిక్ అవుతోంది. జగన్ హాజరవుతారా? లేదా? లేకుంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలను సభకు పంపిస్తారా? అన్నది తెలియడం లేదు. మరోవైపు ఈసారి సభకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు హాజరు కాకుంటే అనర్హత వేటు పడటం ఖాయమని కూటమి వర్గాల నుంచి వినిపిస్తోంది. అందుకే ఇప్పుడు అందరి దృష్టి శాసనసభ పై ఉంది.
* సభకు గైర్హాజరు..
ఏపీలో కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం సభకు హాజరు కావడం లేదు. జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సభకు వచ్చారు. అటు తరువాత సభను బహిష్కరిస్తూ వచ్చారు. గవర్నర్ ప్రసంగం నాడు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. అప్పటినుంచి సభ ముఖం చూడడం లేదు. ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే సభలో అడుగు పెడతానని చెబుతూ వచ్చారు. అయితే తగిన సమయం ఇస్తామని స్పీకర్ అయ్యన్నపాత్రుడు చెబుతున్నారు. ప్రతిపక్ష హోదా అనేది తాము ఇచ్చేది కాదని.. అది నిబంధనల మేరకు ఇవ్వాల్సి ఉంటుందని.. అవసరం అనుకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. జగన్ సైతం ఈ విషయంలో కోర్టును ఆశ్రయించారు.
* ముప్పేట విమర్శలు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం పెంచుకోవాలని చూస్తోంది. కూటమి ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేస్తోంది. విమర్శల దాడి కొనసాగిస్తోంది. అయితే అవి ప్రజల మధ్యకు బలంగా వెళ్లడం లేదు. పైగా జగన్ ( Y S Jagan Mohan Reddy )అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడం పై అనేక రకాల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సైతం సభకు వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. ఈ తరుణంలో వరుసగా 60 రోజులపాటు శాసనసభ సమావేశాలకు హాజరు కాకుంటే అనర్హత వేటు పడుతుందని కూటమి నుంచి వినిపిస్తోంది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు అయితే పులివెందుల అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక రాబోతుందని చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి సభకు హాజరు కాకుంటే జరిగేది అదేనని తేల్చి చెప్పారు. మరోవైపు సభకు హాజరు కాని ఎమ్మెల్యేలకు జీతభత్యాలు ఎందుకని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తేల్చి చెబుతున్నారు. ఒకవైపు ప్రజల నుంచి విమర్శలు, అధికార పార్టీ నుంచి వస్తున్న ఒత్తిడితో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సభకు హాజరవుతారని ప్రచారం సాగుతోంది.
* నేడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం
మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు శాసనమండలి సమావేశాలకు హాజరవుతున్నారు. అక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంఖ్యా బలం ఎక్కువ. పైగా ఆ పార్టీకి చెందిన నేత శాసనమండలి చైర్మన్ గా ఉన్నారు. శాసనమండలిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఉంది. శాసన మండలి లో విపక్షనేతగా బొత్స సత్యనారాయణ కొనసాగుతున్నారు. అయితే ఒకవైపు శాసనమండలికి హాజరై.. ఇంకోవైపు అసెంబ్లీకి గైర్హాజరు కావడం పై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు తాడేపల్లిలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేక భేటీ నిర్వహిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. దీంతో సానుకూల నిర్ణయం తీసుకుంటారన్న ప్రచారం సాగుతోంది. అయితే ఎమ్మెల్యేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. జగన్ మాత్రం అసెంబ్లీకి హాజరయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. చూడాలి మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..?