https://oktelugu.com/

Jagan: అసెంబ్లీ సమావేశాలకు జగన్.. ఆ నెపంతో బహిష్కరణ.. పక్కా వ్యూహంతో అడుగులు!

జగన్ ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యే మాత్రమే. ఆయన డిజిగ్నేషన్ పులివెందుల ఎమ్మెల్యే.అంతకుమించి సభలో ఎటువంటి ప్రత్యేక గౌరవం ఉండదు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకు ప్రత్యేక గౌరవం ఇవ్వడం విషయంలో స్పీకర్ కు విచక్షణ అధికారం ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ కు ప్రత్యేకంగా గౌరవించేలా లేదు. అందుకే సభలోకి వెళ్లేందుకు జగన్ భయపడుతున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : July 18, 2024 / 09:19 AM IST

    Jagan

    Follow us on

    Jagan: జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా?లేదా?అసలు ఆయన వ్యూహం ఏంటి? అన్నది తెలియాల్సి ఉంది. అయితే జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని వైసీపీ నేతలు ప్రకటించారు. జగన్ మనస్తత్వం తెలిసినవారు ఆయన అసెంబ్లీకి హాజరు కారని ఒక నిర్ధారణకు వచ్చారు. కానీ అదే జరిగితే ప్రజల్లోకి ఒక తప్పుడు సంకేతం వెళుతుందని జగన్ భయపడుతున్నారు. అందుకే అసెంబ్లీకి హాజరు కావాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈనెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరగడం ఇది రెండోసారి.ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం, స్పీకర్ ఎంపిక తదితర వాటి కోసం తొలి సభను ఏర్పాటు చేశారు.అప్పట్లో జగన్ సభకు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం చేసి కొద్దిసేపు కూడా సభలో ఉండలేకపోయారు.అందుకే ఈసారి అసెంబ్లీకి హాజరవుతారా?లేదా? అన్న సస్పెన్స్ కొనసాగింది. కానీ దానిని తెర దించుతూ జగన్ హాజరుకావాలని నిర్ణయించుకోవడం విశేషం.

    ఈ ఎన్నికల్లో వైసిపి దారుణ పరాజయం పాలయ్యింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. మొదటిసారి జరిగిన శాసనసభ సమావేశాల్లో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జగన్ అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కక పోవడానికి అవమానంగా భావించారు. అసెంబ్లీలో కూటమి సభ్యులను ఎదుర్కోవడం అంత ఈజీ కాదని కూడా గుర్తించారు. అందుకే మొదటి అసెంబ్లీ సమావేశంలో కాసేపు కూడా కూర్చునేందుకు ఇష్టపడలేదు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి అనగా.. బెంగళూరు వెళ్ళిపోయారు. దీంతో ఆయన సభకు హాజరుపై సస్పెన్స్ నెలకొంది. జగన్ మనస్తత్వం తెలిసిన వారంతా అసెంబ్లీకి రారని తేల్చేశారు.కానీ అనూహ్యంగా ఆయన అసెంబ్లీకి హాజరుకావాలని నిర్ణయించినట్లుగా వైసీపీ నేతలు చెబుతున్నారు.

    జగన్ ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యే మాత్రమే. ఆయన డిజిగ్నేషన్ పులివెందుల ఎమ్మెల్యే.అంతకుమించి సభలో ఎటువంటి ప్రత్యేక గౌరవం ఉండదు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకు ప్రత్యేక గౌరవం ఇవ్వడం విషయంలో స్పీకర్ కు విచక్షణ అధికారం ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ కు ప్రత్యేకంగా గౌరవించేలా లేదు. అందుకే సభలోకి వెళ్లేందుకు జగన్ భయపడుతున్నారు. కానీ ఇప్పుడు గానీ ఆయన సభలోకి వెళ్లకుంటే ప్రజల నుంచి వ్యతిరేకత మూట కట్టుకోవడం ఖాయం. పైగా చంద్రబాబు వరుసగా శ్వేత పత్రాలు విడుదల చేస్తున్నారు. జగన్ హయాంలో జరిగిన విధ్వంసాన్ని బయటపెడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సభకు హాజరు కాకుండా ఉంటే.. ఆ ఆరోపణలన్నీ వాస్తవాలుగా భావించాల్సి ఉంటుంది. అందుకే జగన్ ఈసారి అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. సాధారణ ఎమ్మెల్యే గానే శాసనసభలో జరిగే చర్చలో పాల్గొనాల్సి ఉంటుంది.

    ఇప్పటికే తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ ఆయన నేరుగా స్పీకర్ అయ్యన్నపాత్రుడికి లేఖ కూడా రాశారు. కానీ ఎటువంటి సానుకూల నిర్ణయం రాలేదు. ప్రత్యేక హోదాపై ఎటువంటి ప్రకటన చేయలేదు. నిబంధనల ప్రకారం ఆయనకు సాధారణ ఎమ్మెల్యే గానే చర్చలపై మాట్లాడేందుకు సమయం ఇస్తారు. కానీ నిబంధనలతో పని లేకుండా తమకు ఎక్కువ సమయం ఇవ్వడం లేదంటూ జగన్ ఆరోపణలు చేసే అవకాశం ఉంది. దీనిని అవకాశంగా మలుచుకుని జగన్ అసెంబ్లీని బహిష్కరించే ఆలోచనలో ఉన్నారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీని ద్వారా ప్రజల్లో సానుభూతి పొందడమే కాకుండా.. కూటమి సభ్యుల ఎదురు దాడిని తప్పించుకోవాలన్న ఎత్తుగడలో ఉన్నట్లు తెలుస్తోంది.

    జగన్ తర్వాత అసెంబ్లీలో ఎంతో కొంత మాట్లాడే స్థితిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. అయితే ఆయన పై సైతం అధికార కూటమి సభ్యులు విరుచుకుపడే అవకాశం ఉంది. చిత్తూరు జిల్లాలో ఆయన చేసిన అరాచకాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. కేసులు సైతం పట్టుబిగిస్తున్నాయి. ఇటువంటి సమయంలో ఆయన సైతం సైలెంట్ కాక తప్పదు. అందుకే జగన్ వ్యూహాత్మకంగా అసెంబ్లీ బహిష్కరణకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. 2014లో విపక్షంలోకి వచ్చిన వైసీపీ అప్పట్లో కూడా అసెంబ్లీని బహిష్కరించింది. అప్పటి టిడిపి ప్రభుత్వం తమను మాట్లాడనీయడం లేదని ఆక్షేపిస్తూ శాసనసభ నుంచి బయటకు వెళ్లింది. ఇప్పుడు కూడా అటువంటి ఎత్తుగడే వేసినట్లు తెలుస్తోంది.