AP Assembly Election Results 2024: ఓటమి.. దారుణమైన ఓటమి.. ఊహించని ఓటమి.. మంత్రులంతా ఓడిపోయారు.. గెలుస్తారని భావించిన వారు ఓడిపోయారు.. చివరికి ముఖ్యమంత్రి ఇలాకా లోనూ వైసిపి అభ్యర్థులు ఓడిపోయారు. ఇందుకు కారణాలు ఏంటి? విశ్లేషణలు ఏంటి? అని ఒకసారి ఆలోచిస్తే.
సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డికి ఏపీ ప్రజలు 151 సీట్లు ఇచ్చి పాలించు నాయకా బాధ్యతలు అప్పగించారు. కానీ ఈ అద్భుతమైన అవకాశాన్ని అతడు తన చేతులారా నాశనం చేసుకున్నాడు.. ప్రజా అనుకూల ఓటును వ్యతిరేక ఓటుగా మార్చుకున్నాడు.. అప్పటిదాకా ఏపీ ప్రజలు చంద్రబాబు పాలన చూశారు. అతని పరిపాలన విధానాలు ఏమిటో ఏపీ ప్రజలకు కొత్త కాదు. చంద్రబాబును పక్కన పెట్టినట్టే పవన్ కళ్యాణ్ ను కూడా ఓడించారు. వాస్తవానికి చంద్రబాబులో మార్పు వస్తుందని ఆశించడం పెద్ద పొరపాటు. పైగా అతడు మారే మనిషి కూడా కాదు. ఇక బిజెపి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవాల్టికి దానికి ఓ దిశా దశ అంటూ లేదు. పైగా ఉమ్మడి మేనిఫెస్టో రూపొందించడం కూడా కూటమికి చేతకాలేదు. అక్కడి దాకా ఎందుకు చాలా చోట్లల్లో అభ్యర్థులు లేకపోతే.. టిడిపి సమకూర్చాల్సి వచ్చింది..
ఇంతటి దుస్థితిలోనూ ఏపీ ప్రజలు కూటమికి జై కొట్టారు. బ్రహ్మరథం పట్టారు.. చంద్రబాబు పరిపాలనకు ఏపీ ప్రజలు దాసోహం అయ్యారు అంటూ టిడిపి మీడియా భజన చేస్తుంది కానీ.. ఏపీ ప్రజలకు వేరే ప్రత్యామ్నయం లేదు. గుడ్డి కన్నా మెల్ల నయం అన్నట్టుగా.. జగన్ కంటే ఆ చంద్రబాబు కాస్త నయం అని ఏపీ ప్రజలు అనుకున్నారు. అందువల్లే కూటమిని గెలిపించారు. అంతే తప్ప ఇందులో ఓటరు ప్రేమ, అనురాగం, ఆవకాయ బద్ద వంటివి లేవు.
ఆంధ్ర ప్రజలు ప్రతిసారి తమ గుంబన తత్వాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఎప్పుడూ అటూ ఇటూ కాని తీర్పు చెప్పలేదు, చెప్పరు కూడా. 2019, 2024 ఎన్నికలలో ఏకపక్షంగా తీర్పు ఇవ్వడమే అసలు సిసలైన వైచిత్రి. వాస్తవానికి గత ఎన్నికల్లో వచ్చిన బంపర్ మెజారిటీని జగన్ మరింత అనుకూలంగా మలచుకుంటే.. ఈ ఎన్నికల్లో తిరుగులేని విధంగా అధికారంలోకి వచ్చేవాడు. వందల మందిని సలహాదారులుగా పెట్టుకున్నాడు, వందలాది కార్పొరేషన్లు ఏర్పాటు చేసి పదవులు ఇచ్చాడు.. అందులో కొంతమంది పెత్తందారులు ఉన్నారు. కానీ ఏ ఒక్కరూ ఉపయోగపడలేదు. ఈ ఐదేళ్లలో ఇదీ నేను చేసింది అని చెప్పుకోవడానికి జగన్ కు ఏదీ లేదు. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా స్థానానికి పరిమితమైనప్పటికీ కెసిఆర్ తన హయాంలో నిర్మించిన సెక్రటేరియట్ ను దర్జాగా ప్రదర్శించగలడు. నరేంద్ర మోడీ అయోధ్య రామాలయాన్ని చూపగలడు. అలాంటి అవకాశం వచ్చినప్పటికీ జగన్ వదులుకున్నాడు.
రీ – టెండరింగ్ పేరుతో పోలవరాన్ని పడుకోబెట్టాడు. కమ్మరావతి అని ప్రచారం చేస్తూ.. పిచ్చి తుగ్లక్ లాగా మూడు రాజధానుల పల్లవి ఎత్తుకున్నాడు. పంచుడు పథకాలు మాత్రమే గెలిపిస్తాయని భ్రమలో జీవించాడు. చివరికి గుంతలు పడిన రోడ్లను కూడా బాగు చేయలేకపోయాడు. ఎస్సీ, ఎస్టీలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించాడు. అనంత బాబు లాంటి వారిని వెనుకేసుకొచ్చాడు.. ప్రజలకు అందుబాటులో ఉండకపోగా.. చివరికి సొంత పార్టీ నాయకులకు కూడా దొరకలేదు. ప్రత్యేక హోదా డిమాండ్ ను అటక మీద పెట్టాడు. ఇంత జరుగుతుంటే ఎల్లో మీడియా చూస్తూ ఊరుకోదు కదా.. టన్నులకొద్దీ నెగెటివిటీని ప్రచారం చేసింది. వారికి షర్మిల కూడా తోడైంది. ఉద్ధరిస్తుందని దగ్గర పెట్టుకుంటే ఐపాక్ డబ్బులు తీసుకుని గాని.. పనికిమాలిన పనులు చేసింది. అంతిమంగా ఆ ఎఫెక్ట్ జగన్ మీద పడింది. అయితే ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా దూరం కావడంతో.. జగన్ ఏం చేస్తాడనేదే ఇప్పుడు అసలు సిసలైన ప్రశ్న.