AP Local Body Elections: ‘యువత ఈ దేశానికి వెన్నెముక.. యువత రాజకీయాల్లోకి రావాలి.. చైతన్యవంతమైన సమాజానికి దోహదపడాలి. యువత దేశ భవితకు దిక్సూచి’.. ఈ మాటలు విని విని విసిగిపోయాం. దశాబ్దాలుగా వింటూనే ఉన్నాం. యువత రాజకీయాల్లోకి వచ్చింది లేదు. సమాజంలో మార్పు వచ్చింది లేదు. ఇప్పుడంతా ‘పైసా కే పరమాత్మ’. ఎంత ఖర్చు పెట్టగలవు? ఎంత తాగించగలవు?.. రాజకీయాల్లో నడుస్తున్న నయా ట్రెండ్ ఇదే. ఇటువంటి తరుణంలో సేవ అనే మాట పక్కకు వెళ్ళింది. పెట్టుబడి అనే కాన్సెప్ట్ తెరపైకి వచ్చింది. ఎంత పెట్టుబడి అధికంగా పెడితే వారికే టికెట్ ఖరారు అవుతుంది. యధా రాజా తథా ప్రజా అన్నట్టు.. దీనికి ప్రజలు కూడా అలవాటు పడిపోయారు. ‘వాడికి అంత కెపాసిటీ లేదటరా’.. అంటూ లైట్ తీసుకుంటున్నారు. సమర్థతను గుర్తించడం లేదు.. నేతల్లో ‘డబ్బు’ సమర్థతను గుర్తించి వారిని ఎన్నుకుంటున్నారు.
Also Read: సో ఇప్పుడు ఆ డిజిటల్ పేపర్ కూడా చదివేవాడు లేడు.. పాపం ఆ యాజమాన్యానికి సినిమా అర్థమైంది..
* మోగిన స్థానిక నగారా
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగరా మోగింది. మరో మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సన్నాహాలు ప్రారంభించింది. దీంతో ఆశావహుల్లో సందడి ప్రారంభం అయింది. ఒకప్పుడు ‘సర్పంచ్’ అంటే ఒక బాధ్యత.. ఒక పెద్ద బరువు.. ప్రజల బాగోగుల్లో, కష్టసుఖాల్లో పాలుపంచుకునే పెద్దన్న పాత్ర. అటువంటి ఔన్నత్యం అయిన పదవి ప్రజా సేవకు ఇష్టపడే వారికి అందించేవారు ప్రజలు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎంత ఖర్చు పెట్టగలవు? ఎన్ని ఓట్లు కొనగలవు? అన్నదే ఇప్పుడు కాన్సెప్ట్. స్థానిక సంస్థల ఎన్నికల పుణ్యమా అని ఖర్చు కూడా పెరిగింది. ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్ గా తీసుకుంటే.. పంచాయితీ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి.. అభ్యర్థులుగా నిలబడిన వారు అప్పుల పాలు కావడమో.. ఆస్తులు అమ్ముకోవడమో జరుగుతుంది. ఇది నిత్య కృత్యమైన చర్య.
* ప్రజాసేవలో ఎందరు?
యువత రాజకీయాల్లోకి వస్తున్నారు. కానీ ఛాన్స్ దక్కించుకునేది కొందరే. అయితే అందులో ఎంత మందికి ప్రజాసేవ చేయాలన్న అభిమతం ఉంది. రాజకీయం అంటే తెల్లటి చొక్కా.. ఆపై దర్పం.. దర్జాతనం.. ఇవే ఇప్పుడు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి. గతంలో గ్రామస్థాయి నాయకుడు స్కూటర్ పై వెళ్లేవాడు. ఎమ్మెల్యే స్థాయినేత అంబాసిడర్ కారుపై వచ్చేవాడు. కానీ ఇప్పుడు గ్రామస్థాయి నేత సైతం ఖరీదైన కారు లేకుండా కాలు బయట పెట్టడం లేదు. ఒంటిపై వేల రూపాయల దుస్తులు లేనిదే బయటకు రావడం లేదు. చేతి ఐదు వేళ్లకు ఉంగరాలు లేనిదే ఊరుకోవడం లేదు. అలాగని అందర్నీ ఒకేసారి కట్టలేం. కానీ ఇప్పుడు మెజారిటీ యువనేతల విషయంలో జరుగుతోంది అదే. ఖరీదైన రాజకీయం చేయకుంటే ప్రోత్సాహం అందడం లేదు. సాధారణ రాజకీయానికి చోటు లేదు.
* అవగాహన అంతంతే..
పంచాయితీ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఆశావహులు ముందుకు రావడం అనేది సర్వసాధారణం. ప్రతి ఒక్కరిలో పదవీకాంక్ష కూడా పెరిగింది. అది సహజ చర్య కూడా. కానీ చాలామందికి పంచాయతీ ఎల్లలు కూడా తెలియవు. పంచాయతీ పై కనీస పరిజ్ఞానం ఉండదు. పంచాయతీ కనీస విధులు ఏంటి? హక్కులు ఏంటి? అన్న కనీస విషయాలు కూడా తెలియని వారు సర్పంచులుగా ఎన్నికవుతున్నారు. గ్రామ భౌగోళిక పరిస్థితులు, సాగునీరు, ఆదాయ వ్యయాలు వంటివి సైతం తెలియదు. అయితే ప్రజలు కూడా ఇవేవీ పట్టించుకోవడం లేదు. సమర్థతను కనీసం లెక్కలోకి తీసుకోవడం లేదు. అంటే ‘యధా రాజా తదా ప్రజా’ అన్నమాట.