Disqualification of YSRCP MLA : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ( YSR Congress party) ఎమ్మెల్సీల రాజీనామా వ్యవహారం కొలిక్కి రావడం లేదు. వారు పదవులకు రాజీనామా చేసి దాదాపు పది నెలలు అవుతోంది. కానీ కనీసం వారి రాజీనామాలు ఆమోదానికి నోచుకోవడం లేదు. ముఖ్యంగా మండలి చైర్మన్ మోసేన్ రాజు ఈ విషయంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత కావడంతోనే ఈ జాప్యం జరుగుతోందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈరోజు విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రఘురాజుపై అనర్హతకు సంబంధించి విచారణ జరగనుంది. పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రఘురామరాజు పై ఫిర్యాదు చేసింది. దీంతో అనర్హత వేటు వేశారు మండలి చైర్మన్ రాజు. దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కోర్టు అనర్హత వేటును నిలిపివేసింది. ఆయన అభిప్రాయాన్ని తీసుకోవాలని ఆదేశించింది. దీంతో ఈరోజు అనర్హత వేటు విచారణకు సంబంధించి రఘురాజుకు నోటీసులు ఇచ్చారు చైర్మన్ మోసేన్ రాజు.
* వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నిక..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు రఘురాజు( Raghuraj ). ఆయనది విజయనగరంలోని శృంగవరపుకోట నియోజకవర్గం. 2019 ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇస్తామని చెప్పి బిజెపి నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రప్పించారు. అంతకుముందు ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గణనీయమైన ఓట్లు సాధించారు. ఆయన చేరికతో 2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఘనవిజయం సాధించింది. అయితే స్థానిక ఎమ్మెల్యేగా ఎన్నికైన వైసీపీకి చెందిన శ్రీనివాసరావు రఘురామరాజును పెద్దగా లెక్క చేయలేదు. ఆపై 2024 ఎన్నికల్లో సైతం శ్రీనివాసరావుకు టికెట్ ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి మొగ్గు చూపారు. దీంతో రఘురాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన క్యాడర్ అంతా టీడీపీలోకి వెళ్లిపోయింది. దీంతో ఎస్ కోటలో టిడిపి అభ్యర్థి కోళ్ల లలిత కుమారి విజయం సాధించారు. అయితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని రఘురాజు పై మండలి లో వైసీపీ విప్ పాలవలస విక్రాంత్ ఫిర్యాదు చేశారు. దీంతో చైర్మన్ మోసేన్ రాజు ఆయనపై అనర్హత వేటు వేశారు.
* ఎన్నికలకు ఈసీ సిద్ధం..
రఘురాజు పై అనర్హత వేటు వేయడంతో.. విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయ్యింది. దీంతో ఎన్నికల సంఘం( Election Commission) అక్కడ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఎన్నికల షెడ్యూల్ కూడా ప్రకటించింది. చివరి నిమిషంలో ఏపీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అనర్హత వేటును నిలిపివేసింది. ఆయన అభిప్రాయాన్ని తీసుకొని విచారణ చేపట్టాలని మండలి చైర్మన్ మోసేన్ రాజుకు సూచించింది. ఈ తరుణంలో ఈరోజు మండలి చైర్మన్ మోసేన్ రాజు.. విజయనగరం ఎమ్మెల్సీ రఘురాజుకు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాలంటూ ఆదేశాలు ఇచ్చారు.
* 10 నెలల కిందట రాజీనామా..
మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓ ఆరుగురు వరకు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. 10 నెలల కిందట కర్రీ పద్మశ్రీ, పోతుల సునీత( putula Sunita ), బల్లి కళ్యాణ చక్రవర్తి ఎమ్మెల్సీ పదవులతో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అటు తరువాత జయ మంగళం వెంకటరమణ, మర్రి రాజశేఖర్, మండలి డిప్యూటీ చైర్ పర్సన్ జియాఖాన్ వంటి వారు వరుసగా రాజీనామా బాట పట్టారు. శాసనమండలి చైర్మన్ ఫార్మేట్లో రాజీనామా చేశారు. అయినా సరే వారి రాజీనామా ఆమోదానికి నోచుకోలేదు. కానీ రఘురాజు విషయంలో మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మొండి పట్టుదలతో ఉంది. మరి ఎలాంటి పరిణామాలు జరుగుతాయి చూడాలి.