Andhra Pradesh Gold Mine: జాతీయస్థాయిలో మరో అరుదైన ఘనత సాధించనుంది ఏపీ ప్రభుత్వం. దేశంలోనే ప్రైవేట్ రంగంలో తొలి బంగారు గని ఏపీలో ప్రారంభం కానుంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో ఈ గని అందుబాటులోకి వచ్చింది. తొలి దశ ప్రాసెసింగ్ యూనిట్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. రెండో దశ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. దేశంలోనే ప్రైవేటు రంగంలో అందుబాటులోకి వస్తున్న బంగారం గని ఇది. గత 20 సంవత్సరాలుగా ఈ గని అభివృద్ధి చేశారు. ఇప్పుడు గని ఉత్పత్తి ప్రారంభం కానుంది. దేశంలోనే ఇదో కీలక ప్రాజెక్ట్ అని.. రాయలసీమకి మణిహారం గా నిలిచే ఛాన్స్ సొంతం చేసుకుంది. ఒక్క కర్నూలు జిల్లా మాత్రమే కాదు అనంతపురం తో పాటు చిత్తూరు జిల్లాలో కూడా బంగారు గనులు ఉన్నాయి. వాటిని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
* 1500 ఎకరాల విస్తీర్ణంలో..
జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ సంస్థలు సంయుక్తంగా.. దాదాపు 400 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో 1500 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును తలపెట్టాయి. గత కొన్ని దశాబ్దాలుగా జియో లాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తో పాటు ప్రైవేట్ సంస్థలు విస్తృత పరిశోధనలు జరిపి.. ఇక్కడ బంగారు నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. ఈ గన్నుల్లో 50 టన్నుల వరకు పసిడి నిల్వలు ఉండవచ్చు అని భూగర్భ గనుల శాఖ అంచనా వేస్తోంది. ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తయింది. ఈరోజు నుంచి పూర్తిస్థాయి వాణిజ్య ఉత్పత్తి ప్రారంభం కానుంది. ఈ ఏడాది ఈ ప్రాజెక్టు ద్వారా 400 కిలోల ఉత్పత్తిని చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వచ్చే ఏడాదికి 900 కిలోలకు.. ఆ తరువాత 2000 కిలోలను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్లాంట్ కు హింద్రినావా నుంచి అవసరమయ్యే నీటిని సరఫరా చేయనున్నారు. 18 కిలోమీటర్ల పైప్ లైన్ నిర్మించి నీటిని అందిస్తున్నారు.
* ప్రభుత్వానికి ఆదాయం..
బంగారు గనికి సంబంధించి ప్రాజెక్టు వల్ల ప్రభుత్వానికి గణనీయంగా ఆదాయం సమకూరు నుంది. నాలుగు శాతం రాయల్టీ దక్కనుంది. స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింతగా మెరుగుపడనున్నాయి. తొలి ఏడాది రూ.57 కోట్లు, రెండో ఏడాది రూ.147 కోట్లు ఆదాయం రూపంలో రానుంది. ప్రత్యక్షంగా 700 మందికి ఉపాధి దొరకనుంది. దేశంలో బంగారు గని రూపంలో మరోసారి ఏపీ పేరు ప్రముఖంగా మారుమోగిపోవడం ఖాయం. ఇదే స్ఫూర్తితో రాయలసీమలోని మిగతా ప్రాంతాల్లో బంగారగనుల విస్తరణకు ఒక అవకాశం దక్కనుంది. కాగా ఈరోజు సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసింది కర్నూలు జిల్లా యంత్రాంగం.
