Global Investment Summit: ప్రపంచ పెట్టుబడుల సదస్సులో ఏపీ సత్తా చాటుతోంది. పెద్ద ఎత్తున పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షిస్తోంది. సీఎం చంద్రబాబు నేతృత్వంలో ప్రత్యేక బృందం ప్రపంచ పెట్టుబడుల సదస్సుకు హాజరైంది. మంత్రి నారా లోకేష్ సైతం ఈ బృందంలో ఉన్నారు. అయితే మన దేశం నుంచి పది రాష్ట్రాలు పెవిలియన్లు ఏర్పాటు చేశాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు పోటీపడ్డాయి. కానీ అందులో ఏపీ ముందు వరుసలో నిలవడం విశేషం. చంద్రబాబు నేతృత్వంలో దావోస్ పర్యటన ఏపీ పారిశ్రామిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం అని టాక్ నడుస్తోంది. ముఖ్యంగా ఆర్ఎంజెడ్ గ్రూపు లక్ష కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. అయితే లక్ష కోట్లు అనేది సంఖ్యా మాత్రమే కాదు. లక్షలాదిమంది యువత కలలను సాకారం చేసే ఒక భరోసా. విశాఖను డిజిటల్ రాజధానిగా, రాయలసీమను లాజిస్టిక్స్ హబ్ గా మార్చబోతున్న ఈ ప్రాజెక్టులు.. రాష్ట్ర జిడిపి ని పరుగులు పెట్టిస్తాయి అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. దేశంలో ఏపీని అగ్రగామిగా, పెట్టుబడుల గమ్యస్థానంగా నిలబెట్టనున్నాయి.
ప్రముఖ రియల్ ఎస్టేట్ దిగ్గజంగా ఆర్ఎంజెడ్ ఉంది. ఏపీలో దాదాపు లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే దేశంలో లక్షమందికి ఉద్యోగాలు అందించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వంతో ఆర్ఎం జెడ్ ఒప్పందాలు కూడా చేసుకుంది. రాబోయే ఐదు,ఆరు సంవత్సరాల్లో మూడు ప్రధాన రంగాల్లో ఈ పెట్టుబడులు రానున్నాయి. విశాఖపట్నంలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ హబ్ గా, డేటా సెంటర్ క్లస్టర్ గా మార్చేందుకు.. రాయలసీమలో ఇండస్ట్రియల్,, లాజిస్టిక్స్ పార్కు ఏర్పాటుకు ఆర్ ఎం జెడ్ ముందుకు రావడం విశేషం.
* విశాఖలోని కాపులుప్పాడ ఐటీ పార్కులు 50 ఎకరాల విస్తీర్ణంలో.. పది మిలియన్ చదరపు అడుగుల భారీ జిసిసి పార్కును ఆర్ఎంజెడ్ అభివృద్ధి చేయనుంది. ఇది అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలను ఆకర్షించడమే కాకుండా.. ఉత్తరాంధ్రలో ఐటి ఎకో సిస్టంను సమూలంగా మార్చి వేయనుంది. భవిష్యత్తు తరాల కోసం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సేవలు అందించేందుకు గాను.. విశాఖ పరిసరాల్లో 1 గిగావాట్ సామర్థ్యంతో భారీ హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్లస్టర్ను ఏర్పాటు చేయనున్నారు. 500 నుంచి 700 ఎకరాల్లో విస్తరించే ఈ ప్రాజెక్టు గ్రీన్ ఎనర్జీ ఆధారంగా పనిచేయనుంది.
* మరోవైపు రాయలసీమలో ఇండస్ట్రియల్ లాజిస్టిక్స్ పార్కు ఏర్పాటు చేసేందుకు కూడా ఆర్ఎం జెడ్ ముందుకు వచ్చింది. టేకులపల్లి వద్ద వెయ్యి ఎకరాల్లో భారీ ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్స్ పార్కు ఏర్పాటు కానుంది. దీనివల్ల తయారీ, రవాణా రంగాల్లో వేల సంఖ్యలో యువతకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
* మరోవైపు మూడో రోజు ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశం అవుతూ వస్తున్నారు చంద్రబాబు. దావోస్ లోని ఏపీ లాంజ్ లో చంద్రబాబుతో ఆర్సెలర్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్, సీఈఓ ఆదిత్య మిట్టల్ సమావేశం అయ్యారు. మంత్రులు నారా లోకేష్ తో పాటు టీజీ భరత్ కూడా పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లాలో ఆర్సెలర్ మిట్టల్ భారీ ఉక్కు కర్మాగార పురోగతిపై చర్చించారు. తొలి దశలో దాదాపు 60 వేల కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చారు. వివిధ దశల్లో ఉన్న అనుమతులు, భూ సేకరణ వంటి వాటిపై చర్చించారు. ఫిబ్రవరి 15 తేదీలోగా అన్ని అనుమతులు పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
* ప్రముఖ హాస్పిటాలిటీ సంస్థ తమారా లీజర్ సీఈవో సృష్టి సిబులాల్ తో కూడా చంద్రబాబు సమావేశమయ్యారు. పర్యాటక రంగ ప్రాజెక్టులకు సంబంధించి చర్చించారు. ప్రధానంగా పోలవరం నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరంలోనూ.. కోనసీమ, గండికోట,, అరకు, లంబసింగి వంటి ప్రాంతాల్లో పర్యాటక ప్రాజెక్టుల ఏర్పాటుకు చర్చించారు. దీనిపై తమారా లీజర్ సమస్త సానుకూలంగా స్పందించింది. ఎకో టూరిజం ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆసక్తిగా ఉన్నామని చెప్పింది.
* మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలోనూ పెట్టుబడులు పెట్టేందుకు కాలిబో ఏఐ అకాడమీ, వట్టికూటి ఫౌండేషన్ ముందుకు వచ్చింది. విశ్వవిద్యాలయాల స్థాయిలో ప్రత్యేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు అందించేందుకు కూడా సీఎం ప్రతిపాదించారు. విశాఖపట్నంలోని మధురవాడ ఐటి సెజ్ లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని కాలిబో సంస్థను చంద్రబాబు ఆహ్వానించారు. మొత్తానికి అయితే ప్రపంచ పెట్టుబడుల సదస్సులో తన హవా చాటుతోంది ఆంధ్రప్రదేశ్.