Site icon OkTelugu

Andhra Pradesh Heatwave Alert 2026: మండుతున్న ఎండలు… ఈ ప్రాంతాల వారికి అలర్ట్..

IMD Weather Alert

IMD Weather Alert

Andhra Pradesh Heatwave Alert 2026: తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగానే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉష్ణోగ్రత నుంచి తట్టుకోవడానికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని Andhra Pradesh State Disaster Management Authority (APSDMA)హెచ్చరించింది. అయితే రాష్ట్రంలో ఒకవైపు తీవ్రమైన ఎండలు, మరోవైపు పిడుగులతో కూడిన అకాల వర్షాలు నమోదయ్యే అవకాశముందని తెలిపింది. ఈ వాతావరణ మార్పులు ప్రజల ఆరోగ్యంతో పాటు భద్రతకు కూడా ప్రమాదకరమని అధికారులు సూచిస్తున్నారు. ఇలాంటి సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు.

ఈ సమ్మర్ సీజన్‌లో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతల్లో ఏప్రిల్ 10వ తేదీన Kakinada జిల్లా కరపలో నమోదైంది. అక్కడ 44.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవడం రాష్ట్రంలో పెరుగుతున్న ఎండల తీవ్రతను సూచిస్తోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ప్రజలు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు.

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. ఏప్రిల్ 11వ తేదీన రాష్ట్రంలోని 66 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 79 మండలాల్లో సాధారణ వడగాలులు వీచే అవకాశం ఉంది. ఈ వడగాలులు శరీరంలో నీటి లోపం, డీహైడ్రేషన్, సన్‌స్ట్రోక్ వంటి సమస్యలకు దారితీయవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

మరోవైపు, వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులు చోటుచేసుకోవడంతో రేపు పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులు ఉండే అవకాశం ఉండటంతో ప్రజలు బయట ఉండేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. పిడుగులు పడే సమయంలో చెట్ల కింద లేదా ఓపెన్ ప్రదేశాల్లో నిలబడటం ప్రమాదకరమని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు కొన్ని ముఖ్య జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య బయటికి వెళ్లకపోవడం మంచిదని, అవసరమైతే టోపీ, కాటన్ దుస్తులు, కళ్లజోడు ధరించాలని తెలిపారు. అలాగే ఎక్కువగా నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు వంటి ద్రవాలను తీసుకోవడం ద్వారా శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవాలని సూచించారు.

ఈ వేసవిలో ఎండల తీవ్రతతో పాటు అకాల వర్షాలు, పిడుగుల ముప్పు రెండూ కలిసి ప్రజలకు సవాల్‌గా మారుతున్నాయి. అందువల్ల వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రమాదాలను నివారించుకోవాలని APSDMA విజ్ఞప్తి చేసింది.

Exit mobile version