Skill Census : ఏపీలో నైపుణ్య గణన చేపట్టనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఫైళ్లపై చంద్రబాబు సంతకం చేశారు. అందులో నైపుణ్య గణన ఒకటి. ఏపీలో తొలిసారిగా నైపుణ్య గణనకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలో యువత, చదువుకున్న వారితో పాటు ప్రజలందరి నైపుణ్యాలను గణించే దిశగా అడుగులు వేస్తున్నారు. స్కిల్ సెన్సెస్ అంటే కేవలం చదువులు పూర్తిచేసి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారిని మాత్రమే పరిగణలోకి తీసుకునేవారు. కానీ ఈసారి కూటమి ప్రభుత్వం భిన్నంగా 15 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసున్న అందరి నైపుణ్యాలను గణన చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3.5 కోట్ల మంది నైపుణ్యాలు మెరుగుపరుచుకునేందుకు ఆసక్తిని తెలుసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నైపుణ్య గణనకు సంబంధించి నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రత్యేకంగా యాప్ ను రూపొందిస్తోంది. కేవలం ఉద్యోగాల కోసం ఎదురు చూసే యువతకు మాత్రమే కాకుండా.. చేతివృత్తులు, ఇతరత్రా పనులకు సంబంధించి వృత్తిని గణనలోకి తీసుకోనుంది. అప్పుడే ప్రజలు ఏయే రంగాల్లో నైపుణ్యం కలిగి ఉన్నారో అన్నది స్పష్టంగా తెలియనుంది. తద్వారా ఆయా రంగాల్లో వారికి ఉపాధి, ఉద్యోగాలు మెరుగుపరిచేందుకు అవకాశం ఉంటుంది. టిడిపి ఎన్నికల మేనిఫెస్టోలో సైతం నైపుణ్య అభివృద్ధికి ఎంతగానో ప్రాధాన్యమిచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే నైపుణ్య గణన చేస్తామని ప్రకటించింది. అందుకేసీఎం గా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నైపుణ్య గణనకు సంబంధించి ఫైల్ పై సంతకం చేశారు.ఇప్పుడు ఏకంగా గణన చేపట్టడానికి సిద్ధపడుతున్నారు.
* వ్యవసాయ రంగంలోనూ..
మనది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. రాష్ట్రంలో సింహభాగం ప్రజలు వ్యవసాయ రంగం పైనే ఆధారపడి బతుకుతున్నారు. ఈ తరుణంలో గణనలో వ్యవసాయానికి సంబంధించిన వారిని గుర్తించి.. ఆధునిక వ్యవసాయ పద్ధతుల తో సాగుకు ప్రోత్సహిస్తారు. ఆధునిక వ్యవసాయం కోసం యంత్రాలు, పరికరాలు అందిస్తారు. ఇతరత్రా రంగాల్లో ఉన్న నైపుణ్యాలను గుర్తిస్తారు. అందుకు అనుగుణంగా ప్రోత్సాహాలు అందించనున్నారు. ఒకవేళ గృహిణులు అయితే వారి చదువు, గతంలో పోటీ పరీక్షలు రాశారా? వారి ఆసక్తి ఏంటి అనే అంశాలను తెలుసుకుంటారు. మొత్తం ఈ రెండు నెలల్లో గణన పూర్తి చేయాలని భావిస్తున్నారు.
* ఎక్కడ ఉన్నా అంచనా
రాష్ట్ర ప్రజలు ఎక్కడ ఉన్నా వారి నైపుణ్యాలను అంచనా వేస్తారు. ప్రభుత్వం రూపొందించే యాప్ లో ఓటీపీ ద్వారా లాగిన్ చేసి ప్రజలు వ్యక్తిగతంగా వారి నైపుణ్య వివరాలను అప్ లోడ్ చేయవచ్చు. ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో ఉండే వారి వివరాలను కూడా సేకరిస్తారు. రాష్ట్రంలో ఉన్న వారి వివరాలు సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి నమోదు చేస్తారు. ఒక్కొక్కరు 20 మంది వివరాలను మాత్రమే తీసుకొనేలా పక్క సమాచారం అందుబాటులో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.
* ప్రతి వృత్తిలోనూ
ప్రతి వృత్తిలోనూ నైపుణ్యాల స్థాయిని అంచనా వేయనున్నారు. వారి నైపుణ్యాలను కేటగిరీల వారిగా వర్గీకరిస్తారు. వారికి భవిష్యత్తులో ఎవరు ఎలాంటి ఉద్యోగం, ఉపాధి అవసరమో గుర్తిస్తారు. ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో అనుసంధానిస్తారు. పరిశ్రమల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ఈ గణన ఎంతగానో దోహదపడే అవకాశం ఉంది. అయితే కేవలం గణనకే పరిమితం కాకుండా.. తదుపరి చర్యలు ఉంటే మాత్రం ఈ కార్యక్రమం విజయవంతం అయినట్టే.మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.